Home Unknown facts స్వామివారు శిరస్సు ఒక రూపాన్ని మరియు దేహం మరొక రూపాన్ని కలిగి ఉండే ఆలయం

స్వామివారు శిరస్సు ఒక రూపాన్ని మరియు దేహం మరొక రూపాన్ని కలిగి ఉండే ఆలయం

0

మన దేశంలో మనం చూడగల పుణ్యక్షేత్రాలు అనేకం ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఎదో ఒక విశిష్టత అనేది తప్పకుండా ఉంటుంది. అలాంటి దేవాలయాలలో మనం ఇప్పుడు చెప్పుకొనే దేవాలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఆలయంలో విశేషం ఏంటి అంటే గర్భగుడిలోని స్వామివారి విగ్రహం యొక్క శిరస్సు ఒక రూపాన్ని మరియు దేహం మరొక రూపాన్ని కలిగి ఉండే అధ్బుత దృశ్యం మనకి దర్శనమిస్తుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? అలా రూపాన్ని కలిగి ఉండటానికి కారణం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hari Hara Kshetram తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని జిల్లెలగూడలో వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం కొలువై ఉంది. ఈ ఆలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటి అంటే స్వామివారు మత్చ్యవతారం లోని విష్ణువు దేహం వలె ఉండగా, శిరస్సు లింగాకారంలో ఉంటుంది. అందుకే ఈ ఆలయం హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి పొందినది.

ఈ ఆలయం ఉత్తరాభిముఖంగా ఉంటుంది. సాధారణంగా శైవ క్షేత్రాలలో ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే స్వామివారు ఉత్తరాభిముఖంగా కనిపిస్తారు. కానీ ఈ ఆలయంలో స్వామి ఎల్లప్పుడు ఉత్తరాభిముఖుడై భక్తులకి దర్శనమిస్తుంటాడు.

ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, గోల్కొండను 15–16 శతాబ్దాల మధ్య కుతబ్‌షాహీ సుల్తానులు పాలిస్తున్న కాలంలో ఈ ఆలయం నిర్మితమైనదని భావిస్తున్నారు. ఆరోజుల్లో ఒక రైతు తన బిడ్డడైన ప్రసాద్‌ను చక్కగా చదివించి సుల్తానుల కొలువులో ఉద్యోగిగా చేర్చారు. అతన్ని అందరూ కిసాన్‌ ప్రసాద్‌ అని పిలిచేవారట. అతను దైవ భక్తి పరాయణుడు. అతనికి పిల్లలు లేరు. ఒకరోజు విధినిర్వహణలో భాగంగా కొంతమంది సహోద్యోగులతో రాజ్యపర్యటనకు బయలులేరి తిరిగి తిరిగి సాయంత్ర సమయం అయ్యేటప్పటికి గుడి ఉన్న ప్రాంతంలో అందరితో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు కలలో వేంకటేశ్వరస్వామివారు దర్శనమిచ్చి ఈ పక్కన బావిలో ఉన్నాను నన్ను వెలికి తీసి ఆలయం నిర్మించి నన్ను ప్రతిష్టించి నిత్యపూజలకు ఏర్పాట్లు చేయి. నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అని పలికారు. ఆ మరునాడు ఉదయమే కిసాన్‌ ప్రసాద్‌ గోల్కొండకు చేరుకుని సుల్తాన్‌కు జరిగిన విషయం తెలిపాడు. అప్పుడు ఆయన అనుమతితో తన సహచరులతో క్రితం రోజు తాను విశ్రాంతి తీసుకున్న ప్రాంతంలో ఉన్న చెరువుకు చేరువలో ఉన్న బావిలో వెతికించగా భూదేవి, శ్రీదేవి విగ్రహాలు లభించాయి. భక్తి శ్రద్ధలతో వాటిని వెలికి తీసి ఆలయ నిర్మాణం జరిపి స్వామివారిని ప్రతిష్టించి నిత్యపూజలు జరిపే ఏర్పాట్లు గావించారు. త్వరిత కాలంలోనే ప్రసాద్‌కు ఓ శుభ ముహూర్తాన ఒక కుమారుడు కలగడంతో తన జీవితమంతా స్వామి పాదసేవకు అంకితం చేసాడని పురాణం.

ఇలా ప్రత్యేక రూపంలో దర్శనమిచ్చే స్వామి పెళ్లి కావడానికి కలుగుతున్న అడ్డంకులను తొలగించి, వెంటనే వివాహ సంబంధాలను కుదిర్చే కల్యాణ వేంకటేశ్వర స్వామిగా, పిల్లల కోసం పరితపిస్తున్న వారికి వెంటనే సంతానాన్ని ప్రసాదించే సంతాన వేంకటేశ్వరుడిగా కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకి కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు.

Exit mobile version