జుట్టుకు సంబంధించి మనకు వచ్చే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. విటమిన్ల లోపం, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, నీళ్లు పడకపోవడం, ఒత్తిడి.. తదితర అనేక కారణాల వల్ల చుండ్రు బాగా వస్తుంటుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి త్వరగా విముక్తి పొందవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
సాధారణంగా ఇంట్లో అందరూ ఒకే దువ్వెనతో తల దువ్వుకుంటారు. కానీ అలా చేయరాదు. ఎవరి దువ్వెనతో వారే దువ్వుకోవాలి. కొన్ని సార్లు ఒకరి తలలో ఉండే ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు దువ్వెనల ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయి. కనుక ఎవరి దువ్వెనలను వారు వాడితేనే మంచిది.
మన పెరటి లో ఉన్నటువంటి వేపతో ఎన్నో లాభాలు ఉన్నాయి. వేప చాలా రోగాలను పోగొడుతుంది. ముఖ్యంగా చుండ్రు సమస్య ఉన్నవారు తరచూ వేప ఆకుల పేస్టు పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
చుండ్రు సమస్య, జుట్టు ఎండినట్లు మారడం, చిక్కులు పడటం, దురదలు, జుట్టు రాలుట, జుట్టు సన్నగా అవ్వటం, వెంట్రుకలు చిట్లిపోవటం ఇలా ఎలాంటి సమస్య ఉన్నా వేపతో చక్కటి పరిష్కారమార్గం ఉంటుంది.
ముందుగా వేపని ముద్దగా చేసి నీరుపోసి దానిని వెంట్రులక కుదుళ్ల వరకూ రాసుకోవాలి. ఇలా రాయడం వల్ల ఆ కుదుళ్ల దగ్గర ఉన్న చుండ్రు పోతుంది. ఇలా రెండు గంటలు ఉండి సాధారణంగా స్నానం చేయండి చుండ్రు సమస్య తగ్గుతుంది.
చుండ్రును తగ్గించడంలో టీ ట్రీ ఆయిల్ అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ మైక్రోబియల్ సమ్మేళనాలు చుండ్రుకు కారణమయ్యే బాక్టీరియా, ఫంగస్, వైరస్‌లను నాశనం చేస్తాయి. టీ ట్రీ ఆయిల్‌ను జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా మర్దనా చేసి ఆ తరువాత కొంత సేపటికి తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది. చుండ్రు తగ్గాలంటే వారంలో కనీసం ఇలా 3 సార్లు చేయాల్సి ఉంటుంది.
ఇతర హెయిర్ ఆయిల్స్‌కు బదులుగా స్వచ్ఛమైన కొబ్బరినూనెను జుట్టుకు రాయాలి. కనీసం 8 వారాల పాటు రోజూ తలకు కొబ్బరినూనె రాస్తే 68 శాతం వరకు చుండ్రు తగ్గుతుందని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను షాంపూ లేదా కొబ్బరినూనెలో కలిపి రాసుకుని.. ఆ తరువాత కొంత సేపటికి తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే చుండ్రు త్వరగా తగ్గుతుంది.
ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలు, అవిసె విత్తనాలు, వాల్‌నట్స్ తింటే వెంట్రుకల సమస్యలన్నీ పోతాయి. ముఖ్యంగా చుండ్రు తగ్గుతుంది.