పురాతన కాలం నుండి ఈ ఆలయం ఎంతో మహిమగలదని చెబుతారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ వెలసిన స్వామి వారికి దేవతలు ఆలయాన్ని కట్టించారని ప్రతీతి. మరి దేవతలచే నిర్మించబడిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామి వారు ఎవరు? ఇక్కడ శ్రీచక్ర స్నానాలు, డోలోత్సవాలు ఎలా జరుగుతాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, టెక్కలికి 24 కి.మీ. దూరంలో మహేంద్రగిరి వద్ద మెళియాపుట్టి మండలం, ఉత్కళాంధ్ర సరిహద్దు ప్రాంతం నందలి మహేంద్ర తనయనది తీరాన మెళియాపుట్టి నందు శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం ఉంది. తెలుగు – ఒరియా ఉమ్మడి సంస్కృతుల సమ్మేళనంతో జీవనం సాగించే మెళియాపుట్టి పురవాసులు, గిరిజనుల ఇష్టదైవం రాధా గోవిందస్వామి.
ఇక 1840వ సంవత్సరంలో పర్లాఖిమిడి మహారాజు వీరేంద్ర ప్రతాపరుద్రుడు తన భార్య విష్ణుప్రియ కోరికమేరకు ఈ ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయంలో కంచుతో తయారు చేయబడిన విగ్రహాలను రాధా-గోవిందుడు మరియు చెలికత్తె లలితాంబలుగా భక్తులు కొలుస్తారు.
ఇక పురాణానికి వస్తే, దేవతలకు ఇలాంటి గొప్ప మహత్యం గల ఈ స్తలంలో ఆలయాన్నో నిర్మించవలెనన్న ఒక సంకల్పం కలిగి ఆ సంకల్పంతో వారొక రాత్రివేళ అచటకు అదృశ్యంగా వచ్చి ఆలయమును నిర్మించి, అందులో వేణుగోపాలుని ప్రతిష్టించారు. అయితే ఆ తరువాత ద్వారగోపురమును కట్టడం ఆరంభిస్తుండగా ఇంతలో వారికీ కోడికూత వినిపించి తెల్లవారుతుందని, జనం బయటకి వస్తే తాము కనిపిస్తాం అని తలచి కట్టడం ఆపేసి బాధతో వెళ్లిపోయారంటా. అందుచేతనే మనకి ఈ ఆలయ కట్టడం అసంపూర్ణంగా ఉండిపోయిందని చెబుతారు.
ఇక ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమికి డోలోత్సవాలు తొమ్మిదిరోజుల పాటు ఘనంగా జరుగుతాయి. జాతర సందర్భంగా వేలాది భక్తులు ఇచ్చటికి తరలివస్తారు. కృష్ణాష్టమి, రాధాష్టమి మొదలగు పర్వదినాల సందర్భంగా ప్రెత్యేక పూజలు జరుగుతాయి.
వేణుగోపాలస్వామి డోలోత్సవాల్లో భాగంగా స్వామివారి ప్రతిమలను పల్లకిలో పెట్టి ఊరేగింపుగా మహేంద్రతనయ నదీ తీరానికి వెళ్లి వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాలను నదిలో ఆలయ పురోహితులు స్నానం చేయించారు. దీనిని శ్రీ చక్రస్నానాలుగా పిలుస్తారు. నది పైభాగంలో ఉత్సవ విగ్రహాలను స్నానం చేయిస్తుండగా, అక్కడకు చేరకున్న భక్త బృందం నదికి దిగువ భాగాన స్నానాలు చేస్తారు. దేవుని స్నానం చేసిన పవిత్ర గంగ భక్తుల తలపై నుంచి వెళితే ముక్కోటి దేవతల అనుగ్రహం జరుగుతుందని పాపపరిహారం లభిస్తుందని అనాధిగా ఈప్రాంత ప్రజలు విశ్వసిస్తుంటారు. ప్రతీ ఏటా డోలో పౌర్ణమి మరుసటి రోజు శ్రీ చక్రస్నానాలు జరుగుతుంటాయి. డోలో ఉత్సవాలు ఊయల సేవతో ప్రారంభించి 12 రోజుల పాటు ప్రతీ రోజు రోజుకు ఒక అవతారంలో కొలువు దీరిన వేణుగోపాలస్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు.