కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణసి నగరాన్ని స్థాపించాడు పౌరాణిక గాథల సారాంశం. ఇక్కడ విశ్వేశ్వరాలయం లో శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువైయున్నాడని హిందువుల నమ్మకం.
ఇక్కడ గంగా స్నానం వల్ల సకల పాపాలు పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు.
మహాభారత యుద్ధం గెలిచిన తర్వాత పాండవులు కూడా తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోడానికి కాశీ వచ్చారట. శతాబ్దాల నుంచి ఈనాటికీ మోక్షం కోసం అన్వేషిస్తూ లక్షలాది జనం ఇక్కడకు వస్తున్నారు. వారణాసిలో చనిపోయినా, గంగా తీరంలో దహన సంస్కారాలు చేసినా వారి జనన-మరణ చక్రం తెగిపోతుందని, మోక్షం లభిస్తుందని హిందూ గ్రంథాలు చెబుతున్నాయి.
ప్రళయకాలంలో కాశీ నగరం చెక్కుచెదరని చెబుతారు. వారణాసి ఆ లయకారకుడైన పరమేశ్వరుని ప్రతిష్టితం. అందుకే ఎలాంటి ప్రళయాలు ఆ నగరాన్ని నాశనం చేయలేవని శాస్త్రాలు చెబుతున్నాయి. యావత్ ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు. కల్పాంతం తరువాత ప్రళయం ఏర్పడుతుంది. యుగం అంతమై కొత్త యుగం ప్రారంభమవుతుంది. అయితే వారణాసిని మాత్రం ఆ లయకారుడైన శంభునాథుడు సృష్టించాడు. అందుకే ప్రళయకాలంలో వారణాసిని తన శూలంపై నిలబెడతాడని నమ్మకం.