Home Unknown facts యమపాశం రాముణ్ణి చేరడానికి యముడు చాలా కష్టపడ్డాడు ఎందుకు ?

యమపాశం రాముణ్ణి చేరడానికి యముడు చాలా కష్టపడ్డాడు ఎందుకు ?

0

లవకుశలను శ్రీరాముడికి అప్పగించింది సీతమ్మ. ఆ తరువాత సీత నేలను చూస్తూ, ‘‘అమ్మా! రఘువంశదీపకులైన కుమారులు తండ్రి దగ్గరికి చేరుకున్నారు. నాకు కావలసిందింకేమీలేదు, కరుణతో నన్ను స్వీకరించు!’’ అంది.

Lava Kusaluసీతమ్మ మాటలు విన్న భూదేవి అనుగ్రహించింది. భూమి కంపించింది. భూమి రెండు పాయలుగా చీలింది. దివ్యకాంతులు వెలువడ్డాయి. రత్నసింహాసనంపై భూదేవి మీదికి వచ్చి సీతను తన ఒడిలోకి తీసుకొని భూమిలోకి వెళ్ళిపోయింది. పుష్పవృష్టి కురిసింది. భూమి వెంటనే మూసుకుంది. రాముడు భూమిని చీలుస్తానని విల్లెక్కు పెట్టాడు. అప్పుడు ఆకాశవాణి, ‘‘రామా! భూదేవిపై ఆగ్రహించడం మంచిది కాదు. సీత భూమిజ. భూమిలోకి వెళ్ళి నిజనివాసం చేరింది!’’ అని పలికింది.

రాముడు కుమారులను చూసుకొంటూ చాలాకాలం రాజ్యం చేశాక, యమధర్మ రాజు బ్రాహ్మణవేషంతో వచ్చి, దేవ రహస్యం చెప్పవలసి ఉందనీ, లక్ష్మణుడిని ద్వారం దగ్గిర కాపు కాయమని, ఎవరినైనా రానిస్తే లక్ష్మణుడు మరణదండన పొందాలనీ, రాముడితో చెప్పి ఒప్పించాడు. లక్ష్మణుడు ద్వారపాలన చేస్తున్నాడు. యముడు నిజరూపంతో కనిపించి రాముడితో అవతరించిన పని అయిపోయింది అని, వైకుంఠానికి విష్ణువుగా చేరాలని చెప్పాడు.

కానీ హనుమంతుడు నీతో ఉన్నంత కాలం నేను యమ పాశాన్ని ప్రయోగించలేనని చెబుతాడు. అదే సమయంలో దుర్వాసుడు వచ్చి వెంటనే రాముడిని చూడటానికి వెళ్ళనివ్వకపోతే రఘువంశాన్ని శపిస్తానన్నాడు. దుర్వాసుణ్ణి లోపలికి వెళ్ళనిచ్చి, లక్ష్మణుడు అలాగే వెళ్లి సరయూనదిలో మునిగిపోయాడు.

రాముడు లవకుశలను పట్టాభిషిక్తుల్ని చేసి రాజ్యపాలన చేయించాడు. రాముడి ఉంగరం పాతాళ లోకంలో పారేసుకుని వెతికి తీసుకురావలసిందిగా హనుమంతున్ని పాతాళలోకానికి పంపించాడు. అది శ్రావణమాసం. సరయూనది నిండుగా ఉరకలెత్తి ప్రవహిస్తుంది. ఆనాడు పూర్ణిమ. చంద్రగ్రహణపర్వదినం. మంగళ తూర్యనాదాలు మ్రోగుతూండగా, భరతశత్రుఘ్నులు ఇరువైపులా అంటి పెట్టుకొని నడుస్తుండగా, రాముడు సరయూనదికి బయలుదేరాడు. అశేష ప్రజానీకం రాముణ్ణి అనుసరించారు.

రాముడు నదీజలాల్లో ప్రవేశించాడు. వెనుకనే తమ్ముళ్ళు దిగారు. అప్పుడే గ్రహణం విడిపోయి, నిండు చంద్రబింబం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఆకాశం నుండి జలజలా అఖండంగా పూలవాన కురిసింది. సామ,దేవగాంధార, హిందోళ, సురట రాగాల మేళవింపుతో వీణాధ్వనులు దిక్కులు మారుమ్రోగుతూండగా వినిపించాయి.

అంతటా వెన్నెల మరింత తెల్లగా వెల్లి విరుస్తుంది, పూలవాన కురుస్తుంది క్షీరసాగరంలాగ సరయూనది పూల రాసులతో నిండి ఉవ్వెత్తు కెరటాలతో వడివడిగా ప్రవహిస్తుంది. అంతకుముందే క్షీరసాగరంలో లక్ష్మణుడు శేషతల్పంగా, సీత లక్ష్మిగా అమరి ఎదురుచూస్తున్నారు. భరతశత్రుఘ్నులు శంఖచక్రాలుకాగా రామావతారం చాలించి, విష్ణువు లక్ష్మీ సమేతంగా శేషతల్పం అలంకరించాడు.

మాయామానుష విగ్రహుడై ఉత్తమ మానవతామూర్తిగా పితృవాక్యపాలనకై వనవాసం చేసి, కార్యసాధకుడైన మానవ మాత్రుడిగా వానరులను కూడగట్టుకొని వారధినికట్టి, అజేయుడని విర్రవీగిన రావణుడినికొట్టి చంపి రాక్షసపాలన అంత మొందించి సీతను తెచ్చి, ఏకపత్నీ వ్రతుడై ఆదర్శపాలన చేసిన రాముడి అవతారం విష్ణువు దశావతారాల్లో చాలా విశేష మైందిగా కీర్తింపబడింది.

 

Exit mobile version