మారుతున్న కాలంతో పాటు మనమూ మారాలి. ఆ మార్పు మంచికైతే పర్వాలేదు కానీ అనారోగాల వైపు నడిపేది అయితేనే సమస్య. ఇప్పుడు అదే జరుగుతుంది. కల్చర్ పేరుతోనో, ట్రెండ్ పేరుతోనో లేదా తినడానికి కూడా సమయం లేకనో ఏవో పిజ్జా, బర్గర్ వంటి వాటిని ఆర్డర్ పెట్టి కడుపును నింపుకుంటున్నారు. ఫాస్ట్ ఫుడ్ మాయలోపడి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను దూరం పెట్టడం వల్ల ఎన్నో సమస్యలకు గురవుతున్నారు.
పూర్వం ఇలానే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఏవి లేవు, ఆరోగ్యమైన, పొలంలో పండించిన చిరుధాన్యాలు అనగా కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు ఎంతో విరివిగా ఉపయోగించేవారు. అందుకే వారికి 80, 90 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఎంతో ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నారు. ఇప్పటికీ మన తాతముత్తాతలు మనకన్నా కూడా ఆక్టివ్ గా ఉండడం చూడొచ్చు. దానికి కారణం వారు తీసుకున్న ఆహారమే.
ఇక చిరు ధాన్యాల విషయానికి వస్తే అరికెల గురించి ఈ కలం వారికి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉండే అరికెలు మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఎక్కువ పోషక విలువలు కలిగి ఉన్న అరికెలు ఆహరంగా చిన్న పిల్లలకు ఇవ్వడం మంచిది. అరికెలలో విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా ఉంటాయి.
అరికెలలో అధిక మొత్తంలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ క్రమంలోనే ఈ పోషకాలు మనకు సరైన ఆరోగ్యాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిరోజు కొద్ది పరిమాణంలో అరికెలు మన ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల మనకు కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గడానికి కూడా అరికెలు ఎంతగానో దోహదపడతాయి.
అరికెలు కాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తాయి. రక్తంలో చక్కర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. పరుగు పందాలలో పాల్గొనే వారికి ఇది మంచి శక్తినిస్తుంది. వీటిని ఇతర పప్పుదినుసులతో (బొబ్బర్లు, శనగలు) కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళ కలిగే బాధల ఉపశమనానికి, వాపులు తగ్గడానికి అరికెలను మంచి ఆహరంగా చెప్పొచ్చు.
వాతరోగాలకు ముఖ్యంగా కీళ్ల వాతానికి, రుతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు, కంటి నరాల బలానికి అరికెలు మంచి ఆహరం. అరిక పిండిని వాపులకు పై పూతగా కూడా వాడతారు. అదేవిధంగా టైపాయిడ్, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడినవారికి అరికెలు తినిపించడం వల్ల తొందరగా ఈ విష జ్వరాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
రక్త శుద్ధికి, ఎముకల గుజ్జు సమర్ధవంతంగా పనిచేసేలా చూసేందుకు, ఆస్తమా వ్యాధి, మూత్ర పిండాలు, ప్రోస్టేట్, రక్త కాన్సర్, ప్రేగులు, థైరాయిడ్, గొంతు. క్లోమ గ్రంధులు, కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి, అధికంగా చక్కర వ్యాధి కలిగి కాలికి దెబ్బ తాకి గాంగ్రీను వైపు వెళ్లిన వారికి కూడా అరికెలు మేలు చేస్తాయి.