Home Unknown facts ఆంజనేయస్వామి పొలిమేర వీరాంజనేయస్వామిగా పూజలందుకుంటున్న అద్భుత ఆలయం

ఆంజనేయస్వామి పొలిమేర వీరాంజనేయస్వామిగా పూజలందుకుంటున్న అద్భుత ఆలయం

0

హనుమంతుడు శ్రీ పొలిమేర వీరాంజనేయస్వామి గా కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. మరి ఇలా పిలువబడుతున్న హనుమంతుడి ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటి? హనుమంతుడిని పొలిమేర వీరాంజనేయస్వామిగా ఎందుకు పిలుస్తున్నారు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

veeranjaneya swamyఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని, ప్రకాశం జిల్లా, ఇంకొల్లు మడలంలో గల పావులూరు పరిధిలో శ్రీ పొలిమేర వీరాంజనేయస్వామి ఆలయం ఉంది. ఇంకొల్లు గ్రామ పొలిమేరలో ఈ స్వామి వారి ఆలయం ఉండటం వలన ఇక్కడి ఆంజనేయుడు భక్తులచే పొలిమేర వీరాంజనేయుడిగా పిలువబడుతున్నాడు. అయితే ఇక్కడి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్వామివారికి గర్భాలయం లేకపోవడం ఒక విశిష్టత.

అయితే స్వామివారి మూలవిరాట్టు పైన ఓ భవ్యమందిరం నిర్మించాలని ఎన్ని సార్లు ప్రయత్నించినా అది జరుగలేదు. స్వామివారికి పైకప్పు వేయుట ఇష్టంలేక ఆ పవనసుతుని దివ్య ప్రకంపలనతో పైకప్పు కూలిపోతూ ఉండేది. అందుకే పై కప్పు లేకుండా మిగిలిన మండపాన్ని నిర్మించారు.

సాధారణంగా సింధూర వర్ణ భరితంగా ఉండే ఆంజనేయుని ప్రతిమ ఇక్కడ మాత్రం వివిధ వర్ణాలతో చూడముచ్చటగా ఉండటం మరొక విశేషం. ఇక్కడి ఆలయ గోడలపైన శ్రీ మద్రామాయణంలో ముఖ్యఘట్టాలను చిత్రాలుగా మలచిన తీరు భక్తుల్ని ఆకర్షిస్తుంది.

ఆలయప్రాంగణంలోకి ప్రవేశించగానే భక్తులకు ముందుగా ధ్వజస్తంభం దర్శనం ఇస్తుంది. ప్రధానాలయంలో స్వామివారి దివ్యమంగళ విగ్రహం కొలువు దీరి ఉన్నది. వైఖాసన ఆగమన సంప్రదాయానుసారంగా వీరాంజనేయస్వామి వారికీ పూజాదికాల్ని ఘనంగా సంప్రదాయబద్దంగా జరిపిస్తారు. సువర్చలాదేవి సమేత ఆంజనేయస్వామి వారికి ప్రతి సంవత్సరం మూడుసార్లు కల్యాణాలు జరిపిస్తారు.

శ్రీ వీరాంజనేయస్వామి వారి సన్నిధికి వెనుకవైపున శ్రీ భవనం అంజిరెడ్డిగారి సహకారంతో నిర్మించిన శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో సీతారామ, లక్ష్మణులు సర్వాలంకార భూషితులై భక్తులకు దర్శమిస్తారు.

ఇలా పొలిమేరలో వెలసిన హనుమంతుడి ఆలయంలో నిత్య పూజలతో పాటు, పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు, ప్రతి సంవత్సరం వివిధ ఉత్సవాలు, హనుమజ్జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి.

Exit mobile version