కరోనాని కట్టడి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసారు. అలాగే ఇప్పుడు కరోనా చికిత్సలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కాక్‌టెయిల్ డ్రగ్ మెరుగైన ఫలితాలిస్తోందని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో 40 మంది కరోనా బాధితులకు ఇటీవల కాక్‌టెయిల్ డ్రగ్ ఇచ్చారు.
డ్రగ్ ఇచ్చిన కేవలం 24 గంటల సమయంలోనే బాధితులంతా జ్వరం సహా ఇతర అనారోగ్య లక్షణాల నుంచి కోలుకున్నట్లు డాక్టర్ వెల్లడించారు. అంతేగాక, కొద్ది రోజుల్లోనే వైరస్ పూర్తిగా అంతమైనట్లు తెలిపారు. గతేడాది అమెరికా ఎన్నికల సమయంలో కోవిడ్ బారినపడ్డ నాటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మహమ్మారి నుంచి వారం రోజుల్లోనే బయటపడటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఆయన అంత త్వరగా కోలుకోడానికి చికిత్సలో ఓ యాంటీబాడీ కాక్‌టెయిల్ ఔషధం వాడటమే కారణం.
ఈ ఔషధం వినియోగించడంతో ట్రంప్ వేగంగా కోలుకున్నారు. తాజాగా, ఆ ఔషధం భారత్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ఈ చికిత్సకు అనుమతి వచ్చిన నేపథ్యంలో.. ఏఐజీలో ఈ విధానాన్ని ప్రారంభించారు. వైరస్ సోకిన మూడు నుంచి వారం రోజుల్లోనే ఈ ఇంజక్షన్ ఇస్తే ఫలితం ఉంటుందని, 10 రోజుల తర్వాత ఈ చికిత్స నిరుపయోగమని ఏఐజీ అధినేత తెలిపారు. కాగా మైల్డ్, మోడరేట్ బాధితుల పాలిట ఈ చికిత్స బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది.
కోవిడ్-19ను ఎదుర్కొనే కాసిరివి మాబ్, ఇమ్డివిమాబ్‌ను కలిపి ఈ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. REGN-COV2గా పిలిచే ఈ ఔషధం అధిక ముప్పు ఉండి తక్కువ నుంచి మధ్యస్థ లక్షణాలున్న బాధితులకు చికిత్సలో వినియోగిస్తారు. ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ రెండు ప్రతినిరోధకాలను మోనోక్లోనల్ యాంటీబాడీలుగా పిలుస్తారు. ఇవి మానవ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను అనుకరిస్తూ హానికారక వైరస్‌లను అడ్డుకుంటాయి.
సార్స్ కోవ్-2లోని స్పైక్ ప్రోటీన్‌పై సమర్ధంగా పనిచేయడం వీటి ప్రత్యేకత. ఈ ప్రొటీన్‌ను అడ్డుకుంటే శరీరంలోని ఏసీఈ2 కణాలకు వైరస్ అతుక్కోదు. ఈ రెండు యాంటీబాడీలు కలిసి స్పైక్ ప్రొటీన్‌లలోని ఒక ప్రత్యేకమైన భాగంపై పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో వైరస్‌లో మ్యుటేషన్ జరిగినా ఇది పనిచేయడం వల్ల కొత్త వేరియంట్లను సమర్థంగా అడ్డుకొనే అవకాశం ఉంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ను కాక్‌టైల్‌గా ఇంజక్ట్ చేస్తారు. ఒకటి గురితప్పినా.. మరో రకం యాంటీబాడీలు వైరస్ కు ముకుతాడు వేస్తాయి. ఈ ఇంజక్షన్ రెట్టింపు భద్రతను కల్పిస్తుంది.
ఈ ఇంజక్షన్‌ను 65 ఏళ్లు దాటిన వారు, స్థూలకాయులు, నియంత్రణలేని మధుమేహులు, గుండె జబ్బు బాధితులు, కేన్సర్ బాధితులు, రోగనిరోధక ఔషధాలు వాడుతున్న వారికి మాత్రమే ఇవ్వాలి. 55 ఏళ్లు నిండిన వారిలో.. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇవ్వొచ్చు. ఈ చికిత్స జరిగిన వారం తర్వాత ఆర్టీపీసీఆర్‌లో నెగటివ్ వస్తుంది. కరోనా సీరియస్ రోగులకు, వైరస్ నిర్ధారణ అయిన 10 రోజుల తర్వాత, ఐసీయూ, ఆక్సిజన్, వెంటిలేటర్‌పై ఉన్నవారికి ఈ చికిత్స పనికిరాదు.
ఈ ఔషధాన్ని కోవిడ్ బారినపడ్డ 12 ఏళ్ల చిన్నారులకు వినియోగించవచ్చు. అయితే, వీరి బరువు కనీసం 40 కిలోలు ఉండాలి. ఒక్కో యాంటీబాడీ 600 ఎంజీ చొప్పున ఔషధ సమ్మేళనాన్ని 1200 ఎంజీ వినియోగించాలి. చర్మం కింద ఉండే ఒకరకమైన కండరంలో లేదా నరాల ద్వారా ఎక్కించవచ్చు. ఇంటిలో వాడే సాధారణ రిఫ్రిజిరేటర్లలో భద్రపరచవచ్చు. గుండె, కిడ్నీ, డయాబెటిక్ వంటి అనారోగ్య సమస్యలెదుర్కొంటున్నవారికి దీని వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి. మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇంజక్షన్ ఒక్కోడోసుకు రూ. 70 వేల వరకు ఖర్చవుతుంది. మైల్డ్, మోడరేట్ బాధితులకు సింగల్ డోస్ సరిపోతుంది. ఇంజక్షన్ ఇచ్చిన గంట పాటు రోగిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతారు. ఆ తర్వాత ఇంటికి పంపిస్తారు. ఈ చికిత్స తర్వాత మూడు నెలలకు వ్యాక్సిన్ వేసుకోవడం మంచిది. అయితే, ఈ కాక్ టెయిల్ డ్రగ్‌ను బాధితులకు ఎక్కువ మోతాదులో వాడకూడదు. అతిగా వాడటం వల్ల కొత్త వేరియంట్లు కూడా పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. ఈ కాక్ టెయిల్ డ్రగ్ బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్లపై సమర్థంగా పనిచేస్తున్నట్లు అమెరికాలో జరిపిన అధ్యయనంలో తేలింది.