ధ్వజస్థంబ ప్రతిష్ట హిందూ ఆలయాల్లో ఆచారంగా మారడానికి గల కారణం

0
276

ధ్వజ స్తంభం హిందూ దేవాలయాలలో ఒక భాగం. ఆలయంలో భగవంతునికి చేసే అర్చనలు,నైవేద్యాలు ధ్వజస్తంభానికి కూడా జరుగుతాయి. ఎందుకంటే ఆలయం ఎదుట ఉండే ధ్వజస్థంభం స్థాయి మూల విరాట్టుతో సమానం. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానమే. ఆలయంలోనికి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూలవిరాట్టును చూడకూడదు. అసలు ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయ గుర్తింపు ఇవ్వరు. దేవాలయానికి వెళ్లి ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి. అప్పుడే ప్రదక్షిణలు పూర్తయినట్టు. అలాంటి ధ్వజస్థంబ ప్రతిష్ట హిందూ ఆలయాల్లో ఆచారంగా మారడానికి బలమైన కారణం లేకపోలేదు.

Importance Of Dhwaja Sthambam
కురుక్షేత్ర ధర్మ యుద్ధంలో గెలిచిన తనకంటే సింహాసనాన్ని అధిష్టించాడు. అధర్మానికి, అన్యాయాలకు తావులేకుండా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మమూర్తిగా తనకంటే గొప్ప దాత ఎవరు లేరు అనిపించుకోవాలనే కాంక్షతో ఎడతెరిపి లేకుండా దానధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించి కృష్ణుడు అతనికి తగు గుణపాఠం నేర్పాలనుకున్నాడు. అశ్వమేధ యాగం చేసి, శత్రురాజులను జయించి, దేవ బ్రాహ్మణులను సంతుష్టుల్ని చేసి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేసుకొమ్మని ధర్మరాజుకి సలహా ఇస్తాడు కృష్ణుడు.

Importance Of Dhwaja Sthambamధర్మరాజు శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం అశ్వమేధ యాగం చేయించి, నకుల సహదేవులను యాగశ్వరక్షకులుగా నియమిస్తాడు. అలా బయలుదేరిన ఆ యాగాశ్వం చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు మయూరధ్వజుడు మహా పరాక్రమవంతుడు, గొప్ప దాత. మయూరధ్వజుని పుత్రుడు తామ్ర ధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు.

Importance Of Dhwaja Sthambam
అశ్వాన్ని విడిపించడానికి తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులతో పాటు భీమార్జునులు కూడా ఓడిపోతారు. తమ్ములు ఓడిన విషయం తెలిసిన ధర్మరాజు స్వయంగా బయలుదేరుతాడు. అయితే కృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజున్ని జయించేందుకు ఒక కపట ఉపాయాన్ని చెబుతాడు. ఆ  మేరకు శ్రీకృష్ణుడు, ధర్మరాజులిద్దరూ వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేరుకుంటారు. వారిని చూసిన మయూరధ్వజుడు ఆ బ్రాహ్మణులకు ఏమి దానం  కావాలో కోరుకోమంటాడు. అందుకు శ్రీకృష్ణుడు, తమ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఇతని కుమారున్ని పట్టుకుందని పలుకుతాడు. బాలుని విడిచిపెట్టమని పార్థించగా అందుకా సింహం మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగం నాకు ఆహారంగా ఇప్పించమని కోరిందని చెబుతారు. ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగం దానమిచ్చి బాలుని కాపాడమని కోరుకుంటారు. వారి మాటలు విని అందుకు అంగీకరిస్తాడు మయూరధ్వజుడు. అయితే తమ భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వాలనే నియమాన్ని కూడా పెడతాడు కృష్ణుడు.

Importance Of Dhwaja Sthambamఅందుకు అంగీకరించి భార్యాసుతులు అతని శరీరాన్ని సగంగా కోయటం చూసిన ధర్మరాజు అతని దానగుణానికి నివ్వెరపోతాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు రావటం గమనించిన ధర్మరాజు “తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు”. అందుకు “మహత్మా తమరు పొరపాటుపడ్డారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడిభాగం పరోపకారానికి ఉపయోగపడింది. ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ కన్ను బాధపడుతోంది” అంటూ వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపం చూపి నిజం చెప్పి ఏదైనా వరం కోరుకోమంటాడు. “పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లుగా దీవించండి” అని కోరుకోగా. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని పలికాడు. “మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరంలో ఎవరు దీపాన్ని ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది” అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్టించడం ఆచారంగా మారింది.

SHARE