పూర్వం మహావిష్ణువు తన బావగారైన శివుడుని కలుసుకోవడానికి కైలాసానికి బయలుదేరుతాడు. (విష్ణువు, పార్వతీదేవి అన్నాచెల్లెళ్లు). మహావిష్ణువు అక్కడికి చేరుకున్న వెంటనే తన చేతిలో వున్న సుదర్శన చక్రాన్ని, గదను, ఇంకా తన శరీరంపై వున్న ఇతర ఆయుధాలను తీసి పక్కన పెడతాడు. అక్కడే ఆడుకుంటున్న బాలగణపతి బంగారు కాంతులతో వెలిగిపోతున్న ఆ సుదర్శన చక్రాన్ని నోట్లో వేసుకుని, మౌనంగా వుండిపోతాడు.
శివునితో మాటల్లో మునిగిపోయిన విష్ణువు ఈ ఉదంతాన్ని గమనించలేకపోతాడు. కొద్దిసేపు తరువాత సుదర్శన చక్రం ఎక్కడుందోనని గుర్తుకువచ్చి, విష్ణువు దానిని వెతకడం మొదలుపెడతాడు. ఎంత వెతికినా దొరకకపోయేసరికి నీరసంగా వుండిపోతాడు. అది చూసిన గణపతి ఏం వెతుకుతున్నావు మావయ్యా.. అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా విష్ణువు నా సుదర్శన చక్రం ఎక్కడ పెట్టానో గుర్తుకు లేదు. ఎక్కడుందోనని వెదుకుతున్నా అని చెబుతాడు.
అప్పుడు గణపతి సుదర్శన చక్రమా..? ఇంకెక్కడుంది నేను దానిని తినేశాగా అని చెబుతాడు. గణపతి తనకు మేనల్లుడు అయిన కారణంతో విష్ణువు అతనిని ఏమీ చేయలేక చక్రం తిరిగి ఇవ్వమని బ్రతిమిలాడుతాడు. ‘‘సుదర్శన చక్రం దుష్టులకు సంహరించడానికి ఉపయోగించే ఆయుధం. దానిని ఎలాగైనా బయటికి తీయు’’ అని వేడుకుంటాడు. కానీ గణపతి, విష్ణువు మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుకుంటూ వుండిపోయాడు.
అప్పుడు శ్రీమహావిష్ణువు తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకుని గణపతి ముందు గుంజీళ్లు తీయడం మొదలుపెట్టాడు. విష్ణువు అలా చేస్తుండగా గణపతికి విచిత్రంగా అనిపించి, కడుపుఉబ్బేలా విపరీతంగా నవ్వాడు. అలా నవ్వడంతో గణపతి కడుపులో వున్న ఆ సుదర్శన చక్రం బయటపడుతుంది. విష్ణువు ఊపిరి పీల్చుకుని తన సుదర్శన చక్రాన్ని తీసుకుంటాడు.
ఇలా ఈ విధంగా శ్రీ మహావిష్ణువు, గణపతి ముందు గుంజీళ్లు తీయడంతో అదొక ఆచారంగా మారిపోయింది. పురాతన కాలం నుంచి ప్రతిఒక్కరు గణపతి ముందు గుంజీళ్లు తీయడం ఒక సంప్రదాయం అయిపోయింది. శాస్త్రీయపరంగా గమనిస్తే గుంజీళ్లు తీయడం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. గుంజీళ్లు తీయడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ బాగా పెరిగి, మెదడుకు మేధస్సు శక్తి వృద్ధి చెందుతుంది. అంతేకాదు.. దీనిని ‘‘సూపర్ బ్రెయిన్ యోగా’’ కూడా పరిగణిస్తున్నారు.