Home Health భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయడం వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు

భోజనం చేసిన వెంటనే ఈ పనులు చేయడం వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు

0

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే మనిషి రోబోలా తయారయ్యాడు. మరీ ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో అలవాట్లలో అనేక మార్పులు వచ్చాయి. అవి అనారోగ్యానికి దారి తీస్తున్నాయి. మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. బిజీ లైఫ్ కి అలవాటు పడిన వాళ్ళు ఆహరం విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. నిజానికి మనం తీసుకునే ఆహారం కేవలం ఆకలిని తీర్చడమే కాకుండా శరీరంలోని మెదడు తదితర భాగాలకు పోషణనందిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి మనసు, ఆరోగ్యం ఆధారపడి వుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Health problems caused by doing these things immediately after a mealఅంతే కాదు ఆహారాన్ని ఎప్పుడు తినాలి ఎలా తినాలి అన్న విషయం అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ లో ఆదరాబాదరాగా తినడం, తిన్న తర్వాత చేయకూడని పనులు చేస్తూ మన ఆరోగ్యానికి మనమే చేజేతులా పాడు చేసుకుంటున్నామని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే.. పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే చాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ కేవలం పోషకాహారం తింటే సరిపోదు. కొన్ని రకాల నియమాలను కూడా పాటించాలంటున్నారు నిపుణులు. అప్పుడే తిన్న ఆహరం సరిగా వంటబట్టి ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారు. చాలా మంది భోజనం చేసిన తర్వాత కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. వాటి కారణంగా ఎంత మంచి ఫుడ్ తిన్నా కూడా అది వంట పట్టదట. మరి భోజనం చేసిన వెంటనే చెయ్యకూడని పనులు ఏంటో వాటి వలన ఎదురయ్యే ఆరోగ్య సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంతమంది బయటికి వెళ్లి వచ్చిన తరువాత భోజనం చేసి ఆ తరువాత స్నానం చేస్తుంటారు. అయితే భోజనం చేసిన వెంటనే స్నానం చేస్తే ఆహారం సరిగా జీర్ణం కాదు. దీంతో పాటు గ్యాస్‌, కడుపులో మంట వంటివి వస్తాయి. అంతగా స్నానం చేయాలనుకుంటే భోజనమయ్యాక ఓ గంట ఆగి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

చాలా మంది భోజనం తర్వాత కొంత దూరమైన నడవాలంటారు. భోజనం తర్వాత వంద అడుగులు నడవటం వల్ల తొంభైతొమ్మిదేళ్ళు జీవిస్తారంటారు. ఇది నిజం కాదు. భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణవ్యవస్థ తగిన ఆహార పోషణ గ్రహించలేకపోయే అవకాశం ఉంది. కాబట్టి భోజనం అయిన వెంటనే వేగంగా నడవడం అవసరం లేదు. అలా అని తిన్న వెంటనే కూర్చోకండి. మెల్లిగా కాసేపు అటూ ఇటూ నడిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇక భోజనం చేసిన తరువాత ఏవైనా పండ్లు తినే అలవాటు ఉంటే మానుకోవడం మంచిది. ఎందుకంటే తిన్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించడానికి కాస్త సమయం పడుతుంది. ఈలోపు పండ్లను తినడం వల్ల ఆ పోషకాల్ని కోల్పోతాం. కాబట్టి పండ్లను తినాలనిపిస్తే భోజనం తర్వాత గంటకి తినొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

తిన్న తరువాత కొందరికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. కానీ భోజనం అయిన వెంటనే ధూమపానము చేయరాదు. ఎందుకంటే భోజనము చేసిన తరువాత ఒక్క సిగరెట్ కాల్చితే అది పది సిగరెట్ లకు సమానము అని చెబుతున్నారు వైద్యనిపుణులు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.

మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. చాలామందికి నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ అది కూడా తప్పేనట. ఇలా చేస్తే బరువు పెరుగుతారు. ఒకవేళ అంతలా పడుకోవాలి అనుకుంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలకు మించి పడుకోకూడదట.

అలాగే తిన్న వెంటనే ఈత కొట్టడం చాలా ప్రమాదకరం. దీని ద్వారా కడుపు తిమ్మిరికి వచ్చే ప్రమాదం ఎక్కువ. తిన్న తర్వాత ఈత కొడితే జీర్ణక్రియ భాగా పనిచేస్తుందని అంటుంటారు. కానీ ఈతకు జీర్ణక్రియకు సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.

తిన్న వెంటనే వ్యాయామం కూడా చేయకూడదు. భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయడం అంటే కొత్త రోగాలను కొని తెచ్చుకోవడమే అంటున్నారు న్యూట్రీషియన్లు. వ్యాయామం చేయక ముందు గానీ, చేసిన తర్వాత గానీ, తినడానికి రెండు గంటల సమయం కేటాయించాలని చెబుతున్నారు. తిన్న వెంటనే వ్యాయామం చేస్తే కడుపు వికారం చెందడం, తిమ్మిర్లు రావడం ఖాయమని అంటున్నారు.

చాలా మంది ఉద్యోగస్తులు ఆఫీసుల్లో లంచ్ చేసేటపుడు బెల్ట్ పెట్టుకునే భోజనం కానించేస్తారు. కానీ అలా చేయకూడదంట. తినేటపుడు కడుపును నిర్బందిస్తే.. జీర్ణక్రియ సమస్యలు వస్తాయట. తినే సమయంలో బెల్ట్ ను వదులు చేసుకోవడం, లేదా పూర్తిగా తీసేయడం ఇంకా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే తిన్న వెంటనే టీ, కాఫీలు తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదట. మన తాతల కాలంలో వాళ్ళు ఏ సమయానికి ఏం తినాలో వాటినే తినేవారు. అందుకే వారు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండేవారు. మనం కూడా అలా చేస్తే సగం రోగాలు మన దగ్గరికి రావు, ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండవచ్చు.

 

Exit mobile version