This Heartfelt Note On Uday Kiran Will Make You Revisit His Rise & Downfall In TFI

0
692

Written By లక్ష్మీ భూపాల

నువ్వు-నేను షూటింగ్ లాస్ట్ షెడ్యూల్ వైజాగ్ లో జరుగుతుండగా, నెక్స్ట్ సినిమా ‘మనసంతా నువ్వే’ డైరెక్టర్ V.n. Aditya లొకేషన్ హంట్ కి అక్కడికే వెళ్ళారు..అప్పటికి ఉదయకిరణ్ ఒక్క ‘చిత్రం’ సినిమా హీరోగా మాత్రమే తెల్సు ప్రేక్షకులకు.. లొకేషన్ స్కౌటింగ్ కొచ్చిన డైరెక్టర్ ఆదిత్య, ఉదయకిరణ్ సాయంత్రం అలా వైజాగ్ రోడ్లపై నడుస్తుంటే ఒకరిద్దరు గుర్తుపట్టారు ఉదయకిరణ్ ని… “బాస్ నువ్వు చిత్రం హీరో కదా!” అని.. ఉదయకిరణ్ హ్యాపీగా ఫీలయ్యాడు.. ఆ అందమైన సొట్టబుగ్గల నవ్వు పక్కనే ఉన్న ఆదిత్య చూసారు..

1 Uday Kirnaకొన్నాళ్లకు నువ్వు-నేను విడుదలై దుమ్ములేపుతోంది.. ఉదయకిరణ్ కి యూత్ అట్రాక్ట్ అవ్వడం మొదలైంది.. ఆ సినిమా సుమారు 175 రోజులు ఆడుతున్న సమయంలో ‘మనసంతా నువ్వే’ సినిమా షూటింగ్ కోసం ఉదయకిరణ్, ఆదిత్య మళ్ళీ వైజాగ్ వెళ్ళారు.. ఈసారి ప్రేక్షకులు ఫ్యాన్స్ గా మారి చేతులూపుతున్నారు.. ఉదయకిరణ్ మరింత అందంగా బుగ్గల్లో సొట్టలు బాగా కనపడేలా నవ్వాడు.. దానిక్కూడా ఆదిత్య గారే సాక్ష్యం. మనసంతా నువ్వే విడుదలైంది… కుర్రకారుకు పూనకాలు మొదలయ్యాయి.. ఫ్యాన్స్ పిచ్చోళ్ళవుతున్నారు.. ఆ విజయపరంపర కొనసాగుతుండగా మళ్ళీ ఆదిత్య, ఉదయకిరణ్ ‘శ్రీరామ్’ సినిమా షూటింగ్ కోసం అచ్చొచ్చిన హోటల్లో దిగుదామని, వైజాగ్ లో అడుగుపెట్టారు…

ఇక్కడ మొదలైంది ప్రభంజనం.. ఉదయకిరణ్ వస్తాడని ముందే తెల్సుకున్న అభిమానులు, హోటల్ వరకు అంటే దాదాపు 3 కిలోమీటర్ల రోడ్డుపై చీమలబారుల్లా నిండిపోయారు.. కనీవినీ ఎరుగని నీరాజనం.. కేవలం 3 సినిమాలతో ఏ స్టారుకీ రాని స్టార్ డమ్.. అభిమానులు పిచ్చోళ్ళై ఈలలు, గోలలు, జిందాబాద్ ల మధ్య ర్యాలీగా హోటల్ వరకు వచ్చారు… హోటల్ దగ్గర లక్షలాది జనం… ఉదయకిరణ్ హోటల్లోకి వెళ్ళినా ‘బయటకు రావాలి’ అంటూ అభిమానుల కోలాహలం… ఒకప్పుడు మెడ్రాస్ లో ఎన్టీఆర్, బొంబాయిలో అమితాబచ్చన్ మేడమీద నుండి చేతులూపినట్టుగా హోటల్ పైనుంచి ఉదయ్ రెట్టించిన అద్భుతమైన అందమైన సొట్టబుగ్గల నవ్వుతో చేతులూపాడు.. అప్పుడు కూడా పక్కన ఉన్న ఆదిత్య గారే సాక్షి…..

2 Uday Kiranఇదంతా గతంలో ఎప్పుడో ఉదయకిరణ్ స్వయంగా నాతో చెప్పిన అతని జ్ఞాపకాలు.. ఈ పోస్ట్ పెట్టేముందు మిత్రులు ఆదిత్య గారిని మళ్ళీ ఒకసారి అడిగి రీ కన్ఫర్మ్ చేసుకున్నాను.. ఆయన ఇంకొంచెం విపులంగా మళ్ళీ చెప్పారు.. అయితే గతమంతా నిజంగా అంత అందంగా ఉంటే వీడెందుకు విషాదమైన గతమైపోతాడు..
ఆ అద్భుత స్టార్ డమ్ కాస్త తగ్గిన కొన్నాళ్లకు నాతో ఉదయ్ మనసువిప్పి చెప్పిన ఇంకొక్కమాట మీకు చెప్పాలి…
ఏమన్నాడంటే…..

“షూటింగ్ పనిమీద వైజాగ్ వెళ్ళానన్నా…అదే హోటల్లో దిగాను.. డైరెక్టర్, టీమ్ ఇంకా రాలేదని హోటల్ లాబీలో కూర్చున్నాను.. అందర్నీ చూస్తున్నా.. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు.. మనసంతా ఏదోలా అయిపోయింది.. అందరూ పట్టించుకోకుండా తిరుగుతున్నారు.. చూసినా ‘ఇతన్ని ఎక్కడో చూసాం’ అన్నట్టు చూసి వెళ్లిపోతున్నారు… ఒక 45 మినిట్స్ తర్వాత ఒకావిడ వాళ్ళ పాపతో వచ్చి “మీరు ఉదయకిరణ్ కదా…. నేను పెళ్ళవ్వకముందు మీకు పెద్ద ఫ్యాన్ ని” అని నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చి, చిన్న కెమెరాలో ఫోటో తీసుకుని వెళ్ళింది.. నాకు అప్పుడు అర్ధం అయిందన్నా… నన్ను admire చేసినోళ్ళకు ఆల్మోస్ట్ పెళ్లైపోయుంటుంది.. జనరేషన్ మారిపోయింది.. అదే హోటల్.. అదే నేను.. కానీ ఆ ప్రేక్షకులు లేరు, ఆ అభిమానులు లేరు… డెస్టినీ అలా ఉంది”…… అంటూ నన్ను చూసి అందంగా నవ్వాడు…బుగ్గలు కూడా సొట్టపడ్డాయి.. ఈసారి నేను చూసాను.. ఆ కళ్ళల్లో నీటిపొర చాలా స్పష్టంగా కనిపించింది…
నేను అలా చూస్తోంటే…. “ఏంటన్నా..” అని కళ్ళెగరేశాడు.. నేను నవ్వలేదు..

3 Uday Kiranమా అమ్మావాళ్ళు హైదరాబాద్ నాదగ్గరకు రాకముందు ఒకసారి సరదాగా ఏలూరు నుండి వచ్చారు.. మా పెద్ద చెల్లెలికి ఉదయకిరణ్ అంటే పిచ్చి అప్పట్లో(ఇప్పుడు మహేష్బాబు పాపం).. నాకు ఉదయకిరణ్ తెల్సని నేను చెప్పలేదు.. అమ్మ చింతపండు పులిహోర చేసింది.. అందరం నా రూంలో కింద చాపమీద కూర్చుని తింటున్నాం.. సడన్ గా ఉదయ్ ఎంట్రీ…. మా పెద్దచెల్లెలు వెనక్కుతిరిగి చూసింది.. అంతే ఒక్కసారిగా అదిరిపడింది… మన అభిమాన హీరో డైరెక్ట్ గా మనింటికి రావడం ఎలా ఉంటుందో ఊహించుకోండి..మా చెల్లెలి పరిస్థితి కూడా అదే.. ఉదయ్ ని వాళ్ళకి పరిచయం చేశాను.. మాతోపాటు కింద కూర్చుని పులిహోర తిన్నాడు.. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తిన్నాడు.. “నాకు పులిహోర అంటే చాలా ఇష్టం ఆంటీ.. బాగా చేశారు” అన్నాడు..

4 Uday Kiranకొన్నాళ్లకు అమ్మావాళ్ళు నా దగ్గరకు షిఫ్ట్ అయిపోయారు.. ఉదయ్ రావడం మామూలే.. నా ఆఫీస్ రూంలో గంటల తరబడి కథల మీద బాతాఖానీ… ‘మంచి సెన్సిబుల్ సినిమాలు చెయ్యి ఉదయ్’ అంటే ‘లేదన్నా.. ఏక్షన్, మాస్ చేస్తా’ అనేవాడు.. ఇద్దరం ఆ విషయంలో గొడవపడేవాళ్ళం.. మంచి కాన్సెప్ట్ బేస్డ్ కథలు 2 చెప్పాను కూడా… బాగున్నాయి కానీ ఇవొద్దు అనేవాడు… తర్వాత పెళ్లయింది.. నేను కలవడం కూడా తగ్గింది.. కొన్ని నెలల తర్వాత ఒకసారి మా చెల్లెళ్లకు ఏదో షాప్ లో కనబడి “అన్నని నాకోసం ఏదైనా మంచి కథ రాయమని చెప్పండి” … అన్నాడట….

నీకిష్టమైన మాస్ కథలు కూడా తయారుచేసాను ఉదయ్…ఇంతకంటే అందంగా ఎక్కడో పుట్టే ఉంటావ్.. తొందరగా పెద్దైపోయి వచ్చి కలిస్తే బోల్డన్ని చెప్తాను… అన్నట్టు నేను మళ్ళీ పెయింటింగ్స్ కూడా వేస్తున్నా అప్పుడప్పుడు… ఈసారి నీకోసం వేసిన నీ బొమ్మతో పుట్టినరోజు శుభాకాంక్షలు.

💐 లవ్ యూ ఉదయ్ 💖

SHARE