ఈ ప్రాచీన ఆలయంలో వెలసిన దేవుడు, భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ దేవదేవుడిగా ప్రసిద్ధి చెందినాడు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? శోభనాచల అంటే ఏంటి? ఇంకా ఇక్కడి ఆలయ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, విజయవాడ నుండి నూజివీడుకు వెళ్లే మార్గంలో విజయవాడ నుండి 25 కీ.మీ. దూరంలో అగిరిపల్లి అనే గ్రామంలో శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న కొండను శోభనాచలం అంటారు. ఇక్కడ శ్రీ శోభనాచల వ్యాఘ్ర నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిశారని చెబుతారు. ఈయన అత్యంత మహిమ గల స్వామి. ఈ అగిరిపల్లి దక్షిణ సింహాచలం అని ప్రసిద్ధి పొందినది.
అయితే కిరి అనే మాటకు వరాహ అనే అర్ధం ఉంది. కనుక ఈ ప్రాంతానికి అకిరిపల్లి అనే పేరు వచ్చినట్లు చెబుతారు. రాను రాను ఇది ఆగిరిపల్లిగా మార్పు చెందినది. తమిళ ఆళ్వార్లు కూడా ఇక్కడ కొలువుతీరి ఉన్నారు. ఆలయంలో నమ్మాళ్వార్ అధ్యయనోత్సవం ప్రతి ఏటా జరుగుతుంది.
ఇక ఆలయ పురాణానికి వస్తే, పూర్వం శుభవ్రతుడనే రాజు ఇక్కడ శివకేశవుల కోసం గొప్ప తపస్సు చేసి, వారిని ఈ కొండపై తనకు దర్శనమివ్వాల్సిందిగా కోరాడు. అప్పుడు భక్తుని కోరిక మేరకు శివుడు, శ్రీ మహావిష్ణువు కొండపై వెలువగా, శుభవ్రతుడి పేర ఈ కొండ శోభనాద్రిగా పిలువబడింది. శోభనాద్రికి పశ్చిమదిశగా మహిమగల వరహతీర్థం ఉంది. అయితే వరాహావతార ఘట్టంలో శ్రీ స్వామివారిచే ఇది నిర్మించబడిందని ప్రతీతి. ఇక క్రీ.శ.17వ శతాబ్ది ప్రారంభంలో అచ్యుత భాగవతి, అనంత భాగవతి అనే పరమ భక్తులు ఉండేవారు. ఒకరోజు పరమేశ్వరుడు వీరిరువురికీ కలలో కనబడి శివకేశవులం ఇక్కడ వెలసి ఉన్నామని, తమకు పూజాదికాలు ఒనర్చాలని కోరాడు. మరునాడు వీరిరువురూ తమ స్వప్న వృత్తాంతం గ్రామస్తులకు చెప్పగా అందరూ దేవాలయ నిర్మాణానికి కావలసిన స్థలం చూసేందుకు బయలుదేరారు.
అక్కడ అంతా అరణ్య ప్రాంతం కావడం, భక్తులు తనను గుర్తించలేకపోవడం చూసిన పరమేశ్వరుడు తంగేడు, ఇతర పూలను బారులు తీర్చి తాము ఉన్న ప్రదేశాన్ని గుర్తించేటట్టు చేశాడు. దాంతో అందరూ శోభనగిరి శిఖరం మీద వ్యాఘ్రలక్ష్మీ నరసింహ స్వరూపంలో విష్ణుమూర్తిని, చేరువలో నీలగళుని ఆకారంలో పరమశివుణ్ణి చూశారు. వెంటనే స్వామికి అభిషేకం చేద్దామని నీటి కోసం వెతకగా కొలను కనిపించింది. ఆ నీటిని తీసుకువచ్చి అభిషేకం చేసి సంతృప్తులయ్యారు. తర్వాత అచ్యుత, అనంత భాగవతులు శ్రీ స్వామివారికి ఆలయం నిర్మించి ఉత్సవాలు చేయడం ప్రారంభించారు. శ్రీ శోభనాచలస్వామికి జరిపే ఉత్సవాలు చూసి కొండపల్లి ఫిర్కా ముజుందారు ఇందుపూడి లక్ష్మీనారాయణరావు సంతోషించి ఈ అగ్రహారాన్ని భగవత్ కైంకర్యంగా ఇచ్చారని శాసనాల ద్వారా తెలుస్తోంది.
ప్రతి రోజు కొండమీద ఉన్న ఆలయంలో ప్రత్యేకంగా అమరిక చేసిన గూట్లో దీపాన్ని పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ జ్యోతి విజయవాడ వరకు కనిపించేది చెబుతారు. కుజ దోషం ఉన్నవారు, వివాహం ఆలస్యమవుతున్నవారు ఈ స్వామివారికి కళ్యాణం చేయిస్తే వారికీ వివాహం కాగలదని భక్తుల ప్రగాఢ నమ్మకం.