నెలసరి సమయంలో ఐదు రోజులూ అమ్మాయిలు ఎన్నో ఇబ్బందులు ఎదర్కొంటుంటారు. పొత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పి, కాళ్లుచేతులు లాగడం, చిరాకుగా అనిపిండం..ఇలా ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. ఆ కొందరు వాటిని తమలో తామే భరించుకుంటుంటే… మరికొందరు మాత్రం వాటి నుంచి బయటపడటానికి ట్యాబ్లెట్లను ఆశ్రయిస్తున్నారు.
అది కూడా ఏ మెడికల్ షాపుకో వెళ్లి, వాళ్లు ఇచ్చే మాత్రలు వేసుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం కలిగినా.. దీర్ఘకాలంలో వాటి వల్ల కొన్ని దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మందులు వాడి సమస్య నుంచి బయటపడాలంటే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది. అలాకాకుండా కొన్ని సహజమైన చిట్కాలను పాటించడం ద్వారా కూడా పీరియడ్ క్రాంప్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
1. హీటింగ్ ప్యాడ్:
నెలసరి సమయంలో ఎక్కువ మంది ఎదుర్కునే సమస్య పొత్తి కడుపులో నొప్పి. ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి హీటింగ్ ప్యాడ్ లో వేడి నీళ్లు పోసి దాన్ని పొట్ట దగ్గర పెట్టుకోండి. కచ్చితంగా నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. హీటింగ్ ప్యాడ్ లేకపోతే.. వాటర్ బాటిల్లో వేడినీళ్లు పోసుకుని దాన్నైనా ఉపయోగించవచ్చు.
2.మెంతులు:
మెంతులు వల్ల మనకు చాలా ప్రయోజనాలున్నాయి. మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరిచి బరువు తగ్గడంలో సహకరిస్తాయి. ఈ మెంతులే.. పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులనూ తగ్గిస్తాయి. దీనికోసం కొద్దిగా మెంతులను గ్లాసు నీటిలో వేసి 12 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని తాగాలి.
3. శొంఠి, మిరియాలు:
శొంఠి, మిరియాలు నీటిలో వేసి బాగా కాచి తయారుచేసిన కషాయం తాగితే.. నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు దూరమవుతాయి. కాస్త ఘాటుగా ఉండే ఈ కషాయం తాగలేమనుకుంటే.. దానిలో కొంచెం పంచదార కలుపుకుని తాగొచ్చు.
4.నువ్వుల నూనెతో మసాజ్:
కడుపు నొప్పి ఎక్కువగా ఉంటే.. నువ్వుల నూనెతో పొత్తి కడుపుపై మర్దన చేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. ఒకప్పుడు రోజూ నువ్వుల నూనెతో ఒంటికి మర్దన చేసుకుని స్నానం చేసేవారట. అందుకే అప్పటి తరం వారు ఎంత నొప్పినైనా తట్టుకునేలా ఉండేవారు.
5.సోంపు:
సోంపు ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. అంతేకాదు.. మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అంటే నెలసరి సమయంలో వచ్చే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.