యాత్రికులు ఈ ఆలయాన్ని దర్శించాలంటే కొన్ని వేల మెట్లని ఎక్కి తీరాల్సిందే. ఇక్కడ మొత్తం 21 శిఖరాలు ఉండగా అందులో అతి ముఖ్యమైనవి ఐదు శిఖరాలు. ఇక్కడ అన్నిటికన్నా ఎత్తైన ప్రదేశంలో ఉండేదే గిర్నార్ శిఖరం. ఇవి హిమాలయాల కంటే పురాతనమైనవిగా చెబుతారు. ప్రతి కార్తీక మాసంలో ఇక్కడ దాదాపుగా 38 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది. దట్టమైన అరణ్యంలో కొండ ప్రాంతంలో సంవత్సరంలో ఈ ఐదు రోజులు మాత్రమే ఈ యాత్రకి అనుమతి అనేది ఉంటుంది. మరి ఎన్నో అద్భుతాలకు నిలయం అయినా ఈ దేవతల కొండలు ఎక్కడ ఉన్నాయి. ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గుజరాత్ రాష్ట్రం, జునాఘడ్ జిల్లా లో కొంత దూరంలో దాదాపుగా 1424 చ.కి.మీ. వ్యాపించి ఉన్న వీటిని దేవతల కొండలు అని అంటారు. ఈ గిర్నార్ ప్రదేశం హిందువులకు మరియు జైనులకు చాలా పవిత్రమైనవిగా చెబుతారు. ఈ పర్వత శ్రేణి గిర్నార్ హిల్స్ గా ప్రసిద్ధి చెందింది. గిర్నార్ గురించి వేదాలలోను ఇది ఒక పవిత్ర ప్రదేశం అని పేర్కొనబడింది. మనకి తిరుపతి ఎంతటి పవిత్ర క్షేత్రమో, గుజరాతీయులకు గిరినర్ అంతటి పవిత్ర క్షేత్రం.
ఇక్కడ అనేక హిందూ మరియు జైన ఆలయాలు ఉన్నవి. ఇక్కడ ఉన్న ఐదు ముఖ్య శిఖరాలు వరుసగా, మొదటి శిఖరంలో అంబా మాత ఆలయం, రెండవ శిఖరం పేరు గోరుగోరకనాథ్ శిఖరం, మూడవ శిఖరం పేరు ఓఘాత్ శిఖరం, నాలుగవది దత్తాత్రేయ శిఖరం, ఐదవది కాళికా ఆలయ శిఖరం అని అంటారు.
కాల యవనుడు భస్మమైన ప్రదేశం ఇదేనని చెబుతారు. జైన తీర్థంకరులకు అతి పవిత్రమైన ప్రదేశాలలో గిర్నార్ ఒకటిగా చెబుతారు. ఇక్కడే జైన మతానికి సంబంధించిన తీర్థం కరులలో 22వవాడైన నేమినాథుని నిర్వాణ భూమి ఇదేనని చెబుతారు. ఈ శిఖరం పైన ఉన్న జైన ఆలయాలు దేశంలోనే అతి ప్రాచీన ఆలయాలుగా చెబుతారు. అంతేకాకుండా వివేకానందుడిని ఎక్కువగా ప్రభావితం చేసిన పావ్‌హరి బాబా ఇక్కడే నివసించారని చెబుతారు. ఇంకా ఈ ప్రదేశంలోనే వివేకానందుడు వాస్తవిక యోగ రహస్యాలు తెలుసుకున్నట్లుగా చెబుతారు.
ఇక మొదటి శిఖరం అని చెప్పే అంబా మాత ఆలయంలో శ్రీకృష్ణుడి తల కేశాలు తీసారని చెబుతారు. భవనాథ్ ఆలయం శివుడికి అంకితం చేయబడిన ప్రదేశం. ఇక్కడ నగ్న సాధువులు ప్రతి శివరాత్రికి ఈ ప్రదేశానికి వచ్చి శివుడికి హారతి ఇస్తారు. పూర్వం శివపార్వతుల వస్త్రాలు ఈ చోట పడ్డాయని అందుకే ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తారు.
ఇక మూడవ శిఖరం అయినా దత్తాత్రేయ ఆలయం ఒక అద్భుతం అనే చెప్పవచ్చు. ఈ కొండ శిఖరంపైన దత్త దేవుడి పాద ముద్రలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ త్రిమూర్తల అవతారమైన దత్తదేవుడు మనకి దర్శనం ఇస్తాడు.
ఇక నాలుగవ శిఖరం పైన కాళికాదేవి నాలుగు చేతులతో దర్శనం ఇస్తుంది. ఆ తరువాత శిఖరం పైన జైన తీర్థంకరులకు చెందిన రిషభదేవ్ ఆలయం ఉంటుంది.
ఈ గిర్నార్ లో ప్రతి సంవత్సరం శివరాత్రికి పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి దాదాపుగా పది లక్షలకు పైగా భక్తులు వస్తారు. అంతేకాకుండా ప్రతి కార్తీకమాసంలో ఇక్కడ 38 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుంది. ఈ యాత్ర దట్టమైన అడవుల్లో కొండ ప్రాంతాల్లో చేయాల్సి ఉంటుంది. అయితే అటవీశాఖ కేవలం ఈ మాసంలో ఐదు రోజులకు మాత్రమే అనుమతి ఇస్తారు. మిగతా రోజులలో ఇందులోకి ఎవరిని కూడా అనుమంతించారు. ఈ ఐదు రోజులలో కొన్ని లక్షల మంది ఈ యాత్రలో పాల్గొంటారు.
ఈవిధంగా ఎన్నో ఆలయాలు, కొండ శిఖరాలను దర్శించడం ఎప్పటికి మరచిపోలేని ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.