Home Unknown facts ఈ ఆలయ దర్శనం సంవత్సరంలో 4 నెలలు మాత్రమే ఉంటుంది ఎందుకు ?

ఈ ఆలయ దర్శనం సంవత్సరంలో 4 నెలలు మాత్రమే ఉంటుంది ఎందుకు ?

0

ప్రపంచంలో ఏడు నదులు ఒకేచోట కలిసే అద్భుతమైన ఏకైక ప్రదేశం ఇదేనని చెబుతారు. ఈ నదులు శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ వెళ్లి చివరకు సముద్రంలో కలుస్తాయి. ఇక్కడ విశేషం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఆలయం సంవత్సరంలో భక్తులకి నాలుగు నెలలు మాత్రమే దర్శనం ఇస్తుంటుంది. మరి ఈ అద్భుత ప్రదేశం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Sangameshwara temple

ఆంధ్రప్రదేశ రాష్ట్రం, కర్నూలు జిల్లాకి 56 కి.మీ. దూరంలో సంగమేశ్వరం అనే గ్రామంలో సంగమేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఇది చాల పురాతనమైన ఆలయం. ఈ ఆలయం ధర్మరాజు ప్రతిష్టగా పురాణాలూ చెబుతున్నాయి. సంగమేశ్వర ఆలయం ఏడునదులు కలిసే ప్రదేశం. అందుకే ఈ క్షేత్రానికి సప్తనది సంగమం అని పిలుస్తుంటారు.

ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. అయితే పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు ప్రతిష్ట సమయానికి రాలేదు. రుషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్పుతుంది.

ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఎందుకంటే ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విశేషం ఏంటంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం దర్శనమిస్తూ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈవిధంగా కేవలం 4 నెలలు మాత్రమే దర్శనం ఇచ్చే ఈ దేవాలయాన్ని చూడటానికి భక్తులు చాల ఆసక్తితో వస్తుంటారు.

Exit mobile version