Home Life Style These Gut Wrenching Novels Of Dr.Keshav Reddy Are A Must Read For...

These Gut Wrenching Novels Of Dr.Keshav Reddy Are A Must Read For Today’s Generation

0

పి.కేశవ రెడ్డి ఒక ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఇప్పటి తెలుగు రచయితలలో డాక్టర్‌ కేశవరెడ్డి దే అగ్రస్థానం, ఆయన రాసిన ఎనిమిది నవలలు విశేషంగా పాఠకుల ఆదరణ పొందాయి. ఇతివృత్తంలో అతని మార్గం అనితర సాధ్యం. ఆయన కొన్ని నవలలు హిందీలోకి తర్జుమా కాగా, ఇంగ్లీషులో మాక్మిలన్‌, ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. రచయితగా కేశవరెడ్డికి ఏ వాదాలతోనూ, ఉద్యమాలతోనూ సంబంధం ఉన్నవారు కాదు. అవేవీ లేకుండా తన పాఠకవర్గాన్ని సృష్టించుకున్న రచయిత డాక్టర్‌ కేశవ రెడ్డి. స్వల్ప కాలంలో నిర్థిష్టమైన వస్తువుతో, సీరియస్‌ రచనతో, వ్యాపార పత్రికలలో వ్యాపార నవలలతో పోటీ పడుతూ ఆ పత్రికల పాఠకాదరణ పొందడమే కేశవరెడ్డి నవలా రచయితగా సాధించిన విజయం. తెలుగు సాహి త్యాన్ని రచయితలే తప్ప సాధారణ పాఠకులు ఎవరూ చదవడం లేదన్న వాదనకు సరైన జవాబు డాక్టర్‌ కేశవరెడ్డి నవలలు.

కేశవ రెడ్డి తీసుకున్న ఇతివృత్తాలు చాలా క్లిష్ట మైనవి. సాధారణ మావన మాత్రులెవరూ ఊహించలేనివి కూడా. అటువంటి కేశవ రెడ్డి గారి పుస్తకాల వివరాలు మీ కోసం?

1) అతడు అడవిని జయించాడు

Keshav Reddy

ఇందులో కథా సమయాన్ని రచయిత ఒకానోక సూర్యాస్తమయాన మొదలుపెట్టి సూర్యోదయానికల్లా ముగిస్తాడు. ఈ అస్తమయ ఉదయాల మధ్య పందుల్ని సాకే ఓ అనామక ముసలివాడి బహిరంతర అన్వేషణ.

జీవితం తాలూకు సంక్లిష్ట ప్రశ్నలకు తేలికపాటి, పనికిమాలిన, చచ్చు సమాధానాలనిచ్చి భ్రమలు గొలిపే దుస్సాహసం చేయదీ నవల. జీవితంలో ఉక్కిరి బిక్కిరిగా అల్లుకున్న కఠోరవైరుధ్యాలను, అధివాస్తవికంగా – నిర్మమంగా -కర్కశంగా – ధైర్యంగా ఆవిష్కరింపజేస్తూ. పాఠకలోకం ముందు బహుముఖీన మానవ అస్తిత్వాన్ని శక్తిమంతంగా ప్రతిష్ఠించడమే దీని ప్రత్యేకత. విశిష్టత.

అన్వేషణ ఒక్కటే వాస్తవం, సంఘర్షణ ఒక్కటే ప్రత్యక్షం.

2 ) చివరి గుడిసె

‘చివరి గుడిసె’ బాధామయం, భయావహం అయిన తీవ్ర ఉత్కంఠతో కూడిన విషాదాంత గాథ. నాకు తెలిసినంత మటుకు ఇంత అద్భుతమయిన కథని నేను తెలుగు సాహిత్యంలో ఇంతదాకా చదవలేదనే చెప్పాలి. తన మొదటి కథల్లోలానే ఇందులో కూడా గ్రామంలోని అగ్రవర్ణాలకూ, నిమ్నవర్గాలకూ జరిగే సంఘర్షణే స్థల ఇతివృత్తం.

3) స్మశానం దున్నేరు

కొన్ని మంచి నవలలు – తాపీగా చదివించి మనల్ని ఆలోచింపజేస్తాయి.
మరికొన్ని మనసును చిందరవందర చేసి, మనకు ‘షాక్ ట్రీట్మెంట్’ యిచ్చిన అనుభూతి కలుగజేస్తాయి.
”స్మశానం దున్నేరు” సరిగ్గా యిటువంటి నవలే!

…మనదేశంలో పేదవారికి న్యాయం లభిస్తుందా?
చట్టాలు ఏం చేస్తున్నాయి?
ప్రభుత్వాధికారులు దుర్మార్గులను అణగ ద్రొక్కి సన్మార్గులకు న్యాయం కలిగిస్తున్నారా?
ప్రభుత్వాలు వున్నది ఎందుకు?
ప్రజలను రక్షించడానికా? భక్షించడానికా?
… ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు – ఈ నవల చదివిన తర్వాత మనల్ని కలచివేస్తాయి.

4) మునెమ్మ

పురుషుడు మాత్రమే బలమైనవాడు, బుద్ధికుశలుడు, అన్యాయాలని సరిదిద్దగల్గినవాడు, కథని తన ఉనికితో ముందుకుకి నడిపించగలిగినవాడు, పురుషుడే నాయకుడు…పోరాటయోధుడు…. అన్న పాపులర్‌ దృక్పథం నించి విడివడి…మునెమ్మలాంటి సాధారణ స్త్రీలోని అసాధారణ శక్తిని బయటకు తీసి కథని నడిపిస్తారు రచయిత.

5) క్షుద్రదేవత

వేలయేండ్లుగా తనను అంటిపెట్టుకుని వుండిన ఆత్మన్యూనతతో పోరాడి, దానిని ఛేదించి తన జీవితాన్ని మెరుగుపరచుకునే క్రమంలో నేడు దళితుడు ఒకానొక కీలకమైన మజిలీని చేరుకున్నాడు.
ఇలా సాధించుకున్న ‘సాంఘిక’ సమానత్వం దానికదే అతని జీవితాన్ని గుణాత్మకంగా మార్చడానికి నిర్వహించగల పాత్ర ఎంత?
ఈ ప్రశ్నకు సమాధానం ”సున్న” అని చెప్పాల్సి వుంటుంది.
కానీ ‘సున్న’ కు విలువ లేదని ఏ గణిత శాస్త్రజ్ఞుడైనా అనగలడా?
అనలేడు.
సున్నాకు ముందు ‘అంకె’ చేరితే దానికి ఎనలేని విలువ సమకూరుతుంది. ఆ అంకె పేరే ఆర్థిక సమానత్వం.
-డా.కేశవరెడ్డి

6) రాముడుండాడు రాజ్జిముండాది

ప్రజలకు, కష్టజీవులకు రాముడు చేయగల సాయమేమిటో రచయితే స్వయంగా గుట్టు విప్పి చెప్పారు. హరిశ్చంద్రుని అప్పుల బాధలు మొదలు తానీషా అప్పుల బాధల వరకు తీర్చిన దేవుడు ఈ దేశంలో రైతుల అప్పుల బాధలు తీర్చే దగ్గరికి వచ్చే వరకు రాతి దేవుడైపోయాడు. కలరా, ప్లేగు వంటి రోగాలు ‘స్వామి’ వల్లనే మాయమయ్యాయని నమ్మారు గానీ ఆకలి రోగం అరికడతానని ఆయన భరోసా ఇవ్వలేదు. ఈ రోగం ఎందుకు వచ్చిందని వాళ్లు స్వామిని ప్రశ్నలడగడంలేదు.

7) సిటీ బ్యూటిఫుల్

దేవీదాస్ అనబడే ఓ యువ మెడికో అంతస్సంఘర్షణను అక్షరబద్ధం చేయడం చూస్తామిందులో. ప్రాంతాల వారీగా … మతాల వారీగా … కులా వారీగా … జెండర్ వారీగా సాహిత్యాన్ని చింపి చూసే, చూపే సాహితీ ‘దొడ్డు’ వారికి డా.కేశవరెడ్డి ఓ ప్రాంతానికి చెందిన రచయిత.
కేశవరెడ్డి గారి రచనల్లో స్థలాలూ, భాషా నేపథ్యం ఓ ప్రాంతానికి చెందినవైనా … ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసిన డా.కేశవరెడ్డి గారి ప్రాత్రల మూలాలు మాత్రం విశ్వమానవీయతలో వుంటాయి. జాతి, మత, కుల, ప్రాంతాలకు అతీతంగా నిజ జీవితాన్ని సాగిస్తూన్న డా.కేశవరెడ్డిగార్ని ఓ చట్రంలో బిగించేసి చూస్తున్నవారికి, సాధారణ పాఠకులక్కూడా ఓ విభిన్నమైన నవల ఈ ”సిటీ బ్యూటిఫుల్”.
నా వరకూ నాకు ఇది ఆయన నంబర్ వన్.——— కాశీభట్ల వేణుగోపాల్

Exit mobile version