Here Is The Place Where 3 Seas, Sunset & Sunrise Occur At One Place

0
2813

భారతదేశం యొక్క చివరి సరిహద్దుగా ఈ ప్రదేశాన్ని చెబుతారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఒకేచోట మూడు సముద్రాలూ కలుస్తాయి. అంతే కాకుండా ఈ ప్రదేశంలోనే మనం సాయంకాలం పౌర్ణమి రోజుల్లో అస్తమిస్తున్న సూర్యబింబాన్ని, ఉదయిస్తున్న చంద్రబింబాన్ని ప్రక్కప్రక్కనే చూడగలిగే అతిగొప్ప సన్నివేశం కనువిందు చేస్తుంది. మరి ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? ఆసక్తి కలిగించే అక్కడ ఉన్న మరిన్ని విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Sunset

దేశాన్ని మూడువైపులా క్రమ్మియున్న మూడు మహాసముద్రాలు కలిపే మహత్తరమైన చోటు కన్యాకుమారి. భారతదేశానికి తూర్పు హద్దుగా ఉన్న బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దుగా ఉన్న హిందూ మహాసముద్రం, పశ్చిమ సరిహద్దుగా ఉన్న అరేబియా సముద్రం ఇక్కడే కలుస్తాయి. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఒక్కో సముద్రంలోని మట్టి ఒక్కో రంగులో ఉంటుంది. ఇక ఈ ప్రదేశంలో తూర్పు, పచ్చిమలు ఒకేదగ్గర ఉండటం వలన మనం సూర్యోదయం సూర్యాస్తమయం ప్రత్యేక్షంగా చూడవచ్చు. ఇక్కడ సూర్యుడు సముద్రంలో నుండి వస్తున్నాడా అన్నట్లుగా వీక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటాడు. ఎక్కడలేని విధంగా ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే మనం ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి వీలు ఉంటుంది.

2-Sunrise

ఈ ప్రాంతంలోనే కన్యాకుమారి ఆలయం ఉంటుంది. సముద్రపు ఒడ్డున భారతదేశ పుణ్యక్షేత్రం మూడు సముద్రాలు ముమ్మూర్తులై ఆదిపరాశక్తి అవతార విశేషమయిన అమ్మవారి పాదపూజ చేస్తున్నాయా అన్నట్లు ఉంటుంది. పదహారేండ్ల బాలిక స్వరూపంలో దుష్టులకు దుర్నీరీక్షయై, భక్తులకు ప్రసన్న సౌకుమార్యంతో మాతృదృక్కులతో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ అవతారం వెనుక బాణాసుర వృత్తాంతం ఒకటి ఉంది, వీరబలగర్వోన్నతుడై చెలరేగిన దుష్టబాణాసురుని వధించుటకు మాత పార్వతీదేవి ఈ అవతారం దాల్చిందని, అది స్థానికంగా ఉన్న రాజకుమారిగా ప్రభవించి యుక్తవయస్సు రాగానే ఆమెకు వరాన్వేషణ మెదలయిందనీ, అంతలోనే ఆమె తన అవతారపు విశేష ఉనికిని తెలిసికొని శుచీంద్రంలో తపస్సులో నిమగ్నమయిన స్థానేశ్వరుని వచ్చి తనను వివాహం చేసుకోవాలని రాయబారం పంపగా స్థానేశ్వరుడందులకు ఒప్పుకొన్నాడు. ముహూర్తం నిర్ణయమైంది కారణ జన్మురాలైన మాత పార్వతి వివాహమాడితే దుష్టరాక్షసుని సంహరించడం ఈ అవతారంలో కుదరదు. కనుక ఈ వివాహం ఎలా ఐన తప్పించాలి అని తలచి ముహూర్తం సమయానికి పరమశివుడు యోగ సమాధిలోకి వెళ్ళేట్లుగా నారదుడు యుక్తిపన్నాడు.

3-Temple

ఇంతలో బాణాసురుడు కన్యయొక్క అందాన్ని గురించివిన్నాడు. ఆమెను తనకివ్వమని వత్తిడి తెచ్చాడు. కోట ద్వారంలోకొచ్చి ప్రేలాపన మొదలెట్టాడు. ఎవరూ దరిచేర సాహసించలేదు. అప్పుడు 16 సంవత్సరాల బాలికయైన రాజకుమారి బయటికివచ్చి బాణాసురుని సంహరించింది. ఇక అప్పటికే ముహూర్తం దాటిపోయింది. ఇక అప్పుడు  పరమశివుడు యోగనిష్టలో అలాగేవుండిపోయాడు. కన్యాకుమారి కన్యగానే మిగిలిపోయి పరమశివుడు స్థానేశ్వరుడు ఇంకావస్తాడని ఎదురుచూస్తూనే ఉంది.

4-Temple

ఇక ఆలయ విషయానికి వస్తే, ఆలయం అంత పెద్దది కాక పోయినా విగ్రహం బహుసుందరమైంది. అమ్మవారికి అనేక మణులు మాణిక్యాలు, వజ్రవైడూర్యాలు పొదిగిన ఆభరణాలెన్నో ఉన్నాయి. వాటిలో మహాప్రకాశమానమైన నాగమణి ఉంది. ఉత్సవ సమయాల్లో మాత్రమే అలంకరిస్తారు.

5-Kanyakumari

మూడు సముద్రాలు కలిసి ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో మిళితమై మెరిసే సంధ్యారుణకాంతులు గగనాన ప్రతిఫలించే తీరులు చూడటానికి మన దేశం నుండే కాదు ఇతర దేశాల నుండి కూడా పర్యాటకులు ఈ ప్రాంతానికి తరలివస్తుంటారు.