వర్షాలు పడుతుంటే ఎవరికైనా వేడి వేడిగా పకోడీ, బజ్జీలు, సమోసాలు లాగించేయాలనిపిస్తుంది. కానీ వాటి వలన ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం ఉంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఆరోగ్యంపై జాగ్రత్త చాలా అవసరం. ఈ సీజన్‌లో జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వానాకాలంలో ఇమ్యూనిటీని కాపాడుకోవాలి. ఈ సీజన్‌లో రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు కొన్ని ప్రత్యేక పండ్లు తినాలి.
వర్షాకాలంలో వచ్చే వ్యాధులను దూరంగా ఉంచేందుకు మనకు అందుబాటులో ఉండే కొన్ని పండ్లు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని పెంచుకుని రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. బొప్పాయి, లిచీ, యాపిల్, పియర్ వంటి సీజనల్ ఫ్రూట్స్ వర్షాకాలంలో ఆరోగ్యానికి మంచిది. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి. అలాగే శరీరానికి అవసరమైన న్యూట్రీషియన్లను అందిస్తాయి. సీజనల్ పండ్లను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.
లిచీ: లిచీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆస్తమా ఉన్నవారికి సహాయపడతాయి. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులను నివారిస్తాయి. శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. లిచి రోగనిరోధక వ్యవస్థను పెంపొందించడానికి సహాయపడుతుంది. లిచీలో ఉండే ఫైబర్‌లు అసిడిటీ, అజీర్ణం సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. లిచీలోని విటమిన్ సి వర్షాకాలంలో వచ్చే సాధారణ జలుబు సమస్యలను తగ్గిస్తుంది. చర్మం మీద ఉన్న మచ్చలను తొలగిస్తుంది. ఈ పండుని ఎక్కువగా ఐస్ క్రీం, జెల్లీలలో విస్తృతంగా ఉపయోగిస్తారు.
నేరేడు : వర్షాకాలంలో ఎక్కువగా దొరికేవి నేరేడు పండ్లు. నేరేడును పండ్లలో రాజు అని కూడా అంటారు. నేరేడు విటమిన్లు, పొటాషియం, ఫోలేట్ మరియు ఐరన్ వంటి పోషకాల యొక్క శక్తి కేంద్రం. ఈ పోషకాలన్నీ వర్షాకాలంలో చాలా సహాయకారిగా ఉంటాయి. ఇందులో కేలొరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి నేరేడు మంచి ఉపాయంగా చెప్పవచ్చు. ఇవి అజీర్తి సమస్యను తగ్గిస్తాయి. నేరేడు పండ్లు మూత్రపిండాలు, కాలేయ పని తీరును మెరుగుపరుస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, మధుమేహం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.
ఆపిల్: ఏడాది పొడవునా దొరికే కొన్ని పండ్లలో ఆపిల్ ఒకటి. ఈ పండులో అన్ని పోషకాలు పుష్కలంగా ఉన్నాయి- విటమిన్లు A, B1, B2 మరియు C మరియు ఖనిజాలు భాస్వరం, అయోడిన్, కాల్షియం మరియు ఇనుము. ఈ పోషకాలు ఎముక, చర్మం, కండరాలు, నరాల మరియు మెదడు అభివృద్ధికి ఎంతో అవసరం. ఏ రూపంలోనైనా ఆపిల్స్ తినవచ్చు- జామ్‌లు, జెల్లీలు, జ్యూస్ రూపంలోనూ, గుజ్జుగా చేసుకుని తినవచ్చు. శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుంది. అన్ని వయసుల వారికి ఆపిల్స్ అవసరం.
అరటి : అరటిలో విటమిన్లూ, మినరల్స్ అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసే శక్తి అరటికి ఉంది. అరటిలో సహజ యాంటాసిడ్ ఉంటుంది. ఇది కడుపు సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. అజీర్తి సమస్య ఉండదు. అదేవిధంగా అరటిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో అధిక ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. పిల్లలకు రోజూ ఓ పండు తినిపించాలి. దీంతో శరీరానికి శక్తి అందడమే కాదు, పొట్ట నిండిన భావన కూడా కలుగుతుంది.
దానిమ్మ: పోషకాలు అధికంగా ఉండే దానిమ్మపండు వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు అధిక రక్తపోటు, క్యాన్సర్, గుండె జబ్బు వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. B- విటమిన్లు, ఫోలేట్ ఉండటం వలన ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, రక్త ప్రసరణకు తోడ్పడతాయి. సలాడ్ లేదా పెరుగు అన్నంలో వేసుకుని తింటే రుచిగా ఉంటుంది. రోజూ ఓ గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగితే రక్త వృద్ధి కలుగుతుంది.
బొప్పాయి: విటమిన్ ‘సి’ అధికంగా లభించే బొప్పాయి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వానాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు ఎక్కువ. ఇందులో విటమిన్ “ఏ”, విటమిన్ “బీ”, విటమిన్ “డీ”లు తగుమోతాదులో ఉన్నాయి. తరచూ బొప్పాయిపండును ఆహారంగా తీసుకుంటుంటే శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో పెప్సిన్ అనే పదార్థం ఉండటం వలన జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అయితే బొప్పాయిని మితంగా తీసుకుంటేనే మంచిది.
చెర్రీ: వర్షాకాలంలో చెర్రీస్ పుష్కలంగా లభిస్తాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి మరియు యాంటీఆక్సిడెంట్‌లు ఉంటాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. ఇవి కాకుండా, చెర్రీలు శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి. అవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. అధిక రక్తపోటు మరియు యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.