Home Unknown facts శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంగా ఎందుకు వెలిశాడో తెలుసా ?

శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంగా ఎందుకు వెలిశాడో తెలుసా ?

0

జ్యోతిర్లింగం అంటే శివుడిని లింగ రూపంలో ఆరాధించే చోటు అని చెబుతారు. శివుడు తన ఆత్మ శక్తిని లింగరూపంలో నింపి మన దేశంలో 12 చోట్ల స్వయంభువుగా వెలిశాడని పురాణం. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటారు. ఇందులో 5 వ జ్యోతిర్లింగం అని చెప్పబడే ఈ ఆలయంలో శివుడు మూడు శిరస్సులతో 15 కన్నులతో దర్శనం ఇస్తుంటాడు. మరి అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shiva Dwadasa Jyotirlinga

మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న కొండలలో ఎదురుగా కనిపించే ఒక కొండని బ్రహ్మగిరి అని అంటారు. ఈ కొండమీదనే గోదావరి నది జన్మస్థలం అని చెబుతారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయంలో శివుడు త్రయంబకేశ్వరుడిగా పూజలను అందుకుంటున్నాడు. శివుడు మూడు కన్నులు కలిగిన వాడు కనుక ఇక్కడ ఆ పేరుతో భక్తుల పూజలను అందుకుంటున్నాడు.

పురాణానికి వస్తే, శివుడి కోసం గౌతముడు ఇక్కడ కఠోర తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై తన జటాజూటంలో ఉన్న గంగను గౌతముని మీదకు ప్రవహింపచేసి ఆయనను అభిషేకించాడు. అప్పుడు గౌతమునికి అంటుకున్న గోహత్య పాతకం తొలగిపోగా శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంగా వెలిశాడని పురాణం. అయితే ఇక్కడ ఉన్న బ్రహ్మగిరి అనే ప్రాంతంలో గౌతమ మహర్షి కారణంగా ఆవిర్బావించిన ఈ నదికి గోదావరి అనే పేరు వచ్చినది అని చెబుతారు. మాఘశుద్ది దశమి నాడు పవిత్ర గంగా ప్రవాహం ఈ గోదావరి నదిగా వెలసిన రోజు. అందుకే ఈ రోజున ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మగిరిలో స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

అతిప్రాచీన ఈ ఆలయంలో విశాలమైన ఒక కుండం ఉంది. అతి పవిత్రమైన ఈ నీటికుండం లోని నీటిని స్వామివారి అర్చనాబిషేకాలకు ఉపయోగిస్తుంటారు. గర్భాలయానికి ఎదురుగా రాతితో చేయబడిన ఒక పెద్ద నంది విగ్రహం ఉంది. ఎంతో సుందరంగా కనిపించే ఈ నంది విగ్రహం అలనాటి శిల్పుల కళానైపుణ్యానికి నిదర్శనం అని చెప్పవచ్చు.

ఈ ఆలయంలో ఆశ్చర్యం ఏంటంటే, శివలింగం చుట్టూ ఎప్పుడు గోదావరి నది నీరు పైకి ఉబికి వస్తుంటుంది. ఇంకా ఇక్కడ గర్భగుడిలో శివలింగ స్థానంలో ఒక చిన్న గుంటలాగా ఉంటుంది. దానిలో మనకి మూడు శివలింగాలు ఉంటాయి. అవి బ్రహ్మ, విష్ణు, శివుడు అని ప్రసిద్ధి. అందువలన ఈ స్వామిని త్రయంబకేశ్వరుడు అని పిలుస్తారు. ఇంకా ఈ స్వామివారిని ఐదు శిరస్సులు, 15 కన్నుల స్వామివారిగా ఆరాదించబడుతున్నాడు.

ఈ ఆలయంలో ప్రతి భక్తుడికి గర్భాలయ ప్రవేశం ఉంది. ఇంకా స్వామివారికి స్వయంగా అర్చనాభిషేకాలు చేసుకునే వీలుంది. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి మహాశివరాత్రి పండుగ సమయంలో దూరప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version