Home Unknown facts స్త్రీలు ఎక్కువగా ఇష్టపడే బంగారం మీద కలి ప్రభావం ఉంటుందా?

స్త్రీలు ఎక్కువగా ఇష్టపడే బంగారం మీద కలి ప్రభావం ఉంటుందా?

0

ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్య కరమైన విషంయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచుని ఉంటే, దాని ముందు ఆవు ఒకటి నిలబడి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. అందుకా ఆవు నేను ఏడుస్తున్నది నాగురించి కాదు, ఆ కలి ప్రభావముచేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమలకు బాధ కలుగుతుంది కదా అని బాధ పడుతున్నాను అంటుంది.

kali purushuduఒక్క కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదూ? దానిని చూసి ఆవు బాధపడటమేమిటి? అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవూ, ఎద్దులు కాదు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మ దేవత. శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తరువాత కలియుగం ప్రారంభ సమయంలో కలి ప్రవేశించినపుడు ఆ కలి పురుషుని ప్రభావం వలన ధర్మము యొక్క సత్యము, శౌచము, తపస్సు, దయ అను నాలుగు పాదములలో 3 నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది. నశించిపోయిన 3 పదాలు: శౌచము, తపస్సు, దయ. మిగిలింది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. చెడు సావాసం వలన శౌచము, సమ్మోహము వలన తపస్సు, అహం కారము వలన దయ నశించిపోయాయి.

ఇలా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండము చేతిలో ఉన్నవాడు, రాజు ఆకారంలో ఉన్న వాడు, ఖఠినాత్ముడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు క్రింద పడి పోయింది. ఒంటి కాలు మీద నిలబడిన ఎద్దుని కూడా తన్నాడు. అది కూడా క్రింద పడింది. క్రింద పడిన వాటిని తన చేతిలోని దండముతో విపరీతముగా కొట్టడం మొదలుపెట్టాడు. వాటికీ కళ్ళనుండి నీళ్లు వస్తున్నాయి. దూరమునుండి చుసిన పరీక్షిత్తు వాటి దగ్గరికి ఆ గోవును భూమాతగాను, వృషభమును ధర్మముగాను గుర్తుపట్టి అమ్మా మీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణము ఎవరు? మీకు మూడు కాళ్లు లేక పోవడానికి కారణము ఎవరు ? ఎంతటి వారైన సరే నేను వారి చేతులను నరికేసి మిమ్మల్ని కాపాడతాను చెప్పండి అని అన్నాడు.

అందుకా గోమాత కొందరు కాలమన్నారు,కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్షణమన్నారు. ఏవేవో కారణాలు చెప్పారు, ఏది ఏమైనప్పటికినీ ధర్మం పదాలు తెగిపోయాయి అన్నది. పరీక్షిత్తు గోవును బాధపెట్టిన వాటి గురించి వెతుకు తుండగా, ఒకడు వచ్చి గభాలున పరీక్షిత్తు పాదాలమీద పడి అయ్యా రక్షించండి నేనే నరికేశాను ఆపాదాలు అన్నాడు. నన్ను కలి పురుషుడంటారు. నేను రావటం వల్లనే ధర్మానికి 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ ఇంకా సరిగా నా ప్రభావాన్ని చూపకముందే, నన్ను ఆపుతున్నావు. నేను ఎక్కడికెళితే అక్కడ నువ్వు ధనుర్బాణాలు పట్టుకుని నిల్చుంటున్నావు. ఇలా కాదు నాకో అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు. నేనక్కడ ఉంటాను. అంతే కానీ నే వెళ్లినచోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం. నేను ప్రవేశించి తీరాలి. కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు. అని వేడుకున్నాడు.

అప్పుడు పరీక్షిత్ నీకు 4 స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు.

1 : జూదశాల యందు నీవు ఉండ వచ్చు.

2 : పాన ( మద్య ) శాలయందు నీవు ఉండవచ్చు.

3 : స్వేఛ్చాగా తిరుగుతూ ధర్మానికి కట్టుబడని ఆచార భ్రష్టులైన స్త్రీల యందు నీవు ఉండవచ్చు.

4 : జీవ హింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు. అని చెప్పాడు.

అది విని కలిపురుషుడు అయ్యా మీరు నాలుగుస్థానాలిచ్చారు. కానీ అక్కడ నేను నిలబడడానికి వీలు లేదు. ( పరీక్షిత్తు పరిపాలనలో ప్రజలెవ్వరూ వాటి జోలికి వెళ్లరు కనుక ) నాకు ఇంకొక్క స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు. అందుకు పరీక్షిత్తు

5 : బంగారం ఇచ్చాను అన్నాడు. అది విని చాలు మహాప్రభో చాలు అని నమస్కరించి వెళ్లి పోయాడు కలిపురుషుడు.

పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారమే. అలా కలి పరీక్షిత్తు లోపల ప్రవేశించాడు. పరీక్షిత్తు ఆ ప్రభావంతో వేటకి ( అహింస కు ) వెళ్లి, అక్కడ తపస్సులో నిమగ్నుడైన శమీక మహాముని పై చచ్చిన పామును వేస్తాడు. అది తెలిసి శమీక మహర్షి కుమారుడు శృంగి కోపంతో ఏడురోజులలో తక్షకుని చేతిలో చనిపోతావని పరీక్షిత్తును శపిస్తాడు. రాజ్యానికి తిరిగి వచ్చినతరువాత తన తప్పు తెలుసుకున్న పరీక్షిత్తు పశ్చాత్తాపంతో ఉంటాడు. అప్పుడు శుకుడు వచ్చి భాగవతమును ఏడురోజులలో వినిపిస్తాడు. కాబట్టి పై 5 విషయాలలో కలి పురుషుని ప్రభావం ఉంటుంది. వీనిలో దేనికి లోనైన మనం నైతికంగా పతనమవుతాము.

 

Exit mobile version