ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడే జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది?

0
2728

పార్వతీదేవి పైన కోపంతో శివుడు కైలాసాన్ని వదిలి ఈ ప్రాంతానికి రాగ తప్పు తెలుసుకొని పార్వతీదేవి శివుడిని వెతుక్కుంటూ వచ్చి స్వామిని ప్రార్ధించగా శివపార్వతులు ఆనందంగా గడిపి ఇక్కడే వెలిశారని పురాణం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడే ఈ శివలింగాన్ని దర్శిస్తే పుత్రశోకం ఉండదని చెబుతారు. మరి ఈ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటి? ఆలయ స్థలపురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Grishneshwar Jyotirlinga Temple

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా గ్రామం ఉంది. ఈ గ్రామానికి, గుహలు ఉన్నవైపుగాకా, రెండవ వైపున శ్రీ ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. ఈ ఘృష్ణేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా వెలుగొందుచున్నది. ఈ ఆలయం అందముగా, ఆకర్షణీయంగా చాలా విశాలమైన ప్రాంగణంలో ఉంది. దీని నిర్మాణ శైలి కూడా మిగతా ఆలయాల కన్నా భిన్నంగా ఉంటుంది.

Grishneshwar Jyotirlinga Temple

ఇక స్థల పురాణం విషయానికి వస్తే, ఒకనాడు పార్వతీపరమేశ్వరులు కైలాసంలో పాచికలాటా ఆడుకుంటూ ఉన్నారు. ఆ ఆటలో పార్వతీదేవి గెలిచింది. అప్పుడు ఆ దేవి, శివుడిని ఎగతాళి చేయగా నొచ్చుకున్న శివుడు కైలాసాన్ని వదిలిపెట్టి, పర్వతాలపైనా ఉన్న చల్లని ఈ అడవి ప్రదేశానికి వచ్చాడు. తన తప్పు తెలుసుకున్న పార్వతి పశ్చత్తాపడి, తాను కూడా ఇక్కడికే వచ్చి భర్తతో పాటు అక్కడే ఉండిపోయింది. ఆలా శివపార్వతులు సన్నిహితంగా ఈ వనంలో విహరిస్తూ ఉండేవారు. అందుకే స్వామివారిని ఇక్కడ ఘృష్ణేశ్వర అని పిలుస్తారు. ఘ్రుశ్న అంటే కౌగిలింత అని అర్ధం. అంతేకాకుండా శివ పార్వతులు ఆనందంగా గడిపిన ఈ ప్రదేశాన్ని కామ్యకావనం అని కూడా పిలుస్తారు.

Grishneshwar Jyotirlinga Temple

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఇండోర్ ను పాలించిన హోల్కర్ వంశంలోని రాణి అహల్యాబాయి గొప్ప శివభక్తురాలు. ఆమె జీర్ణమైన చాలా శివాలయాలను పునురుద్ధరించింది.. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం కూడా ఆమె చేత పునర్నిర్మించబడినదే.. ఈ ఆలయ శిఖర భాగము, బయట గోడలు, చదరంగం కాకుండా ఒక విధమైన కోణాలుగా ఉంది, ఒకరకమైన విచిత్ర ఆకర్షణ కలుగుతుంది. ఆలయ ముందుభాగంలో విశాలమైన సభా మంటపం ఉంది. ఈ మంటపంలో మొత్తం 24 స్థంబాలు చక్కని శిల్పసంపదతో నిండి ఉన్నాయి. గర్భాలయము చాలా విశాలంగా, సుమారు 15 అడుగుల పొడవు, వెడల్పుతో చదరంగా ఉంది. మధ్య గా, నేలమట్టానికే ఉన్న పానవట్టమూ, దాని మధ్యగా ఉన్న చిన్న శివలింగ విగ్రహము ఒక వింతైన ఆకర్షణతో ఉన్నాయి.

Grishneshwar Jyotirlinga Temple

ఇంకా ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ శివలింగం శ్రీమహావిష్ణువు ప్రతిష్టించాడట. ఈ శివలింగాన్ని దర్శించనవారికి పుత్రశోకం కలగదని ప్రతీతి. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.