From Nothing To Everything: The Journey, Few Career Best Compositions & Milestones of AR Rehman

Contributed by Boddula Rakesh 

సినిమాల్లో ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటూ కొన్ని ఉంటాయి… ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టవు… చిన్నప్పటి నుండి ఈ రోజు వరకు ఎన్నో సార్లు విని ఉంటాం… అయినా మళ్ళీ మళ్ళీ వింటుంటాం.. ఎందుకంటారు..? ఏమో కదా.. దానికి మన దగ్గర సమాధానం ఉండదు. పాట బాగుంటుంది.. వింటాం.. అంతే కదా.. మరి ఆ పాట అంత గొప్పగా రావడానికి దాని వెనక ఎంతో మంది కృషి ఉంటుంది. పాట రాసేది ఒకరైతే.. ఆ పాటని పాడే వారు మరొకరు. ఈ ఇద్దరి మధ్యలో ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉంటాడండోయ్.. ఆయనే సంగీత దర్శకుడు. అసలు పాటని పాడే విధానం ఇలా ఉండాలనేది ఆ సంగీత దర్శకుడి ఆలోచనే కదా. మరి మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంతగా అసలు ఆయన ఏం చేస్తాడు.. ఏం మ్యాజిక్ చేసి మనల్ని అలా కట్టిపడేస్తాడు.. అదే కదా సంగీత దర్శకుడి మాయ. ఆయన మనసు పెట్టి చేసిన ఆ పాట ఆ తర్వాత మన ప్రాణానికి ప్రాణంగా మారిపోతుంది. ఇప్పుడు కొన్ని పాటలు గుర్తు చేసుకుందాం… “పరువం వానగా నేడు కురిసేనులే…”, “వాలు కనుల దానా…”, “వెన్నెలవే..వెన్నెలవే”, “కన్నానులే..”, “స్నేహితుడా.. రహస్య స్నేహితుడా..”, “పూవుల్లో దాగున్న..”… గుర్తు వచ్చాయా ఈ పాటలన్నీ. మన చిన్నప్పటి నుండి పదే పదే వింటున్న ఎవర్ గ్రీన్ సాంగ్స్ కదా ఇవి.

నాకు తెలిసి ప్రతి ఒక్కరి మ్యూజిక్ ప్లేయర్ లో ఈ సాంగ్స్ తప్పకుండా ఉంటాయి. మరి ఈ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అన్నీ చేసింది ఒకరే… ఆయనే ఏ.ఆర్.రెహ్మాన్. సంగీతానికి హద్దులు లేవని నిరూపించిన మ్యాజికల్ మ్యూజిక్ మాంత్రికుడు. సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి వ్యాపింపజేసి మనందరం గర్వపడేలా చేసిన ప్రతిభాశాలి. అసలు మన వల్ల అవుతుందా.. అని మన మీద మనకే నమ్మకం లేని రోజుల్లో ఒకటి కాదు.. ఒకేసారి ఏకంగా రెండు ఆస్కార్లు సాధించి అందరూ తల ఎత్తుకునేలా చేసిన మన భారతీయుడు. అందరిలో ఒక్కడిగా వచ్చి.. అందరికీ ఒక్కడే అన్నట్లుగా భారతదేశ ఖ్యాతిని నలుదిశలా ఎలుగెత్తి చాటిన మన రెహ్మాన్ పుట్టినరోజు ఈ రోజు.

రెహ్మాన్ పూర్తి పేరు అల్లా రఖా రెహ్మాన్. అసలు పేరు దిలీప్ కుమార్. చిన్నతనంలోనే తండ్రి దూరమవడంతో కుటుంబ బాధ్యత తనపై వేసుకున్నాడు. యాడ్స్ కి మ్యూజిక్ కంపోజ్ చేసి, ఆ డబ్బులతో తన కుటుంబాన్ని నడిపేవాడు. ఆ సమయంలో పెద్ద సంగీత దర్శకులైన ‘మాస్ట్రో ఇళయరాజా’, ‘రమేష్ నాయుడు’,’రాజ్-కోటి’ల ట్రూప్ లో చేరి తన సంగీత జీవితంలో తొలి అడుగులు వేశాడు. అదే సమయంలో దూరదర్శన్ ‘వండర్ బెలూన్’ కార్యక్రమంలో ఒకేసారి నాలుగు కీ బోర్డులు వాయించేంత టాలెంట్ ఉందని చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన ఆర్ధిక పరిస్థితి.. పైగా అన్నీ తానై చూసుకోవాల్సిన తండ్రి పక్కన లేకపోవడంతో రెహ్మాన్ కి పెద్ద చదువులు చదవడానికి అవకాశం లేకుండా పోయింది. స్కూల్లో పాఠాలు చదవలేకపోయిన రెహ్మాన్.. జీవిత పాఠాలు మాత్రం బాగా చదివాడు. ఒక్కో మెట్టు ఎదిగాడు.. తన సంగీతాన్ని ప్రపంచమంతా వినిపించాడు.. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.

రెహ్మాన్.. నటుడు మోహన్ లాల్ గారి ‘యోధ'(మళయాళం) సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. మణిరత్నం గారి ‘రోజా’ సినిమాకి మ్యూజిక్ అందించడం రెహ్మాన్ జీవితాన్నే మార్చేసింది. అప్పట్లో ఆ పాటలు సినీ సంగీతానికే ఒక కొత్త దారిని చూపించాయి. ఎం.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహదేవన్, ఇళయరాజా వంటి హేమాహేమీలకు ఏ మాత్రం తగ్గకుండా.. ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న మ్యూజిక్ కి ఓ కొత్త రకం హంగులు అద్ది అందరి దృష్టిలో పడ్డాడు. ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే జాతీయ అవార్డు సాధించి ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. ఇక ఆ తర్వాత రెహ్మాన్ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. తను ఏ ఆల్బమ్ చేసినా అది సూపర్ డూపర్ హిట్టే.. ఏ పాట అయినా ప్రేక్షకుల నోట్లో నానాల్సిందే.. మళ్ళీ మళ్ళీ వినాల్సిందే. ఎన్నో రాష్ట్ర, జాతీయ, ఫిలిం ఫేర్ అవార్డులతో మొదలైన రెహ్మాన్ ప్రస్థానం అంతర్జాతీయ స్థాయికి సైతం చేరింది. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాకి మ్యూజిక్ చేసిన రెహ్మాన్ ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులు సాధించి భారతదేశం గర్వించేలా చేశాడు. ఆరు సార్లు జాతీయ అవార్డు(4 తమిళం, 2 హిందీ), ఫిలిం ఫేర్, గోల్డెన్ గ్లోబ్, గ్రామీ, బాఫ్టా.. ఇలాంటి మరెన్నో అవార్డులు అందుకున్నాడు.

AR Rehamanరెహ్మాన్ అధ్బుత ప్రయాణం…

1. రెహ్మాన్ స్కూల్ చదువు పూర్తి చేయలేదు. అటెండెన్స్ తక్కువగా ఉందని స్కూల్ నుండి పంపించేయడంతో 15 ఏళ్ళకే చదువు ఆపేశాడు.

2. రెహ్మాన్ మొదటి సంపాదన 50 రూపాయలు.

3. 2005లో టైం మ్యాగజైన్ ఎంపిక చేసిన 10 బెస్ట్ సాంగ్స్ లో రెహ్మాన్ ‘రోజా’ సినిమాలోని పాట కూడా చేరింది.

4. కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలో ఒక వీధికి రెహ్మాన్ పేరు పెట్టారు.

5. ఒకేసారి రెండు ఆస్కార్లు సాధించిన తొలి ఆసియన్ మన రెహ్మాన్.

6. భారతరత్న లతా మంగేష్కర్ గారి 69 ఏళ్ళ వయసులో ‘దిల్ సే’ సినిమా కోసం ఆమెతో ‘జియా జలే..’ పాటని పాడించి ఆ వయసులో కూడా అది సాధ్యమే అని నిరూపించి మెస్మరైజ్ చేశాడు.

7. ప్రముఖ గాయని ఎస్.జానకి గారు ‘సఖి’ సినిమాలో ‘సెప్టెంబర్ మాసం..’ అంటూ 62 ఏళ్ళ వయసులో హస్కీగా పాడారు అంటే అది రెహ్మాన్ కి తప్ప వేరే వాళ్ళకి సాధ్యమా..?

8. రెహ్మాన్ సంగీతంలో ఎక్కువ పాటలు పాడిన ఫిమేల్ సింగర్ కె.ఎస్.చిత్ర గారు.

9. ప్రపంచంలోనే ఎక్కువ మంది డౌన్ లోడ్ చేసిన ఎయిర్ టెల్ ట్యూన్ రెహ్మాన్ కంపోజ్ చేసిందే.

10. రెహ్మాన్ రాత్రి పూట మాత్రమే మ్యూజిక్ కంపోజ్ చేస్తారు.

భారతరత్న లతాజీ తో…

Rehmanగాన సరస్వతి సుశీలమ్మతో…

Rehmanఅమితాబ్, కమల్, శంకర్ తో…

Rehmanమ్యాస్ట్రో ఇళయరాజాతో…

Rehmanపద్మ విభూషణ్ ఏసుదాసుతో…

Rehmanగాన గంధర్వుడు ఎస్పీబీతో…

Rehmanపద్మశ్రీ కె.ఎస్.చిత్రతో…

Rehmanరెహ్మాన్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ లో కొన్ని మీ కోసం…

1. చిన్ని చిన్ని ఆశ… (రోజా)

2. కొంటె దాన్ని కట్టుకో… (జెంటిల్ మెన్)

3. అంజలి అంజలి… (డ్యూయెట్)

4. ముక్కాల ముకాబులా… (ప్రేమికుడు)

5. కన్నానులే… (బొంబాయి)

6. నను నేనే మరిచినా… (ప్రేమ దేశం)

7. పచ్చని చిలుకలు తోడుంటే… (భారతీయుడు)

8. నెల్లూరి నెరజాణ… (ఒకే ఒక్కడు)

9. వెన్నెలవే వెన్నెలవే… (మెరుపు కలలు)

10. కన్నులతో చూసేది… (జీన్స్)

11. మెరిసేటి పువ్వా… (నరసింహ)

12. పచ్చందనమే… (సఖి)

13. సంకురాత్రి కోడి… (యువ)

14. వస్తా నీ వెనక… (నాని)

https://www.youtube.com/watch?v=mmFM74dUgbU

15. నమ్మకమీయరా స్వామీ… ( కొమరం పులి)

16. ప్రేమించే ప్రేమవా… (నువ్వు నేను ప్రేమ)

17. ఈ హృదయం… (ఏ మాయ చేసావే)

18. ఓ మర మనిషి… (రోబో)

https://www.youtube.com/watch?v=pqvrouKPx2w

19. నువ్వుంటే నా జతగా… (ఐ.. మనోహరుడు)

20. మన మన మెంటల్ మదిలో… (ఓకే బంగారం)

ఇలాంటి ఎన్నెన్నో మనం ఇష్టంగా పాడుకునే.. ఎంతెంతో గొప్పగా చెప్పుకునే మంచి పాటలు అందించారు రెహ్మాన్. క్లాసిక్ అయినా.. వెస్ట్రన్ అయినా.. మెలోడీ అయినా.. పాప్ అయినా… రెహ్మాన్ ఒక్కరే.. ఆయన చేస్తేనే ఆ పాటకి అందం. స్లో పాయిజన్ లాగా మన మైండ్ కి, మన మనసుకి ఆ పాటలు అలా ఎక్కేస్తాయి అంతే.. ఎన్నో సార్లు విన్నాం.. మరెన్నో సార్లు వింటున్నాం.. వింటుంటాం కూడా.. ఆ మ్యూజిక్ మాంత్రికుడు ఇలాంటి మరిన్ని పాటలు మనకు అందించాలని, మనని అలరించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టూ యూ రెహ్మాన్ సర్… వి ప్రౌడ్ ఆఫ్ యూ.. జయహో..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR