చండీ యాగం చేయడం వలన కలిగే ఫలితాలు ఏంటి

పురాతన కాలం నుండి మన దేశం ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. విశ్వ కల్యాణం, ప్రజా శ్రేయస్సు కోరుతూ రాజులు, చక్రవర్తులు, మునీశ్వరులు పూర్వకాలంలో యాగాలు నిర్వహించేవారు. అగ్నిదేవుని సాక్షిగా హవిస్సులు సమర్పిస్తే, దేవతలు సంతృప్తి చెందుతారని యజ్ఞయాగాదులు నిర్వహించేవారు. యాగం నిర్వహించడం అంటే సాధారణ విషయం కాదు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు.

Importance Of Chandi Yagyamఅయితే ఐతిహాసిక ప్రాశస్త్యం ఉన్న మహాక్రతువుల్లో ప్రముఖంగా వినిపించేది చండీయాగం. మరి చండీ అంటే ఎవరు? ఎందుకు యాగం అనగానే చండీ మాతను పూజిస్తారు? చండీ అంటే మరెవరో కాదు సకల దేవతా స్వరూపిణిగా పూజలందుకుంటున్న దుర్గామాతయే చండీ పరదేవత. చండి దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది.

Importance Of Chandi Yagyamగ్రామదేవతగా, కులదేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్తమాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా… తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం. చండి మాతను ధ్యాన, ఉపాసనా మార్గాల్లో చండి, నవ చండి,సహస్ర చండి, ఆయుత చండి, లక్షచండి యాగం కూడా చేస్తూ ఉంటారు. 64 తంత్ర గ్రంధాల్లో చండీ యాగం గురించి వివరించటం వల్ల ఎవరు ఏగ్రంధాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్న దానిపై యాగం పేరు నిర్ణయిస్తారు.

Importance Of Chandi Yagyamచండీదేవినీ, ఆమె తేజోరూపమైన చాముండీదేవినీ కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. ఎక్కడ చండి ఆరాధనలు జరుగుతాయో అక్కడ దుర్భిక్షం ఉండదు. దుఃఖం అనేది రాదు, లోక కళ్యాణార్ధం సర్వజన హితం కోసం పరబ్రహ్మ స్వరూపిణి అయిన చండికా పరమేశ్వరులను పూజించాలని సూత సంహితలో పేర్కోన్నారు. మరి చండీయాగం ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

Importance Of Chandi Yagyamచండి యాగం గురించి తేలికైన భాషలో చెప్పాలంటే… ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణ చేసి, హోమం నిర్వహించడమే చండీయాగం. మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీసప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు.

Importance Of Chandi Yagyamయజ్ఞ యాగాదులు నిర్వహించేటప్పుడు ఏ ఉద్దేశంతో సంకల్పం చెప్పుకుంటామో అదే అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది. సంకల్పం మంచిదైతే మహోగ్రరూపధారిణి అయిన కాళీమాత కూడా కరుణామూర్తిగానే సాక్షాత్కరిస్తుంది. చండీయాగాన్ని నిర్వహించే వ్యక్తికి మనోసంకల్పం ధృడంగా ఉండాలి. మనసును స్థిరలగ్నంలో ఉంచుకోవాలి.

చండీయాగాన్నిసాధకులు రెండు రకాల ఆచారాల్లో నిర్వహిస్తుంటారు. 1. వామాచారం పధ్దతి, 2. దక్షిణాచార పధ్దతి. వామాచార పద్ధతిలో రక్త, మాంసాది నైవేద్యాలు, శ్మశానంలో పూజల్లాంటివి ఉంటాయి. ఇక దక్షిణాచారం ప్రకారం బలి ఇవ్వడానికి బదులుగా కొబ్బరికాయలు కొడతారు. రక్త మాంసాది నైవేద్యాలకు బదులుగా పళ్లు, పండ్ల రసాలు సమర్పిస్తారు. పరిమళ ద్రవ్యాలు, పవిత్రజలాలు ఉపయోగిస్తారు. ఉపాసకులు ఎలాంటి మార్గం ఎంచుకుంటారన్నది వారివారి ఆలోచనలనుబట్టి ఉంటుంది. అమ్మవారి దయ మాత్రం ఒకేవిధంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది.

Importance Of Chandi Yagyamచండీ హోమం గురించి క్లుప్తం గా చెప్పాలంటే విఘ్నేశ్వరుడి పూజతో యాగం ప్రారంభం అవుతుంది. యాగం నిర్విఘ్న సమాప్తికి గణపతి మోదక హవనం చేసి మహాసంకల్పం చేస్తారు. పంచగవ్య ప్రాశన చేసి యాగశాల మంటపాన్ని శుద్ధి గావిస్తారు. అనంతరం రుత్విగ్వరణ గావిస్తారు. యాగ నిర్వహణకు వచ్చిన బ్రాహ్మణులు చతుర్వేద పారాయణ, దేవీ భాగవత పారాయణ, కుంకుమార్చన మహారుద్ర పునశ్చరణాదులతో పాటు రుత్వికులంతా ఏక కంఠంతో సప్తశతీ పారాయణాన్ని ఏకోత్తర వృద్ధి క్రమాన్ని అనుసరిస్తూ నాలుగు రోజులు నిర్దేశించిన సంఖ్యను పూర్తి చేస్తారు. ఐదో రోజున పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహిస్తారు.

Importance Of Chandi Yagyamపూర్వకాలంలో చండీయాగం చేయడం వలన రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవిస్తారని, ఆపదలు తొలగిపోతాయని, శత్రువులపై విజయం సాధిస్తారని నమ్మేవారు. రాచరికాలు పోయినా, చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని శక్తిమేరకు నిర్వహించి ఆ శక్తి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR