తిరుమలలో తరుచుగా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ఆ సమయంలో స్వామి వారి విగ్రహాన్ని ఊరేగించడం జరుగుతుంటుంది. ఉత్సవ సందర్భాలలో స్వామి వారిని వివిధ వాహనాలపై, రథాలపై ఊరేగింపుగా ఈ మాడ వీదులలో తిప్పుతారు. అయితే ఎప్పుడు మాడ వీధులు అనే వినడమే తప్ప అసలు మాడ వీధులు అంటే ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అసలు మాడ వీధులు అంటే ఏంటి? తిరుమలలో ఉన్న ఆలయ ప్రాంగణంలో ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తిరుమల శ్రీ వారి ఆలయం చుట్టూ వున్న ప్రధాన రహదారులను మాడ వీధులు అంటారు. తమిళంలో ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి ‘మాడాం’ అని పిలుస్తారు. అదే మాడవీధులు గా మారింది. నాలుగు దిక్కులలో ఉన్న వీధులను దిక్కుల పేరు మీదుగా తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పడమర మాడ వీధి, ఉత్తర మాడ వీధి అని పిలుస్తారు.
ఒకప్పుడు ఆలయం చుట్టూ స్వామి వారు వాహనంలో ఊరేగడానికి గాను సరియైన వీధుల ఉండేవి కావు. అంచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ ఇక్కడ చేసినా మిగతా కార్యక్రమాలు, ఊరేగింపులు తిరుచానూరులో జరిపేవారు శ్రీరామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధుల నేర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు ఏర్పాట్లు చేశారు. తదనంతరం తి.తి.దే. మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు.
తిరుమలేశుని ఆలయం చుట్టూ ఉన్నా నాలుగు మాడ వీధులును. నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు.
ఆలయం ముందున తూర్పు ముఖంగా ఉన్న వీధి తూర్పుమాడవీధి. ఈ మాడవీధి పొడవు ౭౫౦ అడుగులు. ఇది శ్రీవారి ఆలయం ముందు నుండి పుష్కరిణి వరకు ఉంటుంది. ఒకప్పుడు పుష్కరిణి గట్టు పైన కూడా ఇళ్ళుండేవి. ఈ వీధిలోనే శ్రీవారి కొయ్య రథం ఉండేది. శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు. ఒకప్పుడు అక్కడ సన్నిధి వీధి, వేయికాళ్ళ మండపం ఉండేవి. సన్నిధి వీధికి ఇరు ప్రక్కలా అంగళ్ళుండేవి. మాస్టర్ ప్లాన్ లో భాగంగా చారిత్రాత్మక కట్టడం వెయ్యి కాళ్ళ మండపం తొలగించబడింది.
దక్షిణ దిక్కున ఉన్నది దక్షిణ మాడ వీధి. ఈ మాడ వీధుల పొడవు 900 అడుగులు. ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది. ఈ వీధి మొదట్లో ‘ఊంజల్ మండపం’ ఉంది. ఇది వరకు శ్రీవారికి ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ ఈ మండపంలోనే జరిగేవి. ప్రతిరోజూ సాయంత్రం శ్రీనివాసుడు తన ప్రియసఖులతో ఈ మండపం లోనే ఊయల ఊగుతూ భక్తులకు కనువిందు చేసేవాడు. దీన్ని తరువాత ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చటం జరిగింది.
ఉత్తరం వైపున ఉన్న వీధిని ఉత్తర మాడ వీధి అని అంటారు. ఉత్తరమాడవీధుల పొడవు 900 అడుగులు. ఉత్తరాది వారి మఠం, తిరుమల నంబి తోళపు కైంకర్య నిలయం, అహెబిల మరం శ్రీ వైఖానస అర్చక నిలయం ఈ వీధిలోనే ఉన్నాయి. స్వామి పుష్కరిణి ఈ వీధిలోనే ఉంది. ఉత్తరమాడ వీధిలోనే పుష్కరిణి ఒడ్డున శ్రీ వ్యాసరాజ అహన్నిక మంటపం, ఆంజనేయస్వామి సన్నిధి, శ్రీ విఖనస మహర్షి సన్నిధి ఉన్నాయి. వాటి కెదురుగా శ్రీ రాధాకృష్ణ దేవాలయం, శ్రీ హయగ్రీవ మందిరం ఉన్నాయి. శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో వరాహ స్వామి ఆలయం ఉంది. ఈ వీధిలోనే తాళ్ళపాక వారి ఇల్లు ఉండేది తరిగొండ వెంగమాంబ మొదట్లో ఇదే వీధిలో గల ఇంటిలో నివసించేది. ఇప్పటికీ ఆమె సమాధి తరిగొండ బృందావనం ఆ వీధిలో చూడవచ్చు.
పడమరన ఉన్న వీధి పడమర మాడ వీధి. ఇది ఆలయానికి వెనక వైపున 900 అడుగుల పొడవు ఉంటుంది. ఒకప్పుడు అక్కడ ఎన్నో మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం తిరుమల చిన జీయర్ స్వామి మఠం,కర్ణాటక కళ్యాణ మండపం, వసంత మండపం ఉన్నాయి. ఈ నాలుగు మాడ వీధుల గుండా ఆలయాన్ని చుట్టివచ్చే మార్గానికి మహా ప్రదక్షిణ మార్గమని పేరు. ఈ మహా ప్రదక్షిణం మొత్తం విస్తీర్ణం 16.2 ఎకరాలు. కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ పాత పుష్కరిణి షెడ్లు, శ్రీవారి అర్చకుల ఇండ్లు కూడా ఉండేవి. కానీ యాత్రిక జనం రద్దీ పెరగడం వల్ల క్షేత్ర విస్తరణ కోసం ఈ ప్రదక్షిణ మార్గంలో ఉన్న మఠాలు,సత్రాలు పడగొట్టి విశాలంగా తీర్చిదిద్దారు.