Home Unknown facts అరటి చెట్టు పవిత్రత తెలిస్తే పూజలో వాడకుండా ఉండరు

అరటి చెట్టు పవిత్రత తెలిస్తే పూజలో వాడకుండా ఉండరు

0

సృష్టి ఆదిలో విరాట్ స్వరూపునితో పాటు లక్ష్మీ, రాధ, దుర్గ, వాణి, సావిత్రి, అనే పంచ శక్తులు ఆవిర్భవించాయి. ఈ ఐదుగురిలో రాధ, సావిత్రులది సమాన సౌందర్యం. అయితే సావిత్రి తన సౌందర్యాన్ని చూసుకుని గర్వించడం ప్రారంభించింది. విరాట్ మూర్తి ఆమెను “బీజం లేని చెట్టు” గా భూలోకంలో జన్మించమని శపించాడు. తన తప్పును తెలుసుకున్న సావిత్రి విధి లేక భూలోకంలో కదళీ (రంభ) పేరుతో అరటిచెట్టుగా జన్మించింది. తన శాపవిముక్తి కోసం ఐదువేల సంవత్సరాలు విరాట్ మూర్తికి ఘోర తపస్సు చేసింది.

అరటి చెట్టుకదళీ తపస్సును మెచ్చిన విరాట్ మూర్తి ప్రత్యక్షమై, ఆమెకు పుణ్యలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు. అంతే కాకుండా కదళిని మానవ, మాధవసేవ నిమిత్తం భూలోకంలోనే ఉండమని ఆదేశించాడు. విరాట్ మూర్తి ఆదేశం పొందిన ఆ పర్వదినమే మాఘకృష్ణ చతుర్థశి. దీనినే అరటి చతుర్థశి అని కూడా అంటారు.

భగవంతునికి సమర్పించడానికి ఈ ప్రకృతిలో ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ కేవలం అరటిపండు, కొబ్బరి కాయకు మాత్రమే అగ్ర తాంబూలం లభిస్తుంది. కాబట్టి, భగవంతునితో శాశ్వతబంధాన్ని ఏర్పరచే సంపూర్ణ ఫలాలు అరటి పండు, కొబ్బరికాయ మాత్రమే. దీనికి కారణం, సృష్టిలోని అన్ని ఫలాలను ఆరగించి, వాటిలోని విత్తనాలను నమిలి పారవేస్తాం. అలా ఆరగించడంతో ఆ విత్తనాలు ఎంగిలిపడతాయి. ఆ విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఏర్పడి ఫలాలను ఇస్తాయి. అలా లభించిన ఫలాలు మరలా ఎంగిలిపడిపోతున్నాయి.

అటువంటి ఎంగిలి పడ్డ ఫలాలను భగవంతునికి నివేదించడం అంత శ్రేష్ఠం కాదు. కాని, అరటిపండులో సావిత్రి విరాట్ మూర్తి శాపం వల్ల బీజంలేని చెట్టుగా ‘భూలోకంలో అరటి చెట్టుగా జన్మించింది. కాబట్టి అరటి చెట్టు విత్తనాల ద్వారా కాక, పిలకల ద్వారా మొలిచి, అన్ని కాలాలలోనూ అరటి పండ్లును ఇస్తాయి. అలా అరటిపండు పూర్ణఫలంగా విఖ్యాతిని పొందింది.

Exit mobile version