Home Unknown facts విష్ణుమూర్తి మోహిని అవతారం వెనుక రహస్యాలు !

విష్ణుమూర్తి మోహిని అవతారం వెనుక రహస్యాలు !

0

విష్ణువు భక్తుల కోసం, లోక కళ్యాణం కోసం ఎన్నో అవతారాలు ఎత్తాడు.. విష్ణుమూర్తి యొక్క దశావతారాల గురించి అందరికి తెల్సిందే.. అయితే అన్ని అవతారాలలో ప్రత్యేకమైనది మోహినీ అవతారం.. దేవ దానవుల యుద్ధ సమయంలో మోహినీ రూపంలో వచ్చిన విష్ణువు అమృత భాండాన్ని దేవతలకు ఇచ్చిన కథనం అందరికి తెల్సిందే.. అయితే విష్ణువు ఈ సందర్భంలోనే కాకుండా, మరి కొన్ని సందర్భాలల్లోనూ మోహిని అవతరమెత్తినట్లుగా పురాణాలలో చెప్పబడింది.. మరి విష్ణువు ఎన్ని సారులు మోహిని అవతారమెత్తాడో తెల్సుకుందాం..

Vishnu Murthyశక్తి రూపం తీసుకోవడం విష్ణుమూర్తికి ఎంత ఇష్టమట. అందుకే పురాణాలలో విష్ణుమూర్తి యొక్క మోహినీ అవతారాలు పలు సందర్భాల్లో కనబడుతుంది. నారాయణ నారాయణి రెండు రూపాలలో కనబడుతున్న,  పరబ్రహ్మం ఒకరే అని గ్రహించాలి.. మొట్టమొదట మోహినీ అవతారం ప్రస్తావన క్షీరసాగర మధనం అనంతరం దైత్యగణ మోసాన్ని నివారించడానికి దేవతలకు న్యాయం చెయ్యడానికి స్వామి ఒకే సమయంలో అటు మందర పర్వతాన్ని మోస్తున్న కూర్మంగా, ఆ మధనఫలితాన్ని అనుగ్రహిస్తున్న ధన్వంతరిగా, దేవతలకు అమృతం పంచుతున్న మోహినిగా  నిలబడి రాక్షసులను మరులు గొలుపుతూ దేవతలకు ఆ ఫలాలను అందించారు.

ఈశ్వరుడు ఆ సాగరమధన సమయంలో వచ్చిన విషాన్ని తన గరళంలో దాచుకుని లోకాలను రక్షించిన తరువాత దేవతలందరూ స్వామి యొక్క మోహినీ అందచందాలను పొగిడితే తన బావగారి వైకుంఠంకు వెళ్లి తనకు ఆ అవతార దర్శనాన్ని ఇమ్మని అడుగగా శివుని కోసం మరల మొహిని అవతారం తీసుకుని పార్వతీదేవి మరొక రూపం ఆయనకు దర్శింపచేసారు.

ఒకానొక సమయంలో ఋషులు అహంకారంతో తాము ధర్మాన్ని అనుష్టిస్తున్న కారణంగా దేవతలకు హవిస్సులు అవసరం లేదు, తాము అరిషడ్వర్గాలను జయించాము కాబట్టి తామే స్వతంత్రులమని ప్రకటించుకుని అనుష్టానాలు మానేస్తే వారికి సత్యం బోధపరచడానికి శివుడు సుందరుని రూపంలో ఋషి పత్నుల ముందు, అదే సమయానికి విష్ణువు మోహినీ అవతారంలో ఋషుల ముందు నడయాడి వారిని మోహంలో ముంచి తద్వారా తమ తప్పులు తెలుసుకునేలా చేసి మరల ధర్మానుష్టానం చేసేవిధంగా బోధించి వచ్చారు. చిదంబరంలో నటరాజేశ్వరుని చరితం దీనికి అనుసంధానించి చెబుతారు.

భస్మాసురునికి ఎవరి తలపైన చేయి పెడితే వారు భస్మం అవుతారన్న విపరీతమైన వరాన్ని అనుగ్రహించిన శివున్నే  వెంటాడుతాడు.. తానిచ్చిన వరం మర్యాద నిలపాలి కావున లీలావినోదంగా శివుడు అతడినుండి పారిపోతున్నట్టు నటించగా తనకు అభేదమైన విష్ణువు ఆ మూర్ఖ అసురుని మోహింప చెయ్యడానికి మోహిని అవతారం స్వీకరించి అతడి తలమీదే అతని చెయ్యి పెట్టుకుని భస్మమైపోయేట్టు చేస్తాడు.

అంతగా ప్రాచుర్యం పొందని మరొక కధ గణేశపురాణంలో ఉంది. సూర్యుని అనుగ్రహంతో విరోచనుడు అజేయమైన ఒక మాయా కిరీటం సంపాదిస్తాడు. దాని వలన అతడు లోక కంటకునిగా మారి స్వర్గాన్ని ఆక్రమించి అల్లకల్లోలం సృష్టించగా మోహినీ అవతారంలో అతడిని మోహంలో ముంచి ఆ కిరీటం వదులుకునేలా ప్రేరేపించి సుదర్శనానికి బలి ఇస్తాడు ఆ స్తితికారకుడు.

ఇరావంతుడు అనే రాక్షసుడు అర్జునుని కుమారుని దగ్గర మూడు అజేయమైన బాణాల ద్వారా ఎవరినైనా ఓడించగలిగిన శక్తి సాధిస్తే అతడి బ్రహ్మచర్యాన్ని, విపరీతంగా పెరిగిన తేజస్సును ఒజస్సుగా నీరు కార్చడానికి శ్రీకృష్ణుడు తన ఒకానొక అంశగా మోహినిని సృష్టించి తద్వారా అతడిని అచిరకాలంలో నిరోధిస్తాడు అని స్థలపురాణం.

ఇక హర మోహినీ కలయిక వలన హరిహరపుత్రుడు ఉద్భవించారని కొన్ని పురాణాలు ఘోషిస్తే, కొన్ని తమిళ పురాణాలలో అక్కడ అయ్యనార్ అవతరించారని, అగ్ని పురాణం ప్రకారం హనుమంతుడు ఉద్భవించారని, లింగపురాణం ప్రకారం ఉమయంగనగా విష్ణువు శివుని పుత్రుడైన స్కంధునికి పుట్టుక కలిగించినట్టు చెబుతాయి. కొన్ని కధలు కల్పభేదాలుగా కనిపిస్తాయి. కొన్ని మరొక దానితో విభేదించినట్టు కనబడతాయి కానీ ఇందులో ఉన్న ఒక ధర్మసూక్ష్మం నారాయణ నారాయణి ఒకటే… ఒక్క పరబ్రహ్మం వివిధ ఆకారాలలో విధినిర్వహణ చేస్తు ఒకొక్క కార్యాన్ని చక్కబెట్టడానికి కొన్ని శక్తుల కలయిక చెయ్యాలి కాబట్టి ఇటువంటి లీలలు చేస్తారు. వీటిని గుర్తు చేస్తూ మన కలియుగ దైవం శ్రీ వేంకటేశుని బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజున మోహినీ అవతారంలో మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు.

Exit mobile version