వేదకాలం నుండి సర్వదేవతారాధనలో అగ్నికి అత్యంత ప్రాముఖ్యం ఏర్పడింది. అనాది కాలం నుండి మానవ జీవితంలో కూడా అగ్ని ప్రముఖ స్థానం ఆక్రమించింది. వైదిక ఋషులు అగ్నిని భగవంతుడుగా పూజించారు. ఈ అగ్ని దేవుడు అష్టదిక్పాలకులలో ఒకడుగా గుర్తింప బడ్డాడు.
అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు. శంకరుని అవతారమే అగ్ని అని శ్రీ శివ పురాణంలో చెప్పబడింది. ఋగ్వేదం ప్రకారం అగ్నిదేవుడు పరమాత్మ నోటి నుండి ఉద్భవించాడు. మన పురాణాలలో ఈయన అంగీరసుని పుత్రునిగా చెప్తారు. అగ్నికి స్పర్శ, శబ్ద, రూప అనే త్రిగుణాలున్నాయి. అగ్ని- భూమి, ఆకాశం, అగ్ని, వాయువు, పాతాళము, జలము, సూర్య, ఔషధి, వనస్పతి, శరీరం ఇలా ఎక్కడయినా పరిభ్రమిస్తుంది.
అగ్ని దేవునికి 2 తలలు, తలపైన 2 +2 కొమ్ములు, 7 నాలుకలు, 7 చేతులు, 3 కాళ్ళు ఉంటాయి. ఈయనకి దక్షిణంలో భార్య స్వదా దేవి, ఎడమ వైపున స్వాహ దేవి ఉంటుంది. హోమాలు చేస్తూ లేదా పూజలు చేస్తూ మంత్రాలు చదివేటప్పుడు చివరి లో “స్వాహా ” అనడం జరుగుతుంది.
ఈ స్వాహా అన్న పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనిషి చేసే పూజలు ప్రార్ధనలు ,మంత్రాలు అన్ని అగ్ని దేవునికి చేరుతాయి ఇలా ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమం చేస్తున్నామో వారికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాల్లో స్వదాదేవి తన పాత్ర పోషిస్తుంది.