ధనియాలు అంటే తెలియని వారుండరు. వీటిని అనేక రకాలైన వంటలలో ఉపయోగిస్తుంటాము. ధనియాలు వంటలలోనే కాదు ఒక మంచి ఔషధంలా కూడా ఉపయోగపడతాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. వీటిని ఎలా తీసుకున్న మన ఆరోగ్యానికి మంచే జరుగుతుంది.
వీటితో కషాయం చేసుకుని తాగితే చాలా అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ధనియాలతో చేసిన చూర్ణం రోజూ తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాదు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనులపై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి.
అంతేకాదు ఉదయంపూట వచ్చే అలసట, నీరసం, తల తిరగడం వంటివి కూడా తగ్గుతాయి. ధనియాలు, సోంపు, యాలుకలు, బాదంపప్పులు, పటికబెల్లం అన్నిటినీ కలిపి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని రోజూ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలలో చిటికెడు పొడి వేసి కలిపి తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ధనియాలు, ఎండిన ఉసిరికాయ ముక్కలు రెండు గ్లాసుల నీళ్లలో వేసి ఉదయం నుండి రాత్రి వరకు నానబెట్టి రాత్రి పడుకునేటప్పుడు వడకట్టి తాగాలి. ఇలా రోజూ తాగడం వల్ల ఉదయం అలసట, తల తిరగడం తగ్గుతాయి.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ధనియాల కషాయం తయారు చేసుకుని అందులో కాస్త పాలు, చక్కెర కలుపుకుని తాగడం వల్ల మంచి నిద్రపడుతుంది.
శరీరంలోని కొవ్వుని కరిగించడానికి కూడా ధనియాలు బాగా ఉపయోగపడతాయి. ధనియాలను మెత్తగా పొడి లాగా చేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని దాన్ని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. ధనియాలను తరచూ ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకుంటే శృంగార శక్తి కూడా పెరుగుతుంది.
చర్మ సంరక్షణకు ధనియాలు బాగా ఉపయోగపతాయి. ధనియాలను మెత్తగా చూర్ణంలా చేసుకుని, ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు తగ్గుముఖం పడతాయి.