దత్తాత్రేయుడు జంభాసురుణ్ణి ఎలా సంహరించాడు?

0
353

గురు అవతారం దత్తాత్రేయుడు పరమాత్మ ఒక్కో సమయంలో ఒక్కో అవతారంలో వచ్చి ప్రజల్ని ఉద్ధరిస్తాడు. ధర్మావతారాల్లో రాముడిగా, కృష్ణుడిగా రాక్షస సంహారం ద్వారా ధర్మసంస్థాపన జరిపిన నారాయణుడే దత్తాత్రేయుడి అవతారంలో సమర్థ గురువుగా జ్ఞానప్రబోధ చేశాడు. దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి ఆరో అవతారమని భాగవతమూ, విష్ణుపురాణమూ ఘోషిస్తున్నాయి. అత్రి మహర్షి, అనసూయ దంపతుల తనయుడిగా జన్మించాడు బాలదత్తుడు. ఆ దంపతులు ఓంకారాన్ని ధ్యానిస్తూ మహాతపస్సు చేశారు. ఆ సాధనకు మెచ్చి ఓ దివ్య తేజస్సు ప్రత్యక్షమైంది.

దత్తాత్రేయుడుఆ కాంతిపుంజంలో త్రిమూర్తులు దర్శనమిచ్చారు. ఆ ముగ్గురు మూర్తుల అంశగా దత్తుడు వారికి జన్మించాడు. అత్రి అంటే త్రిగుణాతీత స్థితికి చేరుకున్నవాడని అర్థం. అతడి అర్ధాంగి అనసూయ అసూయలేనిది. నిజానికి ఇవి పేర్లు కాదు ఆ ఆలూమగల సుగుణాలు. ఆ సద్గుణ సంపన్నుల బిడ్డగా జన్మించాడు దత్తుడు. దత్తం అంటే సమర్పించుకోవడం. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు. అత్రిపుత్రుడు కాబట్టి ఆత్రేయుడన్న పేరూ వచ్చింది.

దత్తాత్రేయుడుదత్తుడిది జ్ఞానావతారం పిచ్చివాడిలానో, వ్యసనపరుడిలానో కనిపించి పైపై మెరుగులకు భ్రమపడిపోయే అజ్ఞానులకు బుద్ధిచెప్పిన ఉదంతాలు అనేకం. దేవతలకు కూడా చేతిలో కల్లుముంతతో, ఒడిలో ప్రియురాలితో దర్శనమిచ్చాడోసారి. అది సుర కాదు, బ్రహ్మజ్ఞానం. ఆమె శ్రీలక్ష్మి. దత్తుడు ఓపట్టాన అర్థం కాడు. దత్తతత్వాన్ని తెలుసుకోవాలంటే అహాన్ని వదిలిపెట్టాలి. శరణాగతి సూత్రాన్ని పాటించాలి.

దత్తాత్రేయుడుపూర్వం జంభాసురుడనే రాక్షసుడు ప్రజల్ని హింసించేవాడు. దీంతో దేవతలంతా విష్ణు స్వరూపుడైన దత్తాత్రేయుడిని ప్రార్థించారు. ఆ రాక్షసుడిని నా దగ్గరికి తీసుకురండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను అని మాటిచ్చాడు. దీంతో దేవతలు జంభాసురుడి మీద కయ్యానికి కాలుదువ్వుతున్నట్టు నటించారు. ఆ అసురుడికి కోపం తన్నుకొచ్చింది. ఇంతకుముందే చావుదెబ్బ తీశాను.

దత్తాత్రేయుడుఅంతలోనే ఇంత ధైర్యం ఏమిటి? అంటూ కోపంగా మళ్లీ రంగంలో దూకాడు. దేవతలు ఉద్దేశపూర్వకంగా వెన్నుచూపారు. జంభాసురుడు వాళ్లను తరుముతూ వెళ్లాడు. దత్తుడి సమక్షంలోకి వెళ్లగానే ఠక్కున మాయమైపోయింది దేవగణమంతా. ఎదురుగా ఒడిలో అందాల రాశితో, మహాభోగిలా దర్శనమిచ్చాడు దత్తాత్రేయుడు. జంభాసురుడి కళ్లు ఆ సౌందర్యరాశి మీదికి మళ్లాయి. ఆమె శ్రీమహాలక్ష్మి అన్న ఇంగితం కూడా లేకుండా బలవంతంగా తీసుకెళ్లి నెత్తిమీద పెట్టుకున్నాడు. సంపద నెత్తికెక్కిందంటే, పతనం మొదలైనట్టే. జంభాసురుడి బలం క్షీణించసాగింది. దేవతల పని సులువైపోయింది. అసుర సంహారం జరిగిపోయింది.

 

SHARE