మూషికాసురుణ్ణి ఎలాగైనా తనముందుకు తీసుకురావాలని వినాయకుడు సూక్ష్మ మరుగుజ్జు రూపం ధరించాడు. అప్పటి వరకు గణపతి వెనకనే మూషికాసురుడు మూషిక రూపంతో ఉన్నాడు. ఆయన స్థితిని గమనించిన మూషికాసురుడు ఒక్కసారిగా వినాయకుడి ముందుకు వచ్చి, విగ్నేశ్వరునికి పట్టినగతి చూసి పటపట పళ్ళుకొరికి, నిజ రూపంతో బోర్ర విరుచుకొని విఘ్నేశ్వరుడి ముందు నిలబడి దిక్కులు అదిరేలా సింహనాదం చేశాడు.
విఘ్నేశ్వరుడు బలిష్ఠమైన అతని శరీరాన్ని చూసాడు. మూషికాసురుడు నిర్లక్ష్యంగా విషపునవ్వు నవ్వుతూ, ‘‘విఘ్నం నీ బానిస కనుక ఏంచేసినా చేసావుగాని, నేను నీ జన్మవిరోధిని. సింహస్వప్నం అనేమాట వినే ఉంటావు, నేను సింహాన్నై నీ కుంభస్థలాన్ని చీలుస్తాను!” అని అంటూ సింహంగా మారి పెద్దగా గర్జించాడు. విఘ్నేశ్వరుడు, ‘‘సింహమా! నువ్వు జగజ్జనని వాహనానివి, నిన్ను గౌరవిస్తున్నాను!” అన్నాడు.
సింహం మళ్ళీ గర్జించి ఉరకబోతూంటే, విఘ్నేశుడు, ‘‘శివా, శరభా!” అని స్మరించాడు. సింహానికి ఎదురుగా శివుని శరభావతారం ఘీంకార గర్జనలుచేస్తూ నిలిచింది. శరభానికి సింహశరీరము, కేశాలు, కోరలు, ఏనుగు తొండం, దంతాలు ఉన్నాయి. మహాసర్పం లాంటి తోకచివర, జ్వాలలు కక్కే మకర ముఖము ఉంది. శరభం జూలు అగ్ని శిఖల్లాగా ఎగురుతున్నాయి. శరభం తొండంతో సింహం ముఖం వాచేలా కొట్టింది. సింహం తోకముడిచి పరుగుతీసింది. శరభావతారం మాయమైంది.
విఘ్నేశ్వరుడు తొండాన్ని యోజనం పొడవున సాగదీసి సింహం నడుము చుట్టిపట్టి ఎత్తాడు. సింహం కిరకిరలాడింది. ఆ సమయంలో ఆకాశగమనం చేస్తున్న నారదుడు ఆనందంతో ‘సా’ అని గొంతు సాగదీస్తూ, ‘‘సామజ వరవదనా!” అంటూ హిందోళ రాగాన్ని ఆలాపించాడు. దేవతలు గుమిగూడి ఆకాశం నుండి వింత చూస్తున్నారు.
విష్ణువు, ‘‘విజయ విఘ్నేశ్వరా! నువ్వు పట్టిన సింహాన్ని పెంచుకుంటాను, ఇవ్వవూ?” అన్నాడు. విఘ్నేశ్వరుడు నవ్వి, ‘‘పెంచినట్టే పెంచి తలా, గోళ్ళూ తీసుకొని నరసింహావతారం ఎత్తి హిరణ్యకశ్యపుణ్ణి చీలుద్దామనా? అదేం కుదరదు. ఈ మృగరాజు అవసరం నాకు ఉంది, నీ నరసింహావతారం నీవు చూసుకోవలసిందే!” అన్నాడు.
తొండం మూషికాసుర సింహాన్ని తిన్నగా తీసుకెళ్ళి మహాశ్వేత ముందు విడిచి అదృశ్యమైంది. మహాశ్వేత భర్తకు హితవు చెప్పినా వినకుండా నిజరూపంతో విఘ్నేశ్వరుడితో ఢీకొనడానికి పరుగుతీశాడు. మహాశ్వేత, ఆది పరాశక్తి అయిన అ దేవిని ప్రార్థించింది. దేవి కనిపించి, ‘‘నీ భర్త విఘ్నేశ్వరుడికి ఎలుక వాహనంగా చిరంజీవిగా ఉంటాడు. అలా రాసిపెట్టి వుంది. నీవు కూడా శ్వేతఛత్రానివై నీ భర్తతోబాటు కలకాలం విఘ్నేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటావు!”అని చెప్పి అంతర్థానమైంది.