దుర్గ దేవి కొన్ని పేర్లు గురించి కొంతమందికి మాత్రమే అవగాహనా ఉంటుంది. అలాంటి నామాలలో హేమ దుర్గ ఒకటి. ఆపేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

పూర్వం దుర్గాసురుడనే రాక్షసుడు బ్రహ్మను గురించి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. ఆ వర గర్వతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడు. ఇంద్రాది దేవతలు అప్పుడు పరాశక్తికి మొరపెట్టుకోగా ఆ దేవి కరుణించి శతాక్షి రూపం ధరించి దుర్గాసురుణ్ణి సంహరించింది. ఆ దేవి హేమవర్ణ తేజస్సుతో వెలిగి పోవడం వల్ల హేమదుర్గే అని ఆమెను దేవతలు స్తుతించారు.

దుర్గాదేవి దుర్గాసురుని సంహరించడం కోసం, వరుణినిచేత శంఖం, అగ్నిచేత బల్లెం, వాయువుచేత బాణాలు అంబులపొది, ఇంద్రునిచేత వజ్రాయుధం, బ్రహ్మచేత అక్షమాల, సూర్యునిచేత కిరణాలు, శివుని చేత సింహ వాహనం పొందింది. స్కందపురాణం సహ్యాద్రి ఖండంలో ఈ దుర్గామాత విజయగాథలు పొందుపరచబడి వున్నాయి. శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపురసుందరి, లలితాత్రిపురసుందరి, రాజరాజేశ్వరి, చిచ్ఛక్తి రూపమైన కుండలినీ మహాశక్తియే శ్రీ కనకదుర్గాదేవి.