శివుడికి చేసే అభిషేకాలలో రుద్రాభిషేకం చాలా ప్రత్యేకమైనది. రుద్రాభిషేకం చేసేటప్పుడు లింగం పై మారేడు దళాలు ఉంచి ఒక్కొక్క కలశంలోని నీళ్ళతో కలశపూజచేసి ప్రతి కలశములో శివపంచాక్షరితో అభిమంత్రించి ఆ విధంగా 108 కలశాలు మంత్ర పూరితం చేసి సిద్ధం చేసుకొని అప్పుడు రుద్రాభిషేకము ప్రారంభించాలి. అభిషేకం పూర్తి అయ్యేసరికి కలశాలలో అభిమంత్రించిన తీర్థం సరిగ్గా సరిపోయే విధంగా చేయాలి. అలా చేస్తేనే రుద్రాభిషేక ఫలితము పూర్తిగా కలుగుతుంది.
అలాగాక చాలామంది బిందెలలో చెరువునీటిని గాని, నూతినీటినిగాని తెచ్చి, అభిషేకంగా రుద్రమంత్రం చెపుతూ అభిషేకం చేస్తారు. దీనివల్ల ప్రయోజనం లేదు! ఈ విషయం చాలామంది పురోహితులకు, (వేదపండితులకు) సహితము తెలియదు.
చెరువునీటిని కాని, నూతినీటిని కాని, ఏ నీరైనా, సరే తెచ్చింది తెచ్చినట్లు అభిషేకం చేయకూడదు ఇది శాస్త్ర విరుద్ధం. ఎందుకంటే నీటిలో విషం ఉండే అవకాశం ఉంది. ఈ విషం అలాగే వుంచి అభిషేకం చేస్తే ఫలితం ఉండదు కాబట్టి కలశంలో నింపిన జలాన్ని ముందుగా ‘నిర్విషము’ చేయాలి.
అలా నిర్విషము చేయడానికి ‘తార్యముద్ర’ లేక గరుడ ముద్రను చేతితో పట్టి నీటిపై ఉంచి విషాహార మంత్రాలతో లేక మృత్యుంజయ బీజాక్షరములతో అభిమంత్రించి ఆ పైన ‘అమృత ముద్ర’ పట్టి అమృత బీజాక్షరమును ఉచ్చరించి, ఆ జలాన్ని అమృతీకరణం చేయాల్సి ఉంటుంది. అలా అమృతీకరణం చేయబడిన జలాన్నే శివాభిషేకం చేయడానికి ఉపయోగించాలి. ఇలా చేయకపోవడం వల్లే కొంతమందికి రుద్రాభిషేకం చేసిన ఫలితం దక్కడం లేదు.
ఈ విధంగా రుద్రాభిషేకం చేసేవారి చేయి అమృతీకరణం పొందుతుంది. ఆ వ్యక్తి ముట్టుకున్న ప్రతి వస్తువుకూ ‘అమృతత్వం’ కలుగుతుంది. రోగులు కూడా కోలుకుంటారు.