Home Unknown facts దేవతలు మృతసంజీవిని విద్యను ఎలా నేర్చుకున్నారో తెలుసా ?

దేవతలు మృతసంజీవిని విద్యను ఎలా నేర్చుకున్నారో తెలుసా ?

0

పురాణాలు, ఇతిహాసాలు విన్న వారికి రాక్షసుల గురించి, రాక్షసుల గురువు గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. శుక్రాచార్యుడు హిందూ పురాణాల్లో రాక్షసుల గురువు. వీరి త౦డ్రి గారు బ్రహ్మ దేవుడికి మానస పుత్రుడైన బ్రుగు మహర్షి మరియు తల్లి గారు ఖ్యాతి. అంగీరస మహర్షి దగ్గర వేద విద్యనభ్యసించడానికి వెళతాడు శుక్రుడు. అక్కడ ఆయన తన కుమారుడైన బృహస్పతి వైపు పక్షపాతం చూపిస్తున్నాడని కలత చెందుతాడు. తర్వాత గౌతమ మహర్షి దగ్గరకు వెళతాడు. శివుని కోసం తపస్సు చేసి సంజీవని మంత్రం సంపాదిస్తాడు. ప్రియవ్రతుని కుమార్తె యైన ఉర్జస్వాతిని పరిణయమాడి నలుగురు కుమారులు ఒక కుమార్తెను సంతానంగా పొందుతాడు. వారి పేర్లు చండ, అమార్కుడు, త్వాష్ట్ర, ధరాట్ర మరియు దేవయాని.

మృతసంజీవిని విద్యఇదే సమయంలో బృహస్పతి దేవతలకు గురువౌతాడు. ఒకసారి విష్ణువు ఒక రాక్షసుని వేటాడుతూ వచ్చి ఆశ్రయం ఇచ్చిన శుక్రుని తల్లిని చంపుతాడు. ఆ పగతో శుక్రాచార్యుడు అసురులకు గురువుగా ఉండాలని నిర్ణయించుకుంటాడు. తనకు తెలిసిన సంజీవని మంత్రం ద్వారా మృతులైన అసురులను బతికిస్తూ రాక్షసులు దేవతలమీద విజయం సాధించేలా చేస్తాడు. అందుకని శుక్రుడి దగ్గర మృత సంజీవనీవిద్యను నేర్చుకొని రమ్మని దేవతలు బృహస్పతి కొడుకైన కచుడనే వాడిని పంపిస్తారు. తరువాత ఏమి జరిగిందో తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం క్షిరసాగరమధనం జరుగక ముందు ఇది జరిగింది అని చెబుతారు. అయితే దేవతలు, రాక్షసుల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. అందులో రాక్షసులు, దేవతలు చనిపోతుండగా రాక్షస గురువైన శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసులను తిరిగి మళ్ళి బ్రతికించేవాడు. కానీ దేవతలకు ఆ విద్య తెలియకపోవడంతో వారు చనిపోతూ ఉండేవారు.

ఇక అప్పుడు దేవతలు శుక్రాచార్యుడు దగ్గరికి వెళ్లి ఆ విద్యని తెలుసుకొని రాగల సమర్థుడు ఎవరు అని ఆలోచిస్తుండగా బృహస్పతి కుమారుడైన కచుని దగ్గరికి వెళ్లి ఎలా అయినా ఆ విద్యని పొందాలని ప్రార్ధించగా, అప్పుడు కచుడు శుక్రాచార్యుని దగ్గరికి వెళ్లి గురుదేవ అని సాష్టంగా నమస్కారం చేసి శిష్యుడు గా స్వీకరించమని వేడుకుంటాడు. నీవంటి అర్హుడుని శిష్యుడిగా స్వీకరించడం నాకు సంతోషంగా ఉందంటూ తన శిష్య బృందంలో చేర్చుకుంటాడు.

ఇలా ప్రియ శిష్యుడిగా ఉంటున్న కచుడ్ని చూసి శుక్రాచార్యుడు కుమార్తె దేవయాని అతనితో ప్రేమలో పడుతుంది. కచుడిని శుక్రాచార్యుడు అభిమానించడం చూసిఅసూయ చెందిన రాక్షసులు చాలాసార్లు అతనిని చంపడానికి ప్రయత్నిస్తారు. ప్రతి సారీ దేవయాని అతన్నికాపాడుతుంది.యిలా కాదని రాక్షసులు కచుడిని దగ్ధం చేసి ఆ బూడిదను సుర లో కలిపి శుక్రాచార్యుడి చేత త్రాగిస్తారు. దేవయాని కచుడిని, అతని జాడ చెప్పమని తండ్రిని బ్రతిమాలుతుంది. శుక్రాచార్యుడు యోగ దృష్టి తో అంతా గ్రహించి అతన్ని మృతసంజీవనీ విద్యతో బ్రతికించాడు. కానీ కచుడు శుక్రాచార్యుడి కడుపులోనే వుండిపోయాడు. అప్పుడు శుక్రాచార్యుడు దేవయాని చెప్పిన మేరకు కచుడికి మృతసంజీవనీ విద్య భోదిస్తాడు. తన కడుపు చీల్చుకొని బయటికి వచ్చి తరువాత మృతసంజీవనీ విద్య ప్రభావం తో తనను బ్రతికించమని శుక్రాచార్యుడు కచుడితో చెప్తాడు. కచుడు అలాగే బయటికి వచ్చి శుక్రాచార్యుడిని బ్రతికిస్తాడు. సురవల్ల ఈ అనర్థం జరిగింది, కచుడు మృతసంజీవనీ విద్య నేర్చుకున్నాడు. కాబట్టి రాక్షసులకు సురా పానాన్ని నిషేధిస్తాడు శుక్రాచార్యుడు.

తను వచ్చిన కార్యం ముగిసిందని తలచి కచుడు గురువు దగ్గర సెలవు తీసుకొని దేవలోకానికి బయలుదేరుతుండగా దేవయాని తన మనసులో మాట చెప్పి వివాహం చేసుకోమని ప్రార్ధించగా దానికి కచుడు గురువు కూతురు నీవు నాకు సోదరి లాంటిదానివి ఇది తగదు అని చెప్పి వెళ్లిపోతుంటే, ఆగ్రహించిన ఆమె నీవు గెలుచుకున్న విద్య నీకు ఉపయోగపడకుండా పోతుంది అని శపిస్తుంది. నేను నేర్చుకున్న విద్య నాకు ఉపయోగపడకుండా పోయిన పర్వాలేదు నేను నేర్పించినవారికి ఉపయోగపడుతుంది, ఇంతటి కఠినాత్మురాలైన నిన్ను బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోడు అంటూ తిరిగి శాపాన్ని పెడతాడు. ఇలా మృతసంజీవిని విద్య నేర్చుకున్న కచుడు తిరిగి స్వర్గానికి వచ్చి దేవతలకు ఆ విద్య నేర్పించాడని పురాణం. తరువాత కొంత కాలానికి దేవయానికి యయాతి తో వివాహం జరుగుతుంది.

Exit mobile version