తిరుమల తిరుపతి లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలివచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వేంకటేశ్వరుని దివ్య సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. మరి తిరుమల తిరుపతి లో గోవిందరాజస్వామిని వెంకటేశ్వరస్వామికి అన్న అని ఎందుకు అంటారు ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, తిరుపతిలో రైల్వేస్టేషన్ కి దగ్గరలో కోనేటు గట్టున గోవిందరాజస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో ఉన్న గోవిందరాజస్వామి తిరుమల వేంకటేశ్వరస్వామి కి అన్నగా చెబుతారు. స్థలపురాణం ప్రకారం, తన తమ్ముడైన శ్రీనివాసుడి వివాహానికి కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయిన గోవిందరాజస్వామి వారు దిగువ తిరుపతికి వచ్చి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడట. అందుకే ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం కుంచాన్నే తలగడగా చేసుకొని నిద్రిస్తున్నట్లుగా భక్తులకి దర్శనం ఇస్తుంటుంది. తిరుపతిలో తప్పక దర్శించవలసిన ఆలయాలలో గోవిందరాజస్వామి ఆలయం కూడా ఒకటి.
ఇక తిరుపతిలో వేంకటేశ్వరస్వామి ఆలయంలాగే ఈ ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్ధతులే పాటిస్తారు. ఇంకా ఈ ఆలయానికి రెండు గోపురాలు ఉండగా, గర్భగుడిలోని గోవిందరాజస్వామి వారు శేషశాయి ఆదిశేషునిపై పడుకొని ఉన్నట్లుగా , శంకు చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై దర్శనం ఇస్తుండగా, శ్రీ పార్ధసారధి, శ్రీ రుక్మిణి, శ్రీ సత్యభామలు ప్రధాన దేవతలుగా పూజలను అందుకుంటున్నారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసం కృతిక నక్షత్ర సమయంలో శ్రీనివాసుడు తన అన్న కోసం తిరుమల నుండి మంచి నూనె, తమలపాకులు పంపిస్తాడు. ఈ ఆలయం పక్కనే ఆలయ వాస్తు మ్యూజియం ఉంది. ఇక్కడ ఉన్న మూలావిగ్రహం మట్టితో చేసినది కావున ఎటువంటి అభిషేకాలు చేయకపోవడం విశేషం.
ఈవిధంగా శ్రీనివాసుడి అన్నగా చెప్పే గోవిందరాజస్వామి ఆలయంలో వైఖాస మాసంలో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి.