తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి శనివారం ప్రీతికరం అని చెబుతారు. మరి శ్రీనివాసుడికి శనివారం అంటే ఎందుకు ప్రీతికరం? శనివారం ఎలాంటి పూజచేస్తే సుఖసంతోషాలు కలుగుతాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి ఏడుకొండలపైనా కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న రోజు, శ్రీ మహాలక్ష్మిదేవిని తన వక్ష స్థలాన నిలిపిన రోజు, స్వామివారి సుదర్శనం జన్మించిన రోజు, స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్దలతో పూజిస్తారో వారిని పిండించనని శనిదేవుడు వెంకటేశ్వరస్వామికి మాట ఇచ్చిన రోజు, తొండమాన్ చక్రవర్తికి స్వామివారు తనకి ఆలయాన్ని కట్టించమని చెప్పిన రోజు, స్వామివారు ఆలయ ప్రవేశం చేసిన రోజు, భక్తులు మొదటిసారిగా స్వామివారిని దర్శనం చేసుకున్న రోజు శనివారం అట. అందుకే వెంకటేశ్వరస్వామికి శనివారం అంటే ప్రీతికరం అని చెబుతారు.
ఇక ప్రతి శనివారం రావి చెట్టుకి మూడు ప్రదక్షిణాలు చేస్తే శుభం కలుగుతుందని, చెట్టు కింద ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుందని చెబుతున్నారు. ఇంకా ఇంట్లో ఉండే తులసి మొక్కకి పూజలు చేసే ఈ జన్మలో పాపాలే కాకుండా ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం. ఆడవారు ప్రతి శనివారం తులసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి ఐదవతనం, ఆ ఇంటిని ఎల్లప్పుడూ తులసీదేవి రక్షిస్తుందని చెబుతారు. అంతేకాకుండా వెంకటేశ్వరస్వామికే కాకుండా ఆంజనేయస్వామికి కూడా శనివారం ఇష్టం కనుక ప్రతి శనివారం ఆంజనేయస్వామి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తే కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. ఇంకా ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామి చుట్టూ 7 ప్రదక్షిణాలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
శ్రీ వెంకటేశ్వరస్వామికి ఇష్టమైన శనివారం రోజున ఇలా పూజలు చేయడం వలన సకల సంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి.