బ్రిటిష్ వారిని చీల్చి చెండాడిన తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు, కత్తి పట్టి తెల్లోడి తలల్ని తెగ నరికివేసిన సీమ సింహం, దాదాపుగా 80 గ్రామాల ప్రజలకు ఆరాధ్య దైవం, తనని నమ్మిన ప్రజలకోసం ప్రాణత్యాగం చేసిన ఒక గొప్ప పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు. మరి ఆయన పోరాటం ఎలా మొదలైంది? బ్రిటిష్ అధికారులు ఎందుకు ఆయన తలని 30 సంవత్సరాల పాటు ఉరికంబానికి వ్రేలాడదీసారు అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, రూపనగుడి గ్రామంలో నరసింహారెడ్డి జన్మించారు. జానపద వీరగాధల ఆధారంగా ఆయన పెరిగింది మాత్రం ఉయ్యాలవాడ లో అని చెబుతారు. అయితే విజయనగర రాజుల కాలం నుండి పాలెగాండ్ల వ్యవస్థ అనేది ఉండేది. అంటే ఒక్కో పాలెగాడి అధీనంలో 70 కి పైగా గ్రామాలూ ఉండేవి. వీరు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడం, ప్రజల అవసరాలను తీరుస్తూ పాలనా అనేది కొనసాగిస్తుండేవారు. ఇక కడప జిల్లాలోని జమ్మలమడుగు నుండి కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల వరకు ఉన్న భూభాగాన్ని చెంచురెడ్ల వంశానికి చెందిన నొస్సం పాలెగాండ్లు పరిపాలిస్తుండేవారు. ఈ వంశానికి చెందిన ఒకరు జయరామిరెడ్డి. ఈయన మన్రో హయాంలో బ్రిటిష్ వారిని ఎదురించి వారికీ బంధీ అయిపోయాడు. అప్పుడు నొస్సం అంత కూడా బ్రిటిషువారి సొంతమైంది. అప్పుడు బ్రిటీషువారు వీరి వంశానికి 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణం ఏర్పాటు చేసారు. ఇది ఇలా ఉంటె, జయరామిరెడ్డి కొడుకుకు సంతానం లేకపోవడంతో అతని సోదరి కుమారుడు అయినా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని దత్తత తీసుకున్నారు.
అయితే పాలించే అధికారం లేనప్పటికీ వీరి వంశానికి ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉండేది. జయరామిరెడ్డి అనంతరం ఆయన వారసత్వంగా నరసింహారెడ్డికి బ్రిటిష్ వారి నుండి ప్రతి నెల 11 రూపాయల భరణం వస్తుండేది. ఈవిధంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వయసు దాదాపుగా 40 సంవత్సరాలు ఉన్నపుడు, వారికీ అందవలసిన భరణం తీసుకురమ్మని అతడి భటులను పంపగా అప్పటి తహశీల్ధార్ రాఘవాచారి నరసింహారెడ్డిని హేళన చేస్తూ మాట్లాడుతూ, అతడినే రమ్మని చెప్పు అప్పుడే భరణం ఇస్తానంటూ చెప్పడంతో, అది తెలిసిన నరసింహారెడ్డికి కోపం కట్టలు తెచ్చుకొని, నేనే వస్తున్న రావడమే కాదు నీ సైన్యాన్ని ఎదిరించి నీ తలని నరికి ఖజానా కొల్లగొట్టబోతున్న సిద్ధంగా ఉండు అంటూ ఒక లేఖని పంపి, తను చెప్పిన విధంగానే 1846 జూలై 10న మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో కోవెలకుంట్లలోని ట్రెజరీపై తన సైన్యంతో దాడి చేశాడు. ఇక తనని అవమానపరుస్తూ మాట్లాడిన తహసీల్దారు రాఘవాచారి తలను నరికి, ట్రెజరీ అధికారి అయినా థామస్ ఎడ్వర్టుకి గుండు గీయించి, నీ బ్రిటిష్ అధికారులకు దమ్ముంటే మరుసటి రోజు సాయంత్రం నయనాలప్ప వద్ద కలుసుకోమను బ్రిటిష్ సైన్యానికి సవాలు విసరడమే కాకుండా, ట్రెజరీ నుండి ఎనిమిది వందల అయిదు రూపాయల పది అణాల నాలుగు పైసలను తీసుకువెళ్లాడు.
ఇలా నరసింహరెడ్డి తహసీల్దారు రాఘవాచారి తలను నరికివేసాడని అప్పటి కడప కలెక్టర్ కాక్రేన్ కి తెలియడంతో తీవ్ర ఆగ్రహానికి గురై వెంటనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోటపైన దాడి చేయాలంటూ బళ్లారిలోని బ్రిటీషు బ్రిగేడియర్ జనరల్ వాట్సన్‌ను ఆదేశించడంతో 1846 జూలై 23 వ తేదీన బ్రిటిష్ సైన్యం నొస్సం కోటపై దాడికి వచ్చింది. కానీ ఇది ముందే పసిగట్టిన నరసింహారెడ్డి, కోట చుట్టూ వేగంగా నడవడానికి వీలులేకుండా పొలాలని తడిపించాడు, కావాల్సినంత మందుగొండు సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నాడు, బ్రిటిష్ సైన్యం కోటని ఎక్కడానికి ప్రయత్నిస్తే వారి పైన సల సల కాగే నూనెని పోసేందుకు అన్ని సిద్ధం చేసుకోగా, ఒక భీకర యుద్ధం మొదలవ్వగా నరసింహారెడ్డి తన ముందుచూపుతో బ్రిటిష్ సైన్యాన్ని వణికించాడు. యుద్ధంలో బ్రిటిష్ సైన్యం నశించడంతో జనరల్ వాట్సన్ అక్కడి నుండి పారిపోతుండగా అతడిని వేటాడి అతడి తలని నరికివేసాడు. ఇక బ్రిటిష్ సైన్యం పెద్ద ఎత్తున మళ్ళీ వస్తే ప్రమాదం అని కొందరు సూచించడంతో కోట నుండి బయలుదేరి నల్లమల అడవుల్లో కట్టించిన వనదుర్గానికి తన మాకాన్ని మార్చేశాడు. అయితే ఈ వనదుర్గానికి దగ్గర్లో రుద్రవరం అనే ఒక గ్రామం ఉండేది. వీరు అడవి పైన ఆధారపడుతూ జీవిస్తూ ఉండేవారు. కానీ అడవిలోకి వెళ్లి ఏది తీసుకోవాలన్న కూడా పన్ను కట్టాలంటూ పీటర్ అనే అటవీ అధికారి ఉత్తరువులు జారీ చేసి ప్రజల్ని పన్ను కట్టాలంటూ తీవ్రంగా హింసించడమే కాకుండా ఆడవారిని అత్యాచారం చేసి చంపివేస్తుండేవాడు. ఈ విషయాన్నీ ఒక వ్యక్తి వచ్చి వనదర్గంలో ఉంటున్న నరసింహారెడ్డికి చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆ అటవీశాఖ అధికారి అయినా పీటర్ నీ వేటాడి వెంటాడి మరి తలని నరికివేసి చంపివేసాడు.
ఇక బ్రిటిష్ అధికారులు లాభం లేదు ఎలాగైనా నరసింహారెడ్డిని మట్టుబెట్టాలని తలచి, ఆచూకీ తెలిపితే 5 వేలు, సజీవంగా లేదా నిర్జీవంగా పట్టిస్తే 10 అంటూ దండోరా వేయించింది. ఆ కాలంలో 10 వేల రూపాయలు అంటే మాములు విషయం కాదు. నరసింహారెడ్డి ఎంతో ఇష్టంగా కట్టుకున్న కోటని ధ్వసం చేసారు. అప్పుడు తన స్థావరం ఎవరికీ తెలియకూడదు అని భావించి, బ్రిటీష్ వారిని ఎదుర్కొనేందుకు ఇతర గ్రామాల పాలెగాళ్ళ సహాయాన్ని కోరాడు. కానీ ప్రజలంతా తన వైపు ఉంటె తన శత్రువు తన ఇంటినుండే పుట్టుకొచ్చాడు. అతడే నరసింహారెడ్డి అన్న మల్లారెడ్డి. ప్రజల్లో మొదటినుండి మంచి పేరు సాధించిన నరసింహారెడ్డి తన కంటే చిన్నవాడు అంతటి ఆదరణ పొందడం చూసి ఓర్వలేని మల్లారెడ్డి, నరసింహారెడ్డి పతనం కోసం ఎదురుచూస్తుంటే ఆ అవకాశం బ్రిటిష్ వారి నుండి వచ్చింది. దాంతో నరసింహారెడ్డి భార్య , పిల్లలు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని బ్రిటిష్ వారికి తెలియచేయడంతో వారు వాళ్ళని ఒక బంగ్లాలో బంధించారు. అది తెలిసిన నరసింహారెడ్డి ఒక రాత్రి వచ్చి బ్రిటిష్ అధికారి మీద కత్తి ఎక్కుపెట్టి ధైర్యంగా ఆయన భార్య పిల్లల్ని విడిపించుకొని వెళ్లారు.
ఇదంతా చూసిన బ్రిటిష్ అధికారులకి, నరసింహారెడ్డి పైన యుద్ధం చేసి ఎప్పటికి గెలవలేమని భావించి, ప్రజల కోసం ఏదైనా చేస్తాడని తెలుసుకొని అతడి అధీనంలో ఉన్న 70 గ్రామాల ప్రజలపైన ఒకేసారి బ్రిటిష్ సైన్యం విరుచుకుబడింది. కనిపించిన ప్రతి ఒక్కరిని ఎక్కడ నరసింహారెడ్డి అంటూ చిత్ర హింసలకు గురిచేయడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వారికీ ఇలా చేయమని సలహా ఇచ్చింది అతడి అన్న మల్లారెడ్డి. అయితే తన కారణంగా ప్రజలు చిత్రహింసలకు గురవ్వడం చూసి తట్టుకోలేని నరసింహారెడ్డి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఇలా 1856 అక్టోబర్ 6 వ తేదీన నరసింహారెడ్డి ఆచూకీ తెలుసుకొని బ్రిటిష్ సైన్యం బయలుదేరగా, వారితో వీరోచితంగా పోరాడి తన దగ్గర ఉన్న తూటాలన్నీ అయిపోయినప్పటికీ కత్తితో బ్రిటిష్ సైన్యాన్ని మట్టుబెడుతుండగా, క్రమక్రమంగా బ్రిటిష్ అధికారులు వారి సైన్యాన్ని పెంచుకుంటూ పోగా, నరసింహారెడ్డి సైన్యం పూర్తిగా నాశనం అయింది. ఇలా వారితో యుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడిన ఆయన్ని చివరకి బ్రిటిష్ సైన్యం పట్టుకొని బంధించింది. ఇలా బందీగా పట్టుకొని బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని బహిరంగ ఉరి వేయాలంటూ తీర్పుని ఇచ్చింది. దీంతో ప్రజలు అందరుకూడా తమ దొరని చివరిసారిగా చూసుకునేందుకు రాగా ప్రజలను ఉద్దేశిస్తూ నా ఉద్యమం ఇంతటితో అయిపోలేదు ఎప్పటికి మీలో బ్రతికే ఉంటుందని పిలుపునిస్తూ చిరునవ్వుతో ప్రజలకి అభివాదం చేస్తూ ఉరికంబాన్ని ఎక్కాడు. అయితే ఇన్ని రోజుల పాటు బ్రిటిష్ అధికారులను వణికించిన నరసింహారెడ్డి లా మరొకరు పుట్టకుండా ప్రజల్లో భయాన్ని కలిగించాలని బ్రిటిష్ అధికారులు ఆయన తలని కోయిలకుంట్ల కోట గుమ్మానికి ఇనుపసంకెళ్ల మధ్య వేలాడదీశారు. ఇలా 30 సంవత్సరాల పాటు ఆయన తలా అలానే వ్రేలాడుతూ ఉండిపోయింది.
సిపాయిల తిరుగుబాటు కంటే ముందే ప్రజలకి బ్రిటిష్ వారి నుండి విముక్తి లభించాలంటూ బ్రిటిష్ సైన్యాన్ని వెంటాడి వేటాడి బ్రిటిష్ అధికారులను హడలెత్తించిన తొలి తరం స్వాతంత్ర్య సమరయోధుడు, తన కత్తితో శత్రువుల తలలని తెగ నరికిన సీమ సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పోరాటం చరిత్రలో చిరస్మరణీయం.