ఈ ఆలయంలో కొబ్బరికాయలు దేవుడికి బదులు భక్తుల తలపై కొడతారు

0
222

తలపై కొబ్బరికాయ కొట్టడం అనగానే అనుష్క నటించిన అరుంధతి సినిమా గుర్తుకువస్తుంది. అందులో జేజమ్మ తలపై కొబ్బరికాయలు కొట్టే సీన్ చూస్తే ఒళ్ళు గగ్గుర్లు పొడుస్తుంది. అయితే అది సినిమా కాబట్టి, అందులో చూపించింది నిజం కాదు కాబట్టి పెద్దగా పట్టించుకోము. కానీ అలాంటి ఆచారమే ఒక ఆలయంలో ఉంది అంటే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నమ్మక తప్పదు.

తలపై కొబ్బరికాయ కొట్టే ఆలయంఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేని ఎన్నో వింత సాంప్రదాయాలతో కూడిన పండుగలను మన భారతేదశంలో చూస్తుంటాం. అమ్మవారి ముందు నిప్పులు తొక్కడం, నాలుకలు శూలాలు గుచ్చుకోవడం, కర్రలతో క్రూరంగా కొట్టుకోవడం లాంటి ఎన్నో ఆచారాలు మన పండగల్లో భాగమే. ఇలాంటి పాత ఆచారాలను పాటించడంలో తమిళనాడు రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ప్రతి ఏటా రుతుపవనాల సందర్భంగా ఆది పెరుక్కు అనే రాష్ట్ర పండుగను నిర్వహిస్తారు. ఈ పండుగలో భాగంగా ప్రజలు తలపై కొబ్బరికాయలు కొట్టే వింత ఆచారాన్ని పాటిస్తారు.

తలపై కొబ్బరికాయ కొట్టే ఆలయంతమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో మెట్టు మహాదానపురంలో ఉన్న మహాలక్ష్మి ఆలయంలో ఈ ఆచారాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయం కరూర్ పట్టణం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ తలపై కొబ్బరి కాయలను కొట్టించుకునే ఆచారం చాలా కాలంగా ఉంది. మంచి ఆరోగ్యం, విజయం కోసం ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తుంటారు. కోరుకున్న కోరికలు నెరవేరిన తరువాత దేవతకు కృతజ్ఞతలు తెలుపుతూ భక్తులు తలపై కొబ్బరి కాయలు కొట్టించుకుంటారు.

తలపై కొబ్బరికాయ కొట్టే ఆలయంఆలయంలో ఒక నిర్ధిష్టమైన ప్రదేశంలో కొందరు బ్రహ్మణేతర పూజారులు ఈ ఆచారాన్ని నిర్వహిస్తూ ఉంటారు. దేవతకు తమ కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మహాలక్ష్మి ఆలయ ద్వారాల వెలుపల భక్తులు వేలాదిగా వరుసలో ఉంటారు. పూజారి సరిగ్గా వారి తల మధ్యలో కొబ్బరి కాయలను కొట్టుకుంటూ వెళతాడు. అయితే కొబ్బరి కాయలు కొట్టిన తరువాత చాలా మంది ఏమీ జరగనట్లు అక్కడి నుండి బయటకు నడుస్తూ వెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

తలపై కొబ్బరికాయ కొట్టే ఆలయంఈ ఆచారం వెనుక ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఒకానొక సమయంలో ఇక్కడ భక్తులు శివుని సహాయం కోసం ప్రార్ధించినప్పుడు ఆయన ప్రసన్నం కావడానికి నిరాకరిస్తాడు. దీంతో భక్తులు శివుడికి ఉన్న విధంగా కొబ్బరి కాయకు కూడా మూడు కళ్లు ఉండడం గమనించి, ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి తలపై కొబ్బరి కాయలను పగులగొట్టడం ప్రారంభించారు. చివరకు శివుడు భక్తుల ముందు ప్రత్యక్ష్యమై వారి కోరికను నెరవేర్చినట్లు చెబుతారు. అప్పటి నుండి ఈ ఆచారం కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

ఈ పండుగలో చాలా మంది భక్తుల తలలకు గాయాలు అవుతుంటాయి. కొంతమందికి తలకు కుట్లు కూడా పడుతుంటాయి. అయితే కొందరు మాత్రం దేవత ఆగ్రహిస్తుందనే భయంతోనో, గౌరవంతోనో ఆసుపత్రికి వెళ్లకుండా ఆ నొప్పిని ఓర్చుకుంటారు. భక్తుల తలపై కొబ్బరి కాయలను కొట్టిన తరువాత ఆలయం వద్ద ఉండే సహాయకులు వారి తలపై పసుపు లేదా విభూతిని పూస్తూ ఉంటారు.

 

SHARE