బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బల్కంపేట ప్రాంతంలో ఉంది. సుమారు 700 సంవత్సరాల పూర్వమే ఈ దేవాలయం ఉన్నట్టు తెలుస్తుంది. బావిలో ఉన్న స్వయంభు అమ్మవారు నీటి మధ్యలో ఉండేవారట. భక్తులు దూరం నుండే దర్శించే వారు. శ్రీ రాజ శివ రాజ్ బహదూర్ పరిపాలన కాలంలో ఈ ఆలయం నిర్మించారట. అమ్మవారితో పాటు దక్షిణభాగంలో పోచమ్మ తల్లిని క్షేత్ర పాలకురాలిగా ప్రతిష్టించారు. ఈ ఆలయ ప్రాంగణంలో గల నాగ దేవత ఆలయం పక్కన ప్రస్తుతం భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు. ఈ అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మంగళవారం. ఆ రోజున భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తమ ఆచార సాంప్రదాయాల ప్రకారం బోనాలు సమర్పించుకుంటారు.
తమ కోరికలు నెరవేరిన తరువాత తమ కుటుంబ సభ్యులు బంధు మిత్రులతో అమ్మవారిని దర్శిస్తారు. ప్రతి ఆషాడ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవార్ల కళ్యాణం… చివరి ఆదివారం నాడు బోనాలు జరుగుతాయి. ఆషాడ మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవం సందర్భంగా మూడురోజుల పాటూ జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచీ దేవతలు దిగొస్తారని ప్రతీతి. దాదాపు ఐదు లక్షలమంది జనం హాజరవుతారు.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతాయి. అమ్మవారి కళ్యాణం రథోత్సవం బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. హైదరాబాద్ నగరం ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామం ఉండేది. రైతు తన పొలంలో భావి తవ్వుతుండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా కదలక పోవడంతో ఊర్లోకెళ్ళి జనాలను తీసుకొచ్చాడు. తలో చేయీ వేసినా కదలలేదు. ‘ఇక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభీష్టం కావచ్చు. దైవనిర్ణయాన్ని కాదనడానికి మనం ఎవరం?’ అని శివసత్తులు ఇచ్చిన సలహాతో, మూలవిరాట్టు బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడే పూజలు చేసేవారు.
అమ్మవారి స్వయంభూ మూర్తి శిరస్సు భాగం వెనక నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహా తీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో శుద్ధి చేసుకుంటే భూతప్రేత పిశాచ దుష్టశక్తులు పారిపోతాయని నమ్మకం. నీటిని కాస్తంత తీర్థం లా స్వీకరిస్తే చర్మ వ్యాధులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. సర్వ శుభాలను ప్రసాదించే చల్లని తల్లి కొలువైన ఆలయం ఏడు వందల ఏళ్ల చరిత్ర గలది. ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకున్నంత ఫలమని భక్తుల నమ్మకం. పేద ధనిక భేదం లేకుండా అందరిని చల్లగా చూస్తుంది ఎల్లమ్మ తల్లి.
తెలంగాణ గ్రామీణ జానపద సాంప్రదాయం ఉట్టిపడేలా బల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఉంటుంది. హైదరాబాదులో ఎస్ ఆర్ నగర్ లో ప్రధాన రహదారి పక్కనే ఉండి భక్తులను ఆకట్టుకుంటుంది ఈ ఆలయం. అమీర్పేట్ క్రాస్ రోడ్ హోటల్ గ్రీన్ పార్క్ మీదుగా వెళ్ళాలి. ఎలిఫెంట్ హౌస్ దాటుతూ బల్కంపేట రోడ్డు మీద నుంచి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం లో ఉన్న పోచమ్మ తల్లిని నవ వధూవరులు దర్శించుకోవడం ఆనవాయితీ. పేద ధనిక తేడా లేకుండా అక్కడ పెట్టిన భోజనాన్ని మహా ప్రసాదంగా స్వీకరిస్తారు.
ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ద్వారం వైపు గోపురం నిర్మితమై ఉంది గోపురంపై అమ్మవారి విగ్రహాలు దర్శనమిస్తాయి ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజస్థంభం ప్రతిష్ఠించబడి ఉంది. ఆలయం చుట్టూ ప్రాకార మండపం ఉంది ఈ మండపంలోని గోడలపై జగన్మాత వివిధ రూపాల్లో ఉన్న తైలవర్ణ చిత్రాలు కనువిందు చేస్తాయి. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు కొలువుదీరాడు. ఎల్లమ్మ తల్లి దర్శనం కోసం వచ్చే వాళ్ళు ముందుగా వినాయకుని దర్శించుకున్న లోపలికి వెళుతుంటారు. వాస్తవానికి అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా కొలువు తీరింది. అయితే తర్వాతి కాలంలో మూలవిరాట్ను ప్రతిష్టించారు.