మనం గుడికి వెళ్ళినప్పుడు ఆలయం లో రావిచెట్టు, వేపచెట్టు కూడా మనకి దర్శనం ఇస్తుంటాయి. గుడికి వచ్చిన భక్తులు రావిచెట్టుకి కూడా పూజలు చేస్తుంటారు. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, జ్యోతిష్యపరంగా కూడా వీటికి ఎంతో ప్రాధాన్యత అనేది ఉన్నది. మరి గుడిలో రావిచెట్టు, వేపచెట్టు ఎందుకు ఉంటాయి? వాటిని పూజించడానికి కారణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన శాస్రాలు, వేదాల ప్రకారం గుడిలో ఉండే రావి చెట్టుని శ్రీమహావిష్ణువుగాను, వేపచెట్టుని లక్మిదేవిగాను భావిస్తారు. ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయడం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు. ఇంకా గౌతమబుద్ధుడు జ్ఞానాన్ని పొందినది, శ్రీ కృష్ణుడు తన అవతారాన్ని చాలించినది ఈ చెట్టుకిందనేనని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
దేవతలకు ప్రభువైన ఇంద్రుని వైభవానికి ప్రతిరూపంగా అశ్వత్థం అని ఈ రావిచెట్టును పురాణాలు వర్ణిస్తాయి. ఈ వృక్షం మూలాలు స్వర్గంలో వుంటాయని పేర్కొంటారు. అందుకే భూమిపైకి విస్తరించిన వృక్ష శాఖలు మానవులకు శ్రేయాన్ని కలిగిస్తాయని చెబుతారు.
బ్రహ్మపురాణం ప్రకారం రావిచెట్టు శ్రీమహావిష్ణుని జన్మస్థలం. అంతేకాదు శ్రీమహాలక్ష్మి కూడా రావిచెట్టు పై నివసిస్తుంది. బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు తమ దివ్యాయుధాలను రావిచేట్టుపైనే ఉంచుతారని పురాణ గాథలు చెబుతున్నాయి. రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేదని, సీతమ్మకు ఆశ్రయమిచ్చిన రావిచెట్టంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది.
ఇక రావి చెట్టుని పూజించడం వలన శనిబాధలు తొలగుతాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది. వివాహ సమస్యలు తీరుతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే వేపచెట్టు గాలికే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి. వేప ఆకులను నీళ్లలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయడం వల్ల చర్మసంబంధమైన వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.
ఇలా ఆధ్యాత్మికంగా, ఆరోగ్య పరంగా మనుషులకి మేలు చేస్తున్నాయి. అందుకే దైవానికి ప్రతిరూపమైన ఈ వృక్షాలకు గుడిలో భక్తులు భక్తి శ్రద్దలతో పూజలుచేస్తుంటారు.