శివపార్వతులు జగత్తును ఏలే ఆదిదంపతులు ఎలా అయ్యారు

శివపార్వతులు ఆది దంపతులు. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. పార్వతీదేవి హిమవంతుని కూతురు. కలిగినవారింట పుట్టిన పిల్ల. బాల్యంలో భోగభాగ్యాలు అనుభవించింది. ఆకులయినా తినకుండా తపస్సు చేసి అపర్ణగా మారి శివుడిని తనవాడిగా చేసుకుంది. అయితే, ఆ జంగమయ్యను చేరాక ఆమె అంతకాలం అనుభవించిన భోగమంతా మటుమాయమైంది. కపాలం పట్టుకుని, భవతీ భిక్షాందేహీ.. అంటూ ఊరంతా తిరుగుతూ, వల్లకాడులో సంసారం నడపమంటాడాయన. అయినా పరమేశ్వరి భర్తను ఎన్నడూ తూలనాడదు. తొందరపాటుతనంతో చాలా సందర్భాల్లో పీకలమీదికి తెచ్చుకుంటాడు శివుడు. అయినా పల్లెత్తుమాటయినా అనదామె. గంగమ్మను తెచ్చి సిగలో తురుముకున్నా, లోకం కోసమే పతిదేవుడు ఈ పనిచేశాడని అర్థం చేసుకోగలిగింది.

ఆదిదంపతులుశంకరుడు కూడా ఏ సందర్భంలోనూ పత్నికి అడ్డుచెప్పిందే లేదు. ఆమె నిర్ణయాలను కాదన్నదీ లేదు. తనకు దేనిమీదా అనురక్తిగానీ, ఆశలు కానీ లేకపోయినా, తనలో సగపాలయిన పార్వతీదేవికి ఉండవచ్చనేది ఆయన మాట, బాట. అతగాడు జడలు కట్టిన కేశాలతో… తోలుదుస్తులతో, కాలసర్పమే కంఠాభరణంగా తిరిగినా అమ్మవారు మాత్రం ఏడువారాల నగలతో పట్టుపీతాంబరాలతో సర్వాలంకారశోభితమై అలరారుతుంది. ఆయన వాక్కు అయితే, ఆమె ఆ వాక్యానికి అర్థం. ఆయన ఆదిభిక్షువైతే, ఈమె ఆయనకు అన్నం పెట్టే అన్నపూర్ణ అవుతుంది. ఇంతటి ఒద్దికైన ఆలుమగలను మరెక్కడా చూడలేం. ఆదిదంపతులుగా ఈ ప్రపంచాన వీరు ప్రసిద్ధమైంది ఇందుకే.

ఆదిదంపతులులయకారుడిగా శివుడికి అధికారం అధికంగా ఉండాలి. ఆ అధికారాన్నే… పార్వతి, దుర్గ, శక్తి రూపాలుగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంటే ఆ శక్తిని ఆయన తనలో భాగంగా ధరించాలి. శివుడు, శక్తి… కలిసి పనిచేయడమంటే, స్త్రీపురుషులు సమానమేనని అంతరార్థం. ఈ సాంప్రదాయాన్ని చూపడానికే శివుడు + శక్తి కలిసి అర్ధనారీశ్వరుడిగా దర్శనమిస్తారు. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండరు. శక్తితో కలిసిన శివుడిని సంపూర్ణుని (సగుణబ్రహ్మ)గా, శక్తితో లేనప్పుడు అసంపూర్ణుని (నిర్గుణబ్రహ్మ)గా పండితులు చెబుతారు. ఈశ్వరుడు అర్ధనారీశ్వరుడు కదా. అందుకే కాలం కూడా స్త్రీ పురుష రూపాత్మకమైంది. చైత్రం మొదలు భాద్రపదం వరకు అర్ధభాగం పురుష రూపాత్మకం. ఆశ్వయుజంనుంచి ఫాల్గుణం చివరి వరకు గల కాలం స్త్రీ రూపాత్మకం.

ఆదిదంపతులుశివపార్వతుల కళ్యాణానికి వెళ్లిన ఓ ముసలి ముత్తయిదువ పక్కన కూర్చున్న పేరంటాలితో గుసగుసగా ఈ మాటలు అంది..ఇదేం విడ్డూరం అమ్మాయ్! పార్వతి దేవి ఎండకన్నెరుగని పిల్ల, పరమేశ్వరుడేమో ఎండలో ఎండిపోతూ వానలో తడిసిపోతూ శ్మశానాల్లో బతికే రకం! ఆమె తనువంతా సుగంధ లేపనాలు, అతడి శరీరమంతా బూడిద గీతలు. ఆమె చేతులకు వంకీలు, అతడి చేతులకు పాము పిల్లలు. ఎక్కడా పొంతనే లేదు చూస్తూ ఉండూ నాలుగు రోజులైతే పెళ్ళి పెటాకులవుతుంది! అంది. నాలుగు రోజులు కాదు, నాలుగు యుగాలు గడిచిపోయాయి కానీ వారు ఆదిప్రేమికులు, ఆదిదంపతులుగా వర్ధిల్లుతూనే ఉన్నారు.

ఆదిదంపతులుబయటికి కనిపించే రూపాన్ని కాదు శివుని అంతః సౌందర్యాన్ని చూసింది పార్వతి దేవి. అతడు విష్ణువు అయితే ఆమె లక్ష్మీ దేవీ. అతడు సూర్యడైతే ఆమె నీడ. అతడు పదం అయితే ఆమె అర్థం. అలా అని ఆ దంపతుల మధ్య విభేదాలు రాలేదా అంటే వచ్చాయి, ఆ కాపురంలో సమస్యలు తలెత్తలేదా అంటే తలెత్తాయి. ప్రతి సమస్య తర్వాత ఆ బంధం మరింత బలపడింది. ప్రతి సంక్షోభం ముగిశాక ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు. ఏ ఆలుమగలైనా పట్టువిడుపుల పాఠాల్నిశివపార్వతుల నుంచే నేర్చుకోవాలి! ఒకసారి శివుడు మాట చెల్లించుకుంటే, మరోసారి పార్వతి పంతం నెగ్గించుకుంటుంది!

ఆదిదంపతులుమధురలో అమ్మవారిదే పెత్తనం సుందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మకు మొగుడే. నైవేద్యాలు కూడా దొరసానమ్మకు నివేదించాకే దొరవారికి. అదే చిదంబరంలో నటరాజస్వామి మాటే శాసనం. శివకామసుందరి తలుపుచాటు ఇల్లాలు. ఒక్క మధురై, ఒక్క చిదంబరం ఏంటి! ఇలా ఎన్నోచోట్ల భార్య పెత్తనం అలానే భర్త పెత్తనం మరి కొన్నిచోట్ల. అందుకే వారు ఇద్దరూ జగత్తును ఏలే ఆదిదంపతులు అయ్యారు. అందుకే ఏ జంటను దీవించాలన్నా పార్వతి పరమేశ్వరులు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,670,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR