చండీయాగం ఎన్ని రకాలు? ఏది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది?

రాజకీయ నాయకులు, కొన్ని పెద్ద పెద్ద సంస్థల వారు చండీ యాగం చేయడం చూస్తుంటాం. లోక రక్షకులైన అమ్మవారి స్వరూపాల్లో చండీ ఒకటి. లోక కల్యాణం కోసం, విశేష కార్యసిద్ధి కోసం సకల చరాచర జగత్తు సృష్టికి, స్థితికి, లయకు మూల కారణమైన జగన్మాతను ఆరాధించడం అనాదిగా వస్తోంది. అందులో ముఖ్యమైనది ఛండీ హోమం. ఛండీ హోమం అత్యంత శ‌క్తివంత‌మైన‌ది. ఒక్క భూగ్రహమే కాకుండా విశ్వాంతరాళాలని ఆదిశక్తి అంటిపెట్టుకునే ఉంటుంది.

Importance And Benefits Of Chandi Yagamసృష్టి జరగడానికి, అది వృద్ధి చెందడానికి, తిరిగి లయం కావడానికి అవసరమైన శక్తి అంతా ఆమెలోనే ఉంది. ఆమె ఆది శక్తి, పరాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్చాశక్తి, క్రియా శక్తి, కుండలినీ శక్తి. అందుకే ఆమెకు అంత ప్రాధాన్యం. ఆదితత్త్వాన్ని స్త్రీమూర్తిగా భావించి చేసే ప్రకృతి ఉపాసనే శ్రీవిద్య. అది లలితా పారాయణం, చండీ పారాయణం అని రెండు రకాలు. బ్రహ్మాండ పురాణం, దేవీ భాగవతం లలితాదేవి మహిమలను చెబితే, మార్కండేయ పురాణం చండీ మహత్మ్యాన్ని వివరిస్తుంది. చండీ లేదా దుర్గాదేవి విజయాలను వివరించడంతోపాటు బ్రహ్మాది దేవతలు ఆమె వైభవాన్ని కీర్తించే శక్తిమంతమైన మంత్రాల కదంబమే చండీ లేదా దుర్గా సప్తశతి.

Importance And Benefits Of Chandi Yagamచండీ హోమంలో ఉన్న మంత్రాలు ఎంతో శ‌క్తివంత‌మైన‌వి. చండీ సప్తశతిలో 700 మంత్రాలు ఉంటాయని ప్రతీతి. అయితే, ఇందులో ఉన్న మంత్రాలు 578 మాత్రమే. ఉవాచ మంత్రాలు, అర్థశ్లోక, త్రిపాద శ్లోక మంత్రాలతో కలిపి మొత్తం 700 మంత్రాలయ్యాయి. బ్రాహ్మీ, నందజా, రక్తదంతికా, శాకంబరీ, దుర్గా, భీమా, భ్రామరీ అనే ఏడుగురు దేవతామూర్తులకు సప్తసతులు అని పేరు.

Importance And Benefits Of Chandi Yagamవారి మహత్య్మ వర్ణనతో కూడిన మంత్రాలు కాబట్టి దీనికి చండీ సప్తసతి అనే పేరు వచ్చింది. ఇది శాక్తేయ హోమం కాబట్టి నిష్ఠగా చేయాల్సి ఉంటుంది. దుర్గ లేదా చండీ సప్తశతి మూడు చరిత్రలుగా, 13 అధ్యాయాలుగా ఉంటుంది. తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. రెండో భాగంలో మూడు అధ్యాయాలు, మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో మధుకైటభ వర్ణన, మహిషాసుర సంహారం, శుంభనిశుంభుల వధతోపాటు బ్రహ్మాది దేవతలు చేసిన పవిత్ర దేవీ స్తోత్రాలు ఉంటాయి. సప్తశతిని మూడు పద్ధతుల్లో ఆచరిస్తారు. పూజ, పారాయణ, హోమం. ఈ మూడు పద్ధతుల్లో జగన్మాతను ప్రసన్నం చేసుకుంటారు.

Importance And Benefits Of Chandi Yagamపారాయణలో దశాంశం హోమం, దశాంశం తర్పణం ఇస్తారు. చండీ హోమానికి సంబంధించి నవ చండీ యాగం, శత చండీ యాగం, సహస్ర చండీ యాగం, అయుత (పది వేలు) చండీ యాగం, నియుత (లక్ష) చండీ యాగం, ప్రయుత (పది లక్షలు) చండీ యాగం చేస్తారు. చండీ పారాయణ వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎక్కడ చండీ ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు. ఆ ప్రాంతంలో అకాల మరణాలు ఉండవు. లోక కల్యాణం, సర్వజనుల హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహిత ఉద్ఘాటిస్తోంది.

Importance And Benefits Of Chandi Yagamకలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తిమంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం. ఇహపర సాధనకు చండీ హోమం ఉత్తమం. ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీ హోమం. దేశోపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారు. వీటిలో నవ చండీ యాగం చేస్తే వాజపేయం చేసినంత ఫలం వస్తుందట. ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడని, ద్వాదశ చండి చేస్తే శత్రు నాశనమని, మను చండి(చతుర్దశ చండి)తో శత్రువు వశమవుతాడని మార్కండేయ పురాణం చెప్పినట్లు శాంతి కమలాకరంలో ఉంది.

Importance And Benefits Of Chandi Yagam ఇక, శత చండి చేస్తే కష్టాలు, వైద్యానికి లొంగని అనారోగ్యం, ధన నష్టం తదితరాలు తొలగుతాయి. సహస్ర చండితో లక్ష్మీదేవి వరిస్తుంది. కోరికలు నెరవేరతాయి. లక్ష చండి చేస్తే చక్రవర్తి అవుతాడని మార్కండేయ పురాణంలో ఉంది. దీనినే నియుత చండి అంటారు. ప్రయుత చండి అంటే పది లక్షల చండీ సప్తశతి పారాయణాలు. వీటిలో చండీ హోమం, నవ చండీ, శత చండీ యాగాలను తరచుగా, సహస్ర చండీ యాగాలను అరుదుగా చేస్తుంటారు. అయుత చండీ యాగాలను చేయడం చాలా అరుదు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR