క్రీ.శ. 8వ శతాబ్దంలో నిర్మించిన వేములవాడ రాజన్న ఆలయ చరిత్ర

0
484

వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతోంది. కోరిన కోరికలు తీర్చే వేములవాడ రాజన్న ఆలయం ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగినది. పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. దానిప్రకారం క్రీ.శ. 8వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు ఆధారాలున్నాయి.

Vemulawada Rajanna Templeఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడు రాజుగా ఉండేవారు. ఆయనకు ‘రాజాదిత్య’ అనే బిరుదు ఉండేది. ఆయన పేరు మీదుగానే ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయం అని పేరు వచ్చిందని చరిత్రకారులు అభిప్రాయపడుతుంటారు.

Vemulawada Rajanna Templeచాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రంగా వెలుగొందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయం చుట్టూ వున్న దేవాలయాలను నిర్మించడానికి ఆనాటి చాళిక్యుల కాలంలో సుమారు 220 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయ లింగ ప్రతిష్ట వెనుక కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం అర్జునుడి మునిమనవడయిన నరేంద్రుడు ఒక మునిని చంపడం వల్ల అతనికి బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుంది. దాని నుండి విమోచన పొందడం కోసం నరేంద్రుడు దేశాటన చేస్తూ వేములవాడ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడే వున్న ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తూ కాలాన్ని గడిపాడు.

Vemulawada Rajanna Templeఅలా ఆవిధంగా జపం చేస్తున్న నరేంద్రునికి ఒకరోజు కొలనులో ఒక శివలింగం దొరికిందట. ఆ శివలింగాన్ని అతను ఇప్పుడున్న వేములవాడ ప్రాంతంలో ప్రతిష్టించి భక్తితో పూజించడం మొదలుపెట్టాడు. శివుడు అతడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నరేంద్రుడు తనని బ్రహ్మ హత్యాపాతకం నుండి విమోచనం చేయవలసిందని కోరగా… శివుడు అతడికి విముక్తి ప్రసాదిస్తాడు.

Vemulawada Rajanna Templeఇలా ఈవిధంగా ఏర్పడిన ఈ క్షేత్రం ‘లేంబాల వాటిక’గా, ‘భాస్కర క్షేత్రం’, ‘హరిహర క్షేత్రం’గా పిలవబడింది. ఈ రాజేశ్వర ఖండంకు సంబంధించిన కథ భవిష్కోత్తర పురాణంలో వివరంగా చెప్పబడి వుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది.

Vemulawada Rajanna Templeఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి. ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి, దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

Vemulawada Rajanna Templeశైవులు, వైష్టవులు, జైనులు, బౌద్ధులు ఇలా రకరకాల జాతులకు చెందినవారు ఈ ఆలయాన్ని తరుచూ సందర్శిస్తారు. ఈ దేవాలయంలో వున్న శిల్పాలు కూడా జైన, బౌద్ధ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

ఈ ఆలయంలో ఇంకొక విశిష్టమైన అంశం వుంది. ఈ ఆలయ ప్రాంగణంలో 400 సంవత్సరాలనాటి పురాతన మసీదు వుంది. పూర్వం ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ ఆలయంలోనే వుంటూ నిత్యం స్వామివారిని సేవిస్తూ ఉండేవాడట. అతని మరణం కూడా ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. అలా అతని పేరు మీద ఇక్కడ మసీదును నిర్మించడం జరిగింది.

Vemulawada Rajanna Templeఈ ఆలయం హైదరాబాద్ నుండి 136 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ పట్టణం నుండి 36 కిలోమీటర్ల దూరంలో వున్న వేములవాడ ప్రాంతంలో వుంది. ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రంగా పిలవబడుతున్న ఈ ఆలయానికి శివరాత్రి పర్వదినం రోజున లక్షలాది భక్తులు విచ్చేస్తుంటారు.

 

SHARE