శివపార్వతులు కొలువై ఉన్న కిన్నెర కైలాసం రహస్యాలు

భారత దేశ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో హిమాలయాలకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.. మన దేశానికి సంబంధించి భక్తి ఉద్యమం అంతా కూడా హిమాలయాలనుంచే ప్రారంభం అవుతుంది.. అక్కడే ముగుస్తుంది కూడా.. హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించిన ప్రాంతం అంతా దేవతల భూమిగా, దేవ లోకంగా భారతీయులు గట్టిగా నమ్ముతారు. అక్కడి వాతావరణం కూడా అదే విధంగా ఆధ్యాత్మిక వాసనలను వెదజల్లుతుంటుంది.

కిన్నెర కైలాసంహిమాలయ పర్వతాలలో కైలాసం ఉంది. సముద్ర మట్టానికి 22778 అడుగుల ఎత్తులో ఉంది. టిబెట్ భూభాగంపై కైలాస పర్వతం ఉంది. ఈ కైలాసంపైనే శివపార్వతులు కొలువై ఉన్నారు అనేది భక్తుల నమ్మకం. శివుడ్ని సాక్షాత్కరింప చేసుకునేందుకు లంకేశ్వరుడైన రావణుడు తన పది తలలతో ఎత్తిన కైలాస పర్వతం ఇదే అని భక్తుల విశ్వాసం. అయితే మహా దేవుడికి మరో కైలాసం ఉందట. దేవభూమిలో దివ్యధామం.. లింగరూపుడై దర్శనమిస్తున్న పరమేశ్వరుడు.. త్రివర్ణాలలో త్రినేత్రుడి మహాదర్శనం.. అపురూపం.. అపూర్వం.. భూమి ఆకాశాలను కలుపుతున్నట్లుగా ఉమాశంకరుడు స్వయంభువుగా అవతరించి భక్తుల మనోరథాలు నెరవేరుస్తున్నారు. మన భూమిపైన.. మనకు అందుబాటులో సాక్షాత్కరిస్తున్నాడు. ఇది వింత కాదు.. విడ్డూరం అంతకంటే కాదు.. పుక్కిటి పురాణం ఎంతమాత్రం కాదు. నిజం.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు రంగుల్లో ముక్కంటి తన భక్తుల ముచ్చట తీరుస్తున్న వాస్తవం.

కిన్నెర కైలాసంభూమిపై కైలాసాలు ఎన్ని ఉన్నాయి. మహాదేవుడి నిజనివాసం ఎక్కడ.. టిబెట్‌లోని మానస సరోవరం పాదతీర్థంగా ఉన్న కైలాస పర్వతం కాకుండా, మరో కైలాసం ఉందా? అవును.. దేవదేవుడు హిమాలయ శ్రేణుల నిండా విస్తరించి ఉన్నాడు. హిమాలయాలకు అన్ని వైపులా కైలాస పర్వతాలు నెలకొని ఉన్నాయి.
ప్రతిచోటా పలు రూపాల్లో పరమేశ్వరుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మహాదేవుడు మూడు రంగుల్లో భక్తులకు దర్శనమిస్తున్న వైనం తొలిసారి టెలివిజన్‌ కెమెరాకు చిక్కింది. హిమాలయాల్లో శివుడు మరో కైలాసంలో దర్శనమిస్తున్నాడు. మూడు రంగుల్లో త్రినేత్రుడు తొంభై అడుగుల ఎత్తైన సహజసిద్ధ శివలింగంగా కనిపిస్తున్నాడు. ఒక రోజులో మూడు వర్ణాలు మారే శివలింగం. దేవభూమిలో మహాద్భుత దృశ్యం ఆవిష్కారమైంది. అత్యంత ఎత్తైన మంచు కొండల పైన, నిటారుగా, నిరాకారంగా వెలసిన మహాద్భుత అవతారం.. 217, 500 అడుగుల చుట్టు కొలత 18వేల అడుగుల ఎత్తున మహా శివలింగంరంగులు మారే మహాదేవుడు ఉదయం రజతం, మధ్యాహ్నం సువర్ణం, సాయంత్రం నీలమేఘం మూడు వర్ణాల్లో ముక్కంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో అపురూప సన్నివేశం.

కిన్నెర కైలాసంబోళా శంకరుడికి రెండో కైలాసం ఏమిటని ఆశ్చర్యపోకండి.. ఇది వాస్తవం.. ఆయన నిజంగానే బోళా శంకరుడు.. అందుకే భక్తులను ఇబ్బంది పెట్టకుండా సులభసాధ్యుడయ్యాడు. కోరుకున్న చోటనే దర్శనమిస్తున్నాడు.. అదే ఈ రెండో కైలాసం.. మౌంట్‌ కైలాస పర్వతం మాత్రమే కాదు. అది ఆయన నిజనివాసం కావచ్చు. కానీ, శివుడికి రెండో కైలాసం హిమాచలంలోనే ఉంది. భక్తులను పలు వర్ణాల్లో అలరిస్తోంది. వారికి అందుబాటులో ఉంది. కొంచెం కష్టపడితే లయకారుడి దివ్యదర్శనం లభ్యమవుతుంది “కిన్నెర కైలాసం”. పరమేశ్వరుడి నిజకైలాసాన్ని మరిపించే కైలాసం ఇది. చూస్తున్న కొద్దీ చూడాలనిపించే కైలాసం… అణువణువునా ఆధ్యాత్మికత నిలువునా కమ్మేసే అపురూప ప్రదేశం… అక్కడ శివలింగం రంగులు మారటం విశేషం.. ఒకే ప్రాంతంలో.. ఒకే చోట.. నిశ్చలంగా ఉన్న శివలింగం ఏ విధంగా రంగులు మారుతుంది ఇదెలా సాధ్యపడుతోంది? శివలింగం రంగులు మారటం ఏమిటి? శివుడి మహత్యమా? మాయా? నిజంగా ఈశ్వరుడి లీలలు అక్కడ కనిపిస్తున్నాయా? దీని వెనుక సైంటిఫిక్‌ రీజన్‌ మరేదైనా ఉందా? ఇందులో రహస్యం దాగుందా?

కిన్నెర కైలాసంటిబెట్‌కు తూర్పున హిమాచల్‌ ప్రదేశ్‌ దాకా కొనసాగే హిమాలయ శ్రేణి అంతా దేవ భూమి.. ఒక అద్భుతమైన వాతావరణం.. మౌనంగా ఉన్నా, గాలిలో ఈశ్వరుడి పేరు ప్రతిధ్వనించే ప్రాంతం. హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లాకు సరిగ్గా 235 కిలోమీటర్ల దూరంలో కిన్నౌర్‌ జిల్లా ఉంది.. కిన్నౌర్‌ జిల్లా హిమాలయ పర్వత సానువుల్లో.. నిజంగా అందాల కోన.. మూడు హిమాలయ పర్వతాలు పక్కపక్కనే పేర్చినట్లు ఉంటాయి. జన్‌స్కర్‌, గ్రేటర్‌ హిమాలయ, దౌలంధర్‌ శ్రేణులు సట్లెజ్‌, స్పిటి, బాస్పా వంటి జీవనదులకు పుట్టినిల్లు. వీటి మధ్యలోనే అన్నింటికంటే అత్యంత ఎత్తుగా కిన్నెర కైలాస్‌ పర్వతం కొలువుదీరి ఉంది. సట్లెజ్‌ నదీతీరంలో అందమైన జలపాతాల నడుమ 18వేల అడుగుల ఎత్తులో ఈ పర్వతాన్ని చూడటానికి వేయి కన్నులున్నా సరిపోవు.. ఈ కొండపైనే సహజసిద్ధమైన శివలింగం ఆవిర్భవించి ఉంది. యోగులకు, సిద్ధులకు మాత్రమే కాదు.. సామాన్యులకు కూడా సాక్షాత్కరించే అతి గొప్ప శివలింగం. తొంభై అడుగుల ఎత్తైన శివలింగం.. ఇది అలాంటిఇలాంటి శివలింగం కాదు. మనం సాధారణంగా చూసే మాదిరిలో దీని ఆకారం ఉండదు. కిన్నెర కైలాసం పీక్‌ స్టేజ్‌లో నిటారుగా నిలుచుని ఉన్న రాతినే శివలింగంగా భక్తులు భావిస్తారు.

కిన్నెర కైలాసంకేవలం రాయిని శివలింగంగా ఎందుకు భావించారు.? అదే ఇక్కడి ప్రత్యేకత. ఇది కేవలం రాయి కాదు.. ఇందులో జీవశక్తి ఉందని ఇక్కడ ఉపాసించే సిద్ధుల దృఢమైన అభిప్రాయం. ఎందుకంటే ఈ శివలింగం రోజులో మూడు కాలాల్లో మూడు రంగుల్లో కనిపిస్తుంది. నిర్దిష్ట సమయానికి శివలింగం రంగు మారుతుంది.
అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఈ శివలింగం ఉదయం భానుడి లేలేత కిరణాల స్పర్శతో మిలమిలా మెరిసిపోతుంది. వెండి రాశి పోతపోసుకున్నట్లుగా తెల్లగా ఈ శివలింగం దర్శనమిస్తుంది. మధ్యాహ్నానికి సూర్యుడు నడినెత్తిమీదకు వచ్చేసరికి పసిడి వన్నెలోకి మారిపోతుంది. ఇదే మహాలింగం సాయంత్రం అయ్యేవేళకు నీలిరంగులో ధగధగలాడుతుంది. ప్రపంచంలో అతి గొప్ప పరిణామ క్రమం ఇది. శివలింగం ఉన్న ప్రాంతంలో మాత్రమే ఈ రంగులు మారుతున్నాయి. ముక్కంటి మాత్రమే ఈ విధంగా దర్శనమిస్తున్నాడు. ఇది ఆయన లీలా విలాసమేనా? మరేదైనా మర్మముందా?

కిన్నెర కైలాసంప్రపంచంలో కిన్నెర కైలాసంలో మాత్రమే ఈ అద్భుతమైన సన్నివేశం కనిపిస్తుంది. అదీ ఈ శివలింగం నెలకొని ఉన్న ప్రాంతంలో మాత్రమే ఇలా రంగులు మారుతాయి. ఈ పరిణామం దేనికి సంకేతం? శివలింగం మాత్రమే కాదు. కిన్నెర కైలాస పర్వతానిదే ఒక ప్రత్యేకత. మౌంట్‌ కిన్నెర కైలాసంలో సహజసిద్ధంగా ఏర్పడిన శివలింగం మూడు వర్ణాల్లో కనిపించేందుకు ఇక్కడ ఉపాసకులు ఆసక్తికరమైన కథనాలను వినిపిస్తారు. ఉదయం వెండి రంగులో శివలింగం కనిపిస్తుంది. సూర్యుని కిరణాలు శివుడి తలపె ఉన్న జాబిల్లిని తాకుతాయి. జాబిల్లి నుంచి వెలువడే వెన్నెలే ఈ తెలుపు రంగుకు కారణం. ఈ వెన్నెలకు భూతనాథుడి ఒంటిపై ఉండే విభూతి తోడై అద్భుతంగా విరాజిల్లుతుందని శివభక్తులు చెప్తారు.. మధ్యాహ్నానికి కిన్నెర శివలింగం పసిడి వన్నెలోకి మారిపోతుంది. శివుడు ధరించిన పులిచర్మం, పట్టపగలు తనపై నేరుగా పడే సూర్యుడి కిరణాలకు బంగారు రంగులో మెరిసిపోతుందిట. ఈ రంగు చుట్టూ ఉన్న మేఘాలపై ప్రసరించి మరింత అద్భుత దృశ్యం ఆవిష్కారమవుతుంది. సాయంకాలానికి ఈశ్వరుడి లయవిన్యాసం విశ్వరూపం దాలుస్తుంది.ఆయన కంఠంలో ఉన్న గరళం ఒక్కసారిగా చైతన్యవంతం అవుతుంది. గరళం నుంచి వెలువడే సెగలు ఒక్కసారిగా శివలింగాన్ని నీలివర్ణంలోకి మార్చేస్తాయి. ఇదొక అద్భుత సన్నివేశం.

కిన్నెర కైలాసంఅపురూప ప్రకృతి స్వరూపం. పురాణాలు చెప్పే కథనాలు ఆధ్యాత్మిక భావనను వెల్లడి చేస్తున్నాయి. ఈ కథలు, కథనాలు సైన్స్ కు అంతుపట్టవు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రకృతిలో, సూర్యుడి ప్రస్థానంలో, వాతావరణంలో, హిమాలయ శ్రేణుల్లో సాగే మేఘాలు ఈ శివలింగాన్ని తాకుతూ వెళ్తాయి. అందువల్లే ఇక్కడ ప్రకృతిలో రంగుల మార్పులు జరుగుతాయని సైంటిస్టులు ఒకరకమైన అంచనా వేస్తుంటారు. సైంటిస్టులు చెప్పిన మాటలో లాజిక్‌ లేకపోలేదు. కానీ, ఇక్కడే అసలు ప్రశ్న ఎలాంటి జవాబుకూ చిక్కడం లేదు. ఎందుకంటే నిజంగా ప్రకృతిలో, వాతావరణంలో మార్పుల వల్ల ఇలాంటివి ఏవైనా జరుగుతుంటే ఆ ప్రాంతం అంతటా అదే విధంగా రంగులు మారుతూ ఉండాలి. కానీ, ఒక్క శివలింగం ఉన్న పరిసర ప్రాంతంలోనే ఇలా జరుగుతోంది. కిన్నెర కైలాస పర్వత శ్రేణిలోనే ఈ వర్ణాల మార్పు జరుగుతోంది. దీనికి మాత్రం ఇప్పటివరకు ఎవరూ జవాబు చెప్పలేకపోతున్నారు.

కిన్నెర కైలాసంసముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తున జరుగుతున్న అద్భుతం ఇది. సైన్స్ కు ఎంతమాత్రం అందని, అంతుపట్టని ప్రకృతి విన్యాసం ఇది. కేవలం శివలింగం మాత్రమే కాదు. మొత్తం కిన్నెర కైలాస్‌ పర్వతం అంతా శివుడి ఉనికిని, అస్తిత్వాన్ని, ఆయన తేజస్సును విరజిమ్ముతుంది. అక్కడికి వెళ్లే భక్తులందరికీ ఇదే అనుభూతి కలుగుతుంది. హేతువాదులకు సైతం ఆధ్యాత్మిక భావనను కల్పించే వాతావరణం అక్కడిది. కైలాసాలు ఒకటి కంటే ఎక్కువ ఉండటం ఏమిటి? ఎలా ఏర్పడ్డాయి ఇవి..? వీటికి స్థానిక కథనాలు చాలానే ఉన్నాయి. రుద్రుడు హిమాలయాలను సృష్టించినప్పుడు ఆయన తన గణాలకోసం ప్రత్యేక స్థానాలను ఏర్పాటు చేసాడు. అందులో కిన్నెరుల కోసం ఏర్పాటు చేసిన ఆవాస స్థలమే కిన్నెర కైలాసం.. ఇక్కడ కిన్నెరులు తనను ఆరాధించటం కోసం స్వయంభువుగా లింగరూపుడై అవతరించాడని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం..శివుడి నిజనివాసం టిబెట్‌లోని కైలాస పర్వతం. దీని చుట్టూ బయటి నుంచి ప్రదిక్షణ చేయటమే గొప్ప సాహసం. కిన్నెర కైలాసం అలాంటిది కాదు. ఇక్కడికి శివలింగం వరకు వెళ్లి స్పృశించి వచ్చే అవకాశం ఉంది. కాకపోతే కిన్నెర కైలాసం ఒక్కోసారి మౌంట్‌ కైలాస్‌నే తలపిస్తుంది.

కిన్నెర కైలాసంకొన్ని వేళల్లో కిన్నెర కైలాసాన్ని చూస్తే, మౌంట్‌ కైలాస్‌కు, దీనికి అస్సలు తేడా కనిపించదు. కైలాస పర్వతం, కిన్నెరకు వచ్చేసిందా? అన్నంత కన్ఫ్యూజన్ క్రియేట్‌ చేస్తుంది. ఈ ప్రకృతి వింతను చూసి తీరాల్సిందే. శివుడికి కైలాసాలు కేవలం రెండే కాదు. మొత్తం అయిదు కైలాసాలు ఉన్నాయని చెబుతారు. వీటిలో మొదటిది మౌంట్‌ కైలాస్‌..ఇది టిబెట్‌లో ఉంది. రెండవది కిన్నెర కైలాస్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లాలో ఉన్న గొప్ప పర్వతం ఇది. ఇక మూడవది మౌంట్‌ ఆది కైలాస్‌ ఇది ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌ జిల్లాలో ఉంది. దీన్ని చోటా కైలాస్‌ అని కూడా పిలుస్తారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోనే రాంపూర్‌ జిల్లాలో శ్రీఖండ్‌ కైలాసం ఉంది. ఇది నాలుగో కైలాసం. ఇదే రాష్ర్టంలో చంబా జిల్లాలో మణి మహేశ్‌ కైలాసం ఉంది. మొత్తం అయిదు కైలాసాల్లో శివుడు ఆదిపురుషుడిగా, ఈశ్వరుడిగా నెలకొని ఉన్నాడు. కిన్నెర కైలాసం అందులో పీక్‌ లెవల్‌లో ఉంది. దేవుణ్ణి నమ్మినా, నమ్మకపోయినా ఒక్కసారి అక్కడికి వెళ్లి వస్తే మానసికంగా మనిషిలో కలిగే మార్పు మాత్రం తిరుగులేనిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR