Home Health నానబెట్టిన బాదం పప్పు తినడం వలన కలిగే ప్రయోజనాలు

నానబెట్టిన బాదం పప్పు తినడం వలన కలిగే ప్రయోజనాలు

0

పండ్లతోపాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. రోజుకి కొన్ని గ్రాముల డ్రై ఫ్రూట్స్ తింటే.. ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని పెద్దలు కూడా చెబుతుంటారు. ఈ డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పుది కీలక పాత్ర అని చెప్పవచ్చు. వీటిలో ముఖ్య పోషకపదార్థాలైన ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్లు, విటమిన్ ఈ, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కరిగే, కరగని పీచు పదార్థం వంటివి ఎన్నో ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ సమతూకంగా ఉంటుంది.

Benefits of eating soaked almondsవీటిని నిత్యం తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇవి గ్లూకోజ్‌ను శరీరం బాగా తీసుకునేలా చేసి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. బాదం పప్పులను నిత్యం తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటిలోని ఆల్కలీన్‌ గుణాలు మన శరీరంలో ఆమ్లత్వాన్ని సమతౌల్యంగా ఉండేలా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా కాపాడి మనం వృద్ధాప్యం దరిలోకి చేరుతున్నామన్న ఆలోచన నుంచి బయటపడేస్తుంది.

అయితే, నానబెట్టిన బాదం, పచ్చి బాదం.. వీటిలో ఏది తింటే ఆరోగ్యానికి ఉపయోగపడతాయనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండు రకాల్లో కూడా మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. కానీ, రాత్రంతా నానబెట్టిన బాదం పప్పులలో తొక్కపై ఉన్న విషపదార్థాలను నీరు తొలగించి ఫైటిక్‌ యాసిడ్‌ను విడుదల చేస్తుంది. ఇది గ్లూటెన్‌ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది. నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది. వీటిని నీటిలో నానబెట్టిన తర్వాత పైతొక్కు తీసి తినడం వలన సులువుగా పోషకాలు మొత్తం అందుతాయి. పచ్చి బాదం గోధుమ చర్మంతో పొరలుగా ఉంటుంది. దీనిలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పోషకాలను తీసుకోవడానికి ఆటంకం కలిగిస్తుంది. నానబెట్టిన బాదం తొక్కను తీయడం వల్ల పోషకాలను సులభంగా విడుదల చేస్తుంది.

నానబెట్టిన బాదం పప్పులో ప్రొటీన్‌, పొటాషియం, మెగ్నిషియం అధికంగా లభించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్‌ స్థాయిలను అదుపులో ఉంచి ప్రాణాంత గుండె జబ్బుల నుంచి మనల్ని కాపాడుతాయి. వీటిలో తక్కువగా సోడియం ఉండటం వలన రక్తపోటు అదుపులో ఉంటుంది. నానబెట్టిన బాదంలో పీచు అధికంగా లభించి దీర్ఘకాలంగా ఉండే మలబద్దకాన్ని నయం చేస్తుంది.

నిత్యం నాలుగైదు బాదం పప్పులను తినడం ద్వారా మెదడుకు టానిక్‌లా పనిచేస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. గర్భిణిలు నిత్యం బాదం పప్పు తినడం అలవాటు చేసుకోవడం వల్ల తల్లితోపాటు కడుపులో ఉన్న బిడ్డకు కూడా మంచి పోషకాలు అందుతాయి. వీటిలోని ఫోలిక్‌ యాసిడ్‌ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడంలో గొప్ప పాత్రను పోషిస్తాయి.

 

Exit mobile version