మన హిందూ పురాణాల ప్రకారం కొందరు కొన్ని యుగాల నుండి ఇప్పటికి ఇంకా బ్రతికే ఉన్నారని చెబుతున్నారు. అయితే వీరు మృత్యుంజయులని వీరికి అసలు మరణం అనేది లేకుండా ఎప్పుడు చిరంజీవులుగానే ఉంటారని పురాణాలూ చెబుతున్నాయి. అయితే దేవుడి అంశగా పుట్టిన ఇతడు జన్మించి 43 లక్షల సంవత్సరాలు దాటినది మార్కండేయ పురాణం ప్రకారం ఆరు నెలలకి ఒకసారి ఒక్కో ప్రాంతంలో నివసిస్తుంటాడని చెబుతున్నారు. మరి దేవుడి అంశగా పుట్టిన ఆ స్వామి ఎవరు? మార్కండేయ పురాణం ఏమని చెబుతుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అత్రి మహర్షి, అనసూయ దంపతుల పుత్రుడు దత్తాత్రేయుడు. విష్ణు పురాణం, భాగవతం ప్రకారం దత్తాత్రేయుడు శ్రీమన్నారాయణుడి ఆరో అవతారమని చెబుతారు. ఇక పురాణానికి వస్తే, అనసూయాదేవి పరమ సాద్వి, ఆదర్శ ప్రతివ్రత. ఆమెని పరీక్షించేందుకు వచ్చిన త్రిమూర్తులు ఆమెను దిగంబరంగా ఉండి తమకు బిక్ష ఇవ్వమని అడుగగా అందుకు అంగీకరించి, ఆమె ప్రతివత్య మహిమతో వారిని పసిపాపలుగా మర్చి వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేసింది. ఇంతలో విషయం తెలుసుకున్న త్రిమూర్తుల భార్యలు ముగ్గురు వచ్చి, అనసూయని ప్రార్ధించి తమ తమ భర్తలను పొందారు. అప్పుడు అత్రి, అనసూయ కోరికను మన్నించి త్రిమూర్తులు ముగ్గురు కలసి ఏకరూపంగా మూడు శిరస్సులతో పుత్రీనిగా అనసూయ, అత్రి దంపతులకు దత్తాత్రేయుడు జన్మించాడు.
దేవుడి అవతారంగా భావించే దత్తాత్రేయ స్వామివారు భూమిపైనా జన్మించి ఇప్పటికి చిరంజీవిగా ఉన్నాడని పురాణాలూ చెబుతున్నాయి. ఇక మార్కండేయ పురాణం ప్రకారం, సంవత్సరంలో ఆరు నెలలు సహాద్రి పర్వతాలపైనా, ఆరు నెలలు కేదార క్షేత్రంలోని దత్తాత్రేయ గుహలో నివసించి ఉంటాడని చెబుతారు. అయితే 43 లక్షల 19 వేల 5 వందల సంవత్సరాల పూర్వం జన్మించిన ఈ స్వామి వారు, కృతయుగం ప్రారంభమైన ఐదు వందల సంవత్సరాల తరువాత యోగిగా ఇప్పటికి భూమిపైనే సంచరిస్తుంటాడని నమ్మకం. శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతీ, అక్కల్ కోట్ మహారాజ్, సాయిబాబా వీరందరూ కూడా దత్తాత్రేయ స్వామి వారి అంశలుగా కొందరు భావిస్తుంటారు.
మార్గశిర పౌర్ణమి నాడు దత్తుడు ఉదయించాడు. దానినే దత్త జయంతి అని అంటారు. ఈ స్వామివారి రూపం అపురూపంగా ఉంటుంది. మూడు ముఖాలు, ఆరు చేతులతో, చేతిలో డమరుకం, త్రిశూలం వంటి ఆయుధాలను ధరించి దర్శనమిస్తుంటాడు. ఆ స్వామి చుట్టూ ఉండే శునకాలు వేదానికి ప్రతీకలు, గోవు ఏమో ఉపనిషత్తుల సారాంశం. ఈ స్వామివారిని ఆరోగ్య ప్రదాతగా కూడా పూజిస్తుంటారు. కోరిన కోరికలను నెరవేర్చే స్వామి, గురువు లందరికి గురువు అయినా దత్తాత్రేయ స్వామి వారిని నమ్మిన వారికీ ఎపుడు అండగా ఉంటాడని విశ్వాసం.