‘కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ‘కరివేపాకే కదా’ అంటూ చిన్నచూపు చూసేవారు ఇప్పుడు ఆలోచనలో పడక తప్పదు. కూరైనా, సాంబారు అయినా, ఉప్మా, రసం దేనిలోనైనా కరివేపాకు వేస్తే వచ్చే రుచే డిఫరెంట్‌గా ఉంటుంది. కరివేపాకు వల్ల రుచే కాదు…ఆరోగ్య పరంగా ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి.
శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి. కరివేపాకులో మరి కొన్ని ఉపయోగాలు చూద్దాం.
అజీర్ణం:
కరివేపాకు జీర్ణక్రియ ఇబ్బందులను పోగొట్టే గుణముంది. జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు కరివేపాకు ఆకులను, జీలకర్రతో కలిపి బాగా నూరి, అలా నూరగా వచ్చిన పొడిని పాలలో కలుపుకుని తాగిలే సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.
స్థూలకాయుల్లో కనిపించే మధుమేహం:
కరివేపాకును ముద్దగా నూరి మోతాదుకు టీ స్పూన్ చొప్పున మజ్జిగతోగాని నీళ్లతోగాని రెండుపూటలా తీసుకుంటుంటే స్థూలకాయం తగ్గి తద్వారా మధుమేహం నియంత్రణలోకి వస్తుంది.
మధుమేహం:
వంశపారంపర్యంగా వచ్చే మధుమేహానికి కూడా కరివేపాకు పనిచేస్తుంది. ప్రతి రోజూ పది ముదురు కరివేపాకు ఆకులను బాగా నమిలి మింగాలి. అలా మూడు నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే మధుమేహాన్ని నియత్రించుకోగలుగుతారు.
అధిక కొలెస్టరాల్:
కరివేపాకు ముద్దను నిత్యం టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే క్రమంగా టోటల్ కొలెస్ట్రరాల్ తగ్గటంతోపాటు హానికరమైన ఎల్.డి.ఎల్. కూడా గణనీయంగా తగ్గుతుంది.
బ్లడ్ ప్రెజర్:
అధిక రక్తపోటులో కనిపించే ఉపద్రవాలు కరివేపాకు పళ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.
శ్వాసకోశ వ్యాధులు:
కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి రోటి పచ్చడి మాదిరిగా చేసుకొని ఆహారంగా తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.
మూత్ర పిండాల సమస్యలు:
కరివేపాకు వేరు రసాన్ని ప్రతిరోజూ రెండు పూటలా పూటకు టీస్పూన్ మోతాదుగా తీసుకుంటూ ఉంటే మూత్ర పిండాల సమస్యల్లో హితకరంగా ఉంటుంది. కరివేపాకు ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఆహారంలో స్వీకరిస్తే మూత్ర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. దీని చెట్టువేళ్లతో కషాయం చేసి ప్రతిరోజూ నెలరోజుల పాటు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.
దురదలు:
ఎండబెట్టిన కరివేపాకును, పసుపును సమపాళ్లలో తీసుకొని పొడిమాదిరిగా నూరి, వస్తగ్రాళితం పట్టి ఒక శుభ్రమైన గాజు సీసాలో నిల్వచేసుకొని ప్రతిరోజూ ఒక టీ స్పూన్ మోతాదులో కనీసం మండలంపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.
కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోకుండా చుసుకోవచ్చు. కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే.. క్రమంగా జుట్టు పెరుగుతుంది.