ఒళ్లు నొప్పులతో ఏదో తెలియని అలసట, అవిశ్రాంతంగా అనిపిస్తుంటుంది. మారిన లైఫ్ స్టైల్‌తో కొద్దిగా శారీరక శ్రమ చేస్తే చాలు ఒళ్లంతా అలసిపోయిన భావన కలుగుతుంది. ఇక ఒళ్లు నొప్పులు తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ వాడుతుంటాం. దానికి అలవాటు పడకుండా ఇంట్లోనే సహజంగా ఒళ్లు నొప్పులు తగ్గేలా కొన్ని చిట్కాలు చూద్దాం.
ఏదైనా వైద్యపరమైన ఇబ్బందిలో భాగంగానే ఒళ్లు నొప్పులు వస్తాయి. ఒళ్లు నొప్పులనేవి పెద్ద ప్రమాదకరమైనవి కాదు గానీ వాటి వల్ల బాగా ఇబ్బంది ఉంటుంది. ఇక వాటి చికిత్సకు ముందు అవెందుకు వస్తాయో తెలుసుకుందాం.
- ఒత్తిడి
- డీహైడ్రేషన్
- నిద్రలేమి
- మూర్ఛ
- న్యుమోనియా
- ఆర్థరైటిస్
- నరాలు తేలినప్పుడు
- ఫైబ్రోమైయోగ్లియా- దీర్ఘకాలంపాటు ఒళ్లు నొప్పులు ఉండటం..
- ఫ్లూ, జలుబు లాంటి సాధారణ ఇన్ఫెక్షన్లు
- బీపీ లాంటి వాటికి చికిత్స చేసేటప్పుడు
- హైపోక్యాలేమియా- పొటాషియం పాళ్లు శరీరంలో తగ్గినప్పుడు-తరచూ ఒళ్లు నొప్పులు వస్తాయి.
ఇలాంటి కారణాల వల్ల ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. ఐతే ఈ నొప్పులకు పరిష్కారం మన వంటింట్లోనే ఉంటాయి. అవేమిటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
యాపిల్ సిడార్ వెనిగర్:
ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్‌ను వేసి బాగా కలపండి. దీనికి కాస్త తేనె కలిపి తాగండి. లేదా యాపిల్ సిడార్ వెనిగర్‌ను స్నానం చేసే నీళ్లలో వేసి స్నానం చేయండి. ఇలా రోజుకు 1 లేదా 2 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. యాపిల్ సిడార్ వెనిగర్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పిని తగ్గిస్తాయి.
ఐస్ ప్యాక్‌తో:
ఐస్ ముక్కలు తీసుకొని నొప్పి ఉన్న ప్రాంతంలో 10 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా 2-3 సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోజుకు 3 సార్లు ఈ ప్యాక్ వేస్తే చాలు. చల్లని ఐస్ ప్యాక్ బాడీకి పట్టిస్తే ఒళ్లు నొప్పులు నిదానంగా తగ్గుతాయి. ఆ ప్రాంతాల్లో నరాలు కాస్త కుదుటపడతాయి. టెంపరరీ రిలీఫ్ లభిస్తుంది.
దాల్చిన చెక్క:
ఒక గ్లాసు గోరువెచ్చిన నీటిలో పొడి చేసిన దాల్చిన చెక్క వేసి బాగా కలపాలి. దీనికి కొంచెం తేనె కలుపుకొని రోజుకోసారి తాగాలి. దాల్చిన చెక్క అనేక వంటల్లో సుగంధాన్ని వెదజల్లే పదార్థంగా వాడతారు. దీనికి యాంటీ ఇన్‌ప్లమేటరీ, అనాల్జసిక్, నొప్పి తగ్గించే గుణాలు మెండు. ఇది మంచి ఆరోగ్యానికి, ఒళ్లు నొప్పులు తగ్గేందుకు సహకరిస్తుంది.
అల్లం:
ఒక చిన్న అల్లం ముక్క కప్పు నీళ్లలో వేసి మరగబెట్టాలి. దీన్ని వడకట్టి తేనె కలుపుకొని టీ లా తాగాలి. ఇలా రోజుకు మూడు సార్లు తాగాలి. అల్లంలో ఆరోగ్యాన్ని పెంచే గుణాలుంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జెసిక్ గుణాలున్నాయి. ఇవి ఒళ్లు నొప్పులను తగ్గించడంలో సహకరిస్తాయి.
పసుపు:
ఒక గ్లాసు వేడి పాలలో ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. చల్లారక తేనె కలపాలి. పడుకునే ముందు ఈ పాలు తాగాలి. పసుపు ఒళ్లు నొప్పులు తగ్గేందుకు చాలా మంచిది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జసిక్, నొప్పి తగ్గించే గుణాలు పసుపులో మెండు.
మిరియాలు:
ఒక గ్లాసు గోరువెచ్చిన నీటిలో మిరియాల పొడి వేసి బాగా కలపాలి. దీనికి కొంచెం తేనె కలుపుకొని రోజుకోసారి తాగాలి. మిరియాల్లో కెప్‌సాసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది నొప్పిని తగ్గించగలదు. రక్త ప్రసరణను మెరుగు పర్చి సహజమైన పెయిన్ రిలీవర్‌లా పనిచేస్తుంది.