పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్రం యుద్ధం తో మహాభారతం పూర్తయిందని మనకి తెలుసు. 18 రోజుల పాటు జరిగిన ఈ మహా సంగ్రామంలో కౌరవులు అందరు అంతం అవ్వగా కేవలం 12 మంది మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉన్నారు. అయితే మహాభారతం లో చాలా మందికి తెలియని కొన్ని ప్రత్యేకతలు అనేవి ఉన్నాయి. మరి ఆ ప్రత్యేకతలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు. మహాభారత కథను వ్యాసుడు రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు. మహాభారత కథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు.
ఇక దేవాసురయుధ్దంలా కురుక్షేత్రంలోమహాభారత యుద్ధం జరిగింది.ఈ యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు. ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. ఒక అక్షౌహిణి అంటే 21,870 రథములు, 21,870 ఏనుగులు, 65,610 గుఱ్ఱములు, 1,09,350 కాలిబంట్లు అని చెబుతారు.
వీరిలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11 అక్షౌహిణులు. పాండవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు. ఈ యుద్ధం జరిగిన ప్రదేశం శమంతక పంచకం. తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ రక్తంతో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం.
పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు. పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు.
వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే వినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు. మహాభారతంలోని ఉపపర్వాలు 100 అని చెబుతారు. ఇలా ఈ కొన్ని మహాభారతంలోని చాలా మందికి తెలియని విషయాలుగా చెప్పుకోవచ్చు.