వాతావరణంలో ఉండే కాలుష్యం వల్ల కావొచ్చు, ఆహారపు అలవాట్ల వల్ల కావొచ్చు చర్మం ముడతలు, గుంతలు ఏర్పడి అందానికి అడ్డంకిగా మారతాయి. అలాగే వయస్సు పెరిగేకొద్ది కూడా చర్మ సమస్యలు పెరుగుతాయి. ముఖం మీద ఉండే చిన్న రంథ్రాలు క్రమేనా గుంతల్లా మారిపోతాయి. సాధారణంగా చర్మం మీద ఉండే చిన్న రంధ్రాలు విస్తరించినప్పుడు సేబాషియస్ గ్రంథి ఏర్పడుతుంది.
ఇది చర్మాన్ని రక్షించేందుకు నూనెలను విడుదల చేస్తుంది. అయితే, కొంతకాలం తర్వాత ఆ నూనెలే చర్మానికి ప్రతికూలంగా మారతాయి. చిన్న రంధ్రాలను సాగదీస్తాయి. కొన్నాళ్ల తర్వాత అవి పెద్దవిగా మారి అందహీనంగా మరతాయి. ముఖంపై ఈ రంధ్రాలని తొలగించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే కాస్ట్లీ క్రీములని కూడా వాడతారు కానీ ప్రయోజనం ఉండకపోవచ్చు. అయితే అటువంటి వాళ్ళు ఈ చిట్కాలు వాడితే సులువుగా ముఖంపై రంధ్రాలని తొలగించొచ్చు.
అందానికి వాడే చిట్కాల్లో కచ్చితంగా పసుపు ముందు వరుసలో ఉంటుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గుంతలలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. దీంతో గుంతలను క్రమంగా తొలగించేయొచ్చు. ఒక టీ స్పూన్ పసుపుకు కొద్దిగా నీళ్లు కలిపి పేస్టులా చేసుకోండి. దాన్ని ముఖానికి రాయండి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేయండి.
ముల్తానీ మట్టి కేవలం మొటిమలనే కాదు, చర్మం మీద ఏర్పడే రంధ్రాలను సైతం మాయం చేస్తుంది. ఇది చర్మం మీద ఉండే నూనెలను పీల్చుకుని పెద్ద రంధ్రాలు ఏర్పడకుండా కాపాడుతుంది. చర్మంలోని మృత కణాలను సైతం తొలగిస్తుంది. వారానికి ఒకసారి ముల్తాని మట్టి రాస్తే.. రంధ్రాలు బిగువుగా మారతాయి. ముల్తానీ మట్టిని మీ ముఖానికి బాగా రాసుకోండి. అది ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
ముఖం పై రంధ్రాలను తగ్గించడానికి పెట్రోలియం జెల్లీ తీసుకుని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆలా చేస్తే పెట్రోలియం జెల్లీ లో ఉండే ఆక్లూజివ్ నేచర్ స్కిన్ రంధ్రాలను పూడ్చి వేసి, చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. దీనికోసం మొదట డబుల్ క్లెన్సింగ్ తో మొదలు పెట్టడం ఉత్తమం. తర్వాత డైలీ స్కిన్ కేర్ రొటీన్ అయిన టోనింగ్, మాయిశ్చరైజేషన్, సీరం వంటివి ఫాలో అవ్వండి. ఆ తరువాత ముఖానికి పెట్రోలియం జెల్లీని అప్లై చేసి రాత్రంతా ఉంచి ఉదయం వాష్ చేసేసుకోండి. ఇలా చేస్తే ముఖం పై రంధ్రాలని తొలగించొచ్చు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఉపయోగించే ఓట్స్ చర్మ సంరక్షణకు కూడా బాగా సహయపడతాయి. చర్మంపై ఉండే ఆయిల్, అలాగే రంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్‌లో ఒక టేబుల్ స్పూన్ పాలు కలపాలి. ఆ మిశ్రమాన్ని చర్మానికి రాయండి. బాగా ఆరిన తర్వాత మీ ముఖాన్ని కాసేపు రుద్దండి. అనంతరం చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
దోసకాయ నిమ్మనీరు కూడా ముఖంపై రంధ్రాలను దూరం చేయడానికి బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే సిలికా మీ చర్మానికి యవ్వనాన్ని అందించడమే కాకుండా పెద్ద రంధ్రాలను దగ్గరకు చేస్తాయి. వీటికి నిమ్మరసం చేర్చినట్లయితే మరింత మెరుగైన ఫలితాలను చూడవచ్చు. నిమ్మ కూడా గుంతలను మాయం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల దోసకాయ రసంలో ఒక స్పూన్ నిమ్మరం కలపండి. ఆ రసాన్ని దూది(కాటన్ బాల్స్)తో ముఖానికి అద్దండి. అది బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
మెటిమల వల్ల చాలా మంది ముఖంపై గుంతలు పడతాయి. కానీ ఇలా తేనె, పంచదారతో కలిపి మర్దన చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. తేనె, పంచదార సమపాళ్లలో తీసుకొని బాగా కలిపి కళ్ల చుట్టూ మినహాయించి ముఖానికి, మెడకు పట్టించాలి. ఆ తర్వాత వలయాకారంలో మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి నునుపుదనం రావడంతోపాటు మృతకణాలు తొలగిపోతాయి. ముఖంపై రంధ్రాలు తగ్గిపోతాయి.
అరటి పండు తొక్క కూడా ముఖంపై రంధ్రాలను పూడ్చడంలో కీలకంగా పనిచేస్తుంది. ఎందుకంటే అరటి పండు తొక్కలో లుటీన్ ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ పోషణకు సహకరిస్తాయి. అరటి పండు తొక్కను మీ చర్మం మీద గుండ్రంగా రుద్దండి. ఇలా15 నిమిషాలు చేసి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీన్ని వారంలో రెండుసార్లు చేస్తే చాలు. ముఖం మీద ఏర్పడిన పెద్ద రంధ్రాలు క్రమేనా మాయమవుతాయి.
అలాగే ముఖం మీద గుంతలు ఉంటే కమలాఫల రసంలో దూదిని ముంచి ముఖానికి అద్దుకుంటే గుంతలు నెమ్మదిగా తగ్గిపోతాయి. ముఖంపై గుంతలు ఏర్పడకుండా ఉండాలంటే గంజిని కూడా తీసుకోవచ్చు.
ఇక బయట ముఖంపై ఎన్ని రకాలైన ఫేస్ ప్యాక్ లు వాడినా కాని శరీరం లోపల శుభ్రపరచకపోతే, కోరుకున్న అందం మీ సొంతం అవ్వదు. నీరు సహజ డిటాక్సిఫైయర్ లాగా పనిచేస్తుంది, ఇది మీ శరీర వ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇంకా శరీరం నుండి అవాంఛిత పదార్థాలను బయటకు పంపిస్తుంది. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల చర్మం శుభ్రపడి, కాంతివంతంగా ఉంటుంది.
వాటర్ ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల చర్మం యొక్క ఎలాస్టిసిటీ పెరుగుతుంది. దీని వల్ల చర్మం తొందరగా పొడి బారకుండా ఉంటుంది. చర్మం లోని ఎలాస్టిసిటీ పెరగడం వల్ల చర్మం ఎక్కువ కాలం సాగిపోకుండా ఉంటుంది. దీని వల్ల వయస్సుతో వచ్చే గీతలు, ముడతలు లాంటివి రావు. పుష్కలంగా నీరు త్రాగటం వల్ల ముఖ చర్మంపై ఉన్న నూనె ఇంకా నీటి శాతాన్ని బాలన్స్ చేస్తుంది. దీని వల్ల ముఖంపై ఉన్న రంధ్రాలు శుభ్రపడి మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.